Telugu Global
Sports

వెయ్యిరోజులుగా సెంచరీ లేని విరాట్!

ఆధునిక క్రికెట్లో అలవోకగా సెంచరీలు బాదటంలో దిట్టగా పేరుపొందిన భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కొహ్లీని మూడంకెల స్కోరు వెక్కిరిస్తూ వస్తోంది.

Virat Kohli
X

Virat Kohli

ఆధునిక క్రికెట్లో అలవోకగా సెంచరీలు బాదటంలో దిట్టగా పేరుపొందిన భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కొహ్లీని మూడంకెల స్కోరు వెక్కిరిస్తూ వస్తోంది. ఇప్పటికే టెస్టులు, వన్డేలలో కలిపి 70 సెంచరీలు బాదిన విరాట్ 71వ అంతర్జాతీయ శతకం కోసం గత 1000 రోజులుగా అతని తో పాటు అభిమానులు సైతం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూనే ఉన్నారు

2019లో టెస్టు చివరి శతకం...

విరాట్ కొహ్లీ తన చివరి అంతర్జాతీయ టెస్టు సెంచరీని కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన డే-నైట్ టెస్టులో సాధించాడు. 2019 నవంబర్ 23న ఈ శతకం సాధించిన తర్వాత నుంచి కొహ్లీ మూడంకెల స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి 136 పరుగులు చేశాడు.

రాంచీ వేదికగా వన్డే చివరి సెంచరీ...

వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల వరుసలో సచిన్ తరువాతి స్థానంలో ఉన్న విరాట్ కొహ్లీ..1000 రోజుల క్రితం తన చివరి సెంచరీ నమోదు చేశాడు.

2019 మార్చి 8న రాంచీ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ శతకం బాదాడు.

2020 సీజన్లో భాగంగా మూడు ఫార్మాట్లలో కలసి మొత్తం 30 అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 1014 పరుగులతో 34.96 సగటు నమోదు చేశాడు. కనీసం ఒక్క శతకమూ సాధించలేకపోయాడు.

కేవలం 9 అర్థశతకాలు మాత్రమే సాధించిన కొహ్లీ 17సార్లు 30 పరుగుల కంటే తక్కువ స్కోర్లకే అవుటయ్యాడు.

82 ఇన్నింగ్స్ లో సెంచరీ లేమి!

2019 సీజన్ తరువాత క్రికెట్ మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్ 68 మ్యాచ్‌లలో ఆడాడు. మొత్తం 82 ఇన్నింగ్స్‌లలో కేవలం 34.05 సగటుతో 2,554 పరుగులు చేయగలిగాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. వీటిని శతకాలుగా మలచుకోడంలో విఫలమయ్యాడు.

2019లో బంగ్లాదేశ్ పై టెస్టులో తన చివరి శతకం బాదిన విరాట్ ఆ తర్వాత..18 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 32 ఇన్నింగ్స్‌లలో 27.25 సగటుతో 872 పరుగులు సాధించాడు. ఆరుసార్లు మాత్రమే 50 పరుగుల మార్కును దాటాడు.

ఆఖరి అంతర్జాతీయ శతకం తర్వాత 23 వన్డేలు ఆడిన కోహ్లీ..35.82 సగటుతో 824 పరుగులు సాధించాడు. 89 పరుగులే అత్యధిక స్కోరుగా నమోదయ్యింది. వన్డేలలో 10 అర్ధ సెంచరీలు కొట్టాడు. కానీ శతకాన్ని మాత్రం నమోదు చేయలేకపోయాడు.

27 టీ-20 మ్యాచ్ లు ఆడిన విరాట్ 42.90 సగటుతో 858 పరుగులు సాధించాడు. 94 పరుగుల నాటౌట్ తో అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు. చివరి సెంచరీ తర్వాత టీ- 20ల్లో ఎనిమిది అర్ధ సెంచరీలు కొట్టాడు. కానీ శతకాన్ని మాత్రం కోహ్లీ సాధించలేకపోయాడు.

గత మూడేళ్లుగా శతకహీనం...

ఒక్కో సీజన్లో వెయ్యికి పైగా పరుగులు చేయడం విరాట్ కొహ్లీకి బ్యాటుతో పెట్టిన విద్య. అయితే..2020, 2021, 2022 సీజన్లో విరాట్ తన స్థాయికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని అతని రికార్డులు చెప్పకనే చెబుతున్నాయి.

గత మూడేళ్లలో ఒక్క కాలెండర్ ఇయర్ లోనూ కోహ్లీ కనీసం ఒక్కసారి కూడా 1000 పరుగుల మార్కును దాటలేకపోయాడు. 2019లో చివరి శతకం సాధించిన తర్వాత కోహ్లీ ఆ ఏడాది చివర్లో ఆరు మ్యాచ్‌లు ఆడాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 68.00 సగటుతో 272 పరుగులు చేశాడు.94 పరుగుల నాటౌట్ అత్యుత్తమ స్కోరుగా నమోదయ్యింది.. మూడు అర్ధ సెంచరీలతో 2019 సీజన్ ను సంతృప్తిగానే ముగించాడు.

2020లో కోహ్లీ 22 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 842 పరుగులు, 2021లో 24 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 964 పరుగులు సాధించాడు. ఇక ప్రస్తుత 2022 సీజన్ ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడిన విరాట్ ..19 ఇన్నింగ్స్‌లో.. 25.05 సగటుతో 476 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 79 పరుగుల అత్యుత్తమ స్కోరు. ఇప్పటి వరకు కేవలం నాలుగు అర్ధ సెంచరీలు మాత్రమే సాధించగలిగాడు.

సీజన్ల వారీగా విరాట్ శతకాలు...

2008 సీజన్లో ఒక్క శతకమూ లేని విరాట్..2009లో తొలి సెంచరీతో బోణీ కొట్టాడు. ఆ తర్వాత నుంచి సెంచరీల జోరు కొనసాగింది. 2010లో 3 సెంచరీలు, 2011లో నాలుగు, 2012లో 8, 2013లో 6, 2014లో 8, 2015లో 4, 2016లో 7, 2017లో 11, 2018లో 11, 2019లో 7 శతకాలు బాదడం ద్వారా విరాట్ మెరుపువేగంతో 70సెంచరీల గమ్యాన్ని చేరుకోగలిగాడు.

టెస్టుల్లో 27, వన్డేల్లో 43 శతకాలు నమోదు చేసిన విరాట్ గత మూడేళ్లుగా...గత 1000రోజులుగా సెంచరీల లేమితో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన విరాట్ కొహ్లీ శతకాలు సాధించడం వ్యక్తిగతంగా అతనికి ఎంత అవసరమో...భారత, అంతర్జాతీయ క్రికెట్ కు సైతం అంతే అవసరం.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆగస్టు 28 నుంచి ప్రారంభంకానున్న 2022 ఆసియాకప్ టోర్నీ ద్వారా విరాట్ సెంచరీల లేమి దశ నుంచి బయటపడాలని కోరుకొందాం.

First Published:  20 Aug 2022 1:16 PM IST
Next Story