Telugu Global
Sports

విరాట్ కొహ్లీ ఆవేశానికి మూల్యం కోటిరూపాయలు!

బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ ఆవేశాన్ని అదుపు చేసుకోలేక భారీమూల్యమే చెల్లిస్తూ వస్తున్నాడు.

విరాట్ కొహ్లీ ఆవేశానికి మూల్యం కోటిరూపాయలు!
X

బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ ఆవేశాన్ని అదుపు చేసుకోలేక భారీమూల్యమే చెల్లిస్తూ వస్తున్నాడు. క్రికెట్ స్ఫూర్తినే మంటగలుపుతూ ఇబ్బందులు కొని తెచ్చుకొంటున్నాడు.

భారత మాజీ కెప్టెన్ కమ్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ తన బ్యాటింగ్ తో పాటు ఆవేశంతోనూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు.

క్రికెటర్ గా పరిణతి సాధించినా, వయసు మీద పడుతున్నా ఆవేశాన్ని అదుపు చేసుకోలేని కుర్రక్రికెటర్ గా ప్రవర్తిస్తూ తగిన మూల్యమే చెల్లిస్తున్నాడు.

లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ ముగిసిన వెంటనే..లక్నో మెంటార్ గౌతం గంభీర్ తో వాగ్వాదానికి దిగి దోషిగా తేలాడు.

బెంగళూరు విజేతగా నిలిచినా...!

లక్నో సూపర్ జెయింట్స్ తో ముగిసిన లోస్కోరింగ్ సమరంలో బెంగళూరు 18 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకొంది. తమజట్టు మ్యాచ్ నెగ్గడంతో విరాట్ ఆవేశాన్ని అదుపు చేసుకోలేక..లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లతో ఇష్టంవచ్చినట్లు ప్రవర్తించాడు.

లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్ ను పరుషపదజాలంతో ఏదో అనబోతుండగా..లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ వచ్చి జోక్యం చేసుకొన్నాడు. తమ ఆటగాడిని దూషిస్తే తనను దూషించినట్లేనంటూ విరాట్ ను అదుపు చేయటానికి ప్రయత్నించాడు.

గతంలో ఢిల్లీ జట్టుతో పాటు..భారతజట్టు సభ్యులుగా కలసి ఆడిన గంభీర్, విరాట్ కొహ్లీ..ఒకరినొకరు దూషించుకొంటూ..కలబడినంత పని చేశారు.లక్నో కెప్టెన్ రాహుల్, స్పిన్నర్ అమిత్ మిశ్రా అడ్డుపడి ఘర్షణ జరుగకుండా నివారించగలిగారు.

కోటి రూపాయల జరిమానా!

క్రికెట్ నియమావళిని విస్మరించి..వాగ్వాదానికి దిగిన విరాట్ కొహ్లీ, గౌతం గంభీర్ లకు మ్యాచ్ రిఫరీ..మ్యాచ్ ఫీజులో నూటికి నూరు శాతం కోత విధించారు. అంతేకాదు..లక్నోకే చెందిన పేసర్ నవీనుల్ హక్ కు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించినట్లు బీసీసీఐ ప్రకటించింది.

బెంగళూరు ఫ్రాంచైజీ నుంచి సీజన్ కు 15 కోట్ల రూపాయలు వేతనంగా అందుకొంటున్న విరాట్ కొహ్లీకి ..ఆడిన ప్రతిమ్యాచ్ కు కోటి రూపాయల చొప్పున అందుతోంది.

దీంతో మ్యాచ్ ఫీజుగా అందుకొంటున్న కోటిరూపాయలను జరిమానాగా విరాట్ బీసీసీఐకి చెల్లించాల్సి ఉంది. మరోవైపు..లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ కు సైతం నూటికి నూరుశాతం జరిమానా విధించారు. అయితే..గంభీర్ కు లక్నో ఫ్రాంచైజీ ఎంత జీతం చెల్లిస్తుందో బయటకు పొక్కడం లేదు.

నవీనుల్ హక్ తో పాటు లక్నో మెంటార్ గౌతం గంభీర్ సైతం తాము తప్పు చేసినట్లు ఒప్పుకొన్నారు, గంభీర్ కు సైతం నూటికి నూరుశాతం జరిమానాగా విధించినట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఫ్రాంచైజీల నెత్తినే జరిమానాల భారం..

ఐపీఎల్ నియమావళిని అతిక్రమించిన కెప్టెన్లు, ఆటగాళ్లతో పాటు జట్లకు సైతం తరచూ ఏదో ఒకరూపంలో జరిమానాలు పడుతూ ఉంటాయి. నిర్ణతసమయంలో ఓవర్లు పూర్తి చేయలేని జట్ల కెప్టెన్లకు భారీగా మ్యాచ్ ఫీజులో కోత విధించడం పరిపాటిగా మారింది.

తమకు పడిన జరిమానాను ఆటగాళ్లు, జట్టు సిబ్బంది చెల్లించడం లేదు. వారి తరపున జట్టు యాజమాన్యాలే 12 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకూ చెల్లిస్తూ వస్తున్నాయి.

ఇప్పుడు విరాట్ కొహ్లీ, నవీనుల్ హక్ లతో పాటు లక్నో మెంటార్ గౌతం గంభీర్ చెల్లించాల్సిన జరిమానా మొత్తాన్ని బెంగళూరు, లక్నో ఫ్రాంచైజీలే చెల్లించనున్నాయి.

జరిమానా వద్దు, సస్పెన్షన్ లతోనే సరి- గవాస్కర్

ఐపీఎల్ నియమావళిని అతిక్రమించే ఆటగాళ్లు, సహాక సిబ్బందిపై జరిమానాలు విధించే బదులు..సస్పెన్షల్ లు విధిస్తే దారికి వస్తారని భారత మాజీ కెప్టెన్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

గతంలో ఢిల్లీజట్టు తరపున దేశవాళీ క్రికెట్ పోటీలలోనూ, భారత్ తరపున అంతర్జాతీయమ్యాచ్ ల్లోనూ కలసి ఆడిన విరాట్ కొహ్లీ, గౌతం గంభీర్ సంయమనం పాటించాలని, ఆవేశాన్ని అదుపు చేసుకోవాలని దిగ్గజ కామెంటీటర్ సునీల్ గవాస్కర్ హితవు పలికారు.

మాట మాట అనుకోటం ఆటలో భాగమే కానీ..వాగ్వాదాలు, కలబడటం లాంటి సంఘటనలు క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని గుర్తు చేశారు. మ్యాచ్ ఫీజుల్లో కోత విధిస్తే ఫలితం శూన్యమని, ఆడకుండా ఒకటి లేదా రెండుమ్యాచ్ లు నిషేధం విధిస్తేనే దారికి వస్తారని అభిప్రాయపడ్డారు.

ఇకముందు..ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోరాదని తాను గట్టిగా భావిస్తున్నానని, క్రికెట్ ప్రత్యక్షప్రసారాలలో తమ ప్రవర్తన ఏమిటో ప్రపంచ మంతా తెలిసిపోతోందన్న వాస్తవాన్ని విరాట్, గంభీర్ లాంటి గ్రహించడం లేదని చెప్పారు.

ఇలాంటి ప్రవర్తనతో క్రికెట్ తో పాటు తామూ పలుచనైపోతామన్న వాస్తవాన్ని గ్రహించాలని సూచించారు.

2013 ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో గంభీర్-కొహ్లీల నడుమ తొలిసారిగా ఘర్షణ చోటు చేసుకొంది. అప్పటి నుంచి ప్రస్తుత 2023 సీజన్ వరకూ..

ఆ ఇద్దరి మధ్య అదే ఘర్షణ, పాతకక్షలు కొనసాగుతూనే ఉన్నాయి...

First Published:  4 May 2023 4:46 PM IST
Next Story