విరాట్ షో, బంగ్లాపై భారత్ గెలుపు!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ఆతిథ్య భారత్ వరుస విజయాల పరంపర కొనసాగుతోంది. విరాట్ కొహ్లీ అజేయ సెంచరీతో భారత్ 7 వికెట్లతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసి టేబుల్ టాపర్ గా నిలిచింది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ఆతిథ్య భారత్ వరుస విజయాల పరంపర కొనసాగుతోంది. విరాట్ కొహ్లీ అజేయ సెంచరీతో భారత్ 7 వికెట్లతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసి టేబుల్ టాపర్ గా నిలిచింది.
2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ప్రపంచ నంబర్ వన్ భారత్ జోరు కొనసాగుతోంది. 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో నాలుగుకు నాలుగురౌండ్ల మ్యాచ్ లూ నెగ్గి 8 పాయింట్లతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.
పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ముగిసిన 4వ రౌండ్ పోరులో భారత్ 7 వికెట్ల విజయంతో అజేయంగా నిలిచింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులు సాధించింది.
సమాధానంగా భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 261 పరుగుల స్కోరుతో విజేతగా నిలిచింది. అజేయసెంచరీతో భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఫీల్డింగ్ లో భారత్ మ్యాజిక్..
ఈ కీలకపోరులో ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న బంగ్లాజట్టుకు ఓపెనర్లు లిట్టన్ దాస్- టాంజిద్ హసన్ మొదటి వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే..భారత స్పిన్ జోడీ రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వెంట వెంటనే వికెట్లు పడగొడుతూ బంగ్లాను ఆత్మరక్షణలో పడేశారు.
టాంజిద్ హసన్ 51 పరుగులకు కుల్దీప్ బౌలింగ్ లోనూ, లిట్టన్ దాస్ 61 పరుగులకు జడేజా బౌలింగ్ లోనూ దొరికిపోడంతో బంగ్లా పతనం ప్రారంభమయ్యింది.
ఆ తర్వాత భారత కీపర్ రాహుల్, జడేజా పట్టిన సూపర్ క్యాచ్ లతో ఆట స్వరూపమే మారిపోయింది. మిడిలార్డర్లో మహ్మదుల్లా పోరాడి ఆడి 46 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ 256 పరుగుల స్కోరు సాధించగలిగింది.
భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజా తలో రెండు వికెట్లు, కుల్దీప్, శార్దూల్ చెరో వికెట్ పడగొట్టారు.
రోహిత్ ధూమ్ ధామ్ హిట్టింగ్..
మ్యాచ్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 257 పరుగులు చేయాల్సిన భారత్ కు ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- శుభ్ మన్ గిల్ 12.4 ఓవర్లలోనే మొదటి వికెట్ కు 88 పరుగులతో కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఓవర్ నుంచే తనదైన శైలిలో బంగ్లాబౌలర్లపై విరుచుకు పడి బౌండ్రీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 40 బంతుల్లోనే 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 48 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ పలు అరుదైన రికార్డులు సాధించాడు.
ఒక్క బంతికి 11 పరుగులు....
రోహిత్ అవుటైన వెంటనే క్రీజులోకి వచ్చిన విరాట్ కొహ్లీకి వచ్చీరావడంతోనే జాక్ పాట్ తగిలింది. యువపేసర్ హసన్ మహ్మద్ వరుసగా రెండు నోబాల్స్ వేయడంతో
విరాట్ తొలిబంతినిబౌండ్రీకి, రెండో బంతిని సిక్సర్ కు తరలించడం ద్వారా 11 పరుగులతో పరుగుల వేట మొదలు పెట్టాడు.
మరోవైపు..ఓపెనర్ శుభ్ మన్ గిల్ 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగుల స్కోరుకు, రెండోడౌన్ శ్రేయస్ అయ్యర్ 25 బంతుల్లో 2 బౌండ్రీలతో 19 పరుగుల స్కోర్లకు ఆఫ్ స్పిన్నర్ మిరాజ్ బౌలింగ్ లో దొరికిపోయారు.
దీంతో..భారత్ కు విజయం అందించే బాధ్యత విరాట్ తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ పైన పడింది. ఈ ఇద్దరు నాలుగో వికెట్ కు అజేయ భాగస్వామ్యంతో మరో 8.3 ఓవర్లు మిగిలిఉండగానే 261 పరుగుల స్కోరుతో విజేతగా నిలిచింది.
బంగ్లాదేశ్ తో ప్రపంచకప్ లో ఆడిన ఐదుమ్యాచ్ ల్లో భారత్ కు ఇది నాలుగో విజయం.
విరాట్ 48వ వన్డే శతకం...
మాస్టర్ బ్యాటర్ విరాట్ కొహ్లీ 97 బంతుల్లో 6 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. విరాట్ కొహ్లీకి వన్డే క్రికెట్లో ఇది 38వ శతకం కాగా..ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా రెండో సెంచరీ. ప్రపంచకప్ రన్ చేజ్ లో విరాట్ కు ఇదే తొలిశతకం.
ప్రపంచకప్ లో అత్యధికంగా రోహిత్ శర్మ 7 సెంచరీలు సాధిస్తే..విరాట్ కు మాత్రం ఇది మూడో సెంచరీ మాత్రమే.
అత్యంత వేగంగా 26వేల పరుగులు..
బంగ్లాదేశ్ పై ప్రపంచకప్ శతకంతో విరాట్ కొహ్లీ మరో ప్రపంచ రికార్డు సాధించాడు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలసి అత్యంతవేగంగా 26వేల పరుగులు సాధించిన తొలి, ఏకైక బ్యాటర్ గా నిలిచాడు. 511 ఇన్నింగ్స్ లో విరాట్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకూ మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న రికార్డును విరాట్ అధిగమించాడు.
సచిన్ పేరుతో ఉన్న అత్యధిక వన్డే శతకాల ప్రపంచ రికార్డును అధిగమించాలంటే విరాట్ మరో సెంచరీలు చేయాల్సి ఉంది.
క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలిపి విరాట్ కు ఇది 78వ శతకం. సచిన్ శతశతకాల రికార్డును అధిగమించాలంటే మరో 22 సెంచరీలు చేయాలి.
పూణే వేదికగా 551 పరుగుల విరాట్..
ప్రస్తుత ప్రపంచకప్ మ్యాచ్ తో సహా పూణే వేదికగా ఆడిన 8 ఇన్నింగ్స్ లో విరాట్ 551 పరుగులతో 78.71 సగటు, 94.34 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు. పూణే వేదికగానే విరాట్ మూడు శతకాలు, మూడు అర్థశతకాలు చొప్పున సాధించాడు.
2013లో ఆస్ట్ర్రేలియాపైన 61 పరుగులు, 2017లో ఇంగ్లండ్ పై 122, 2017లో న్యూజిలాండ్ పై 29, 2018లో వెస్టిండీస్ పై 107, 2021లో ఇంగ్లండ్ పై 56, 2021లో ఇంగ్లండ్ పైనే 66, 2021లో ఇంగ్లండ్ పై 7 పరుగుల స్కోర్లు సాధించగా..బంగ్లాదేశ్ తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా 5వ రౌండ్ మ్యాచ్ ను ధర్మశాల వేదికగా న్యూజిలాండ్ తో భారత్ ఆడాల్సి ఉంది.
ఇప్పటి వరకూ జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మొదటి నాలుగు రౌండ్లలో నాలుగు విజయాలు సాధించినజట్లుగా భారత్, న్యూజిలాండ్ మాత్రమే నిలిచాయి.