70వేల మాస్క్ లతో విరాట్ 35వ పుట్టినరోజు వేడుకలు!
భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీ 35వ పుట్టినరోజు వేడుకలకు భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వినూత్నంగా ముస్తాబవుతోంది.
భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీ 35వ పుట్టినరోజు వేడుకలకు భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వినూత్నంగా ముస్తాబవుతోంది. స్పెషల్ కేక్ తో పాటు 70వేల మాస్క్ లను సిద్ధం చేస్తోంది.....
భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ 35వ పుట్టినరోజు వేడుకలకు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా నవంబర్ 5న ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే 8వ రౌండ్ మ్యాచ్ లో భాగంగా విరాట్ పుట్టినరోజు వేడుకల్ని ఆతిథ్య బెంగాల్ క్రికెట్ సంఘం నిర్వహించనుంది.
గత మూడేళ్లుగా......
గత మూడేళ్లుగా విసుగువిరామం లేకుండా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడేస్తూ వస్తున్న విరాట్ కు పుట్టినరోజు వేడుకలను ప్రపంచకప్ మ్యాచ్ ల నడుమ జరుపుకోడం ఓ అలవాటుగా మారింది.
2021లో దుబాయ్ వేదికగా స్కాట్లాండ్ తో జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ ఆడుతూ తన 33వ పుట్టినరోజును జరుపుకొన్న విరాట్ ..ఆ తర్వాతి (34వ) పుట్టినరోజును ఆస్ట్ర్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో క్రీడాపాత్రికేయుల సమక్షంలో జరుపుకొన్నాడు.
మరికొద్దిరోజుల్లో తన 35వ పుట్టినరోజును 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ మ్యాచ్ ఆడుతూ జరుపుకోడానికి సిద్ధమవుతున్నాడు.
కోల్ కతాలో అట్టహాసంగా ఏర్పాట్లు......
నవంబర్ 5న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికాజట్ల నడుమ జరిగే 8వ రౌండ్ మ్యాచ్ రోజునే విరాట్ కొహ్లీ 35వ పుట్టినరోజు కావడంతో నిర్వాహక బెంగాల్ క్రికెట్ సంఘం పనిలోపనిగా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది.
ప్రస్తుత వన్డే ప్రపంచకప్ లో దంచికొడుతూ కళ్లు చెదిరే విజయాలతో నాకౌట్ రౌండ్ కు చేరువగా వచ్చిన భారత్- దక్షిణాఫ్రికాజట్ల బ్లాక్ బస్టర్ ఫైట్ ను చూడటానికి 80వేల నుంచి లక్షమంది వరకూ అభిమానులు తరలి రానున్నారు.
స్టేడియంలోని అభిమానుల్లో 70వేలమందికి విరాట్ కొహ్లీ మాస్క్ లను అందచేయనున్నారు. కొహ్లీ కోసం బెంగాల్ క్రికెట్ సంఘం ప్రత్యేకంగా తయారు చేసి బహుకరించనుంది.
2009లో కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకపై విరాట్ కొహ్లీ తన తొలి అంతర్జాతీయ శతకం సాధించాడు. ఇన్నింగ్స్ కు ఇన్నింగ్స్ కు నడుమ విరాట్ పుట్టినరోజు వేడుకను నిర్వహించనున్నారు. ఆ తర్వాత బాణసంచాను కాల్చనున్నారు. విరాట్ పుట్టినరోజు వేడుకల కోసం తాము చేసిన ఏర్పాట్ల గురించి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ చైర్మన్ స్నేహశిశ్ గంగూలీ వివరించారు.
దక్షిణాఫ్రికా మ్యాచ్ తో పాటు విరాట్ పుట్టినరోజు వేడుకల్లో పాలుపంచుకోడానికి అభిమానులు భారీసంఖ్యలో తరలిరావడం ఖాయమని బెంగాల్ క్రికెట్ సంఘం అంచనావేస్తోంది.