Telugu Global
Sports

ఐదేళ్ల తర్వాత విరాట్ కొహ్లీ తొలి ' విదేశీ ' శతకం!

భారత క్రికెట్ నయా రన్ మెషీన్ విరాట్ కొహ్లీ ఐదేళ్ల తర్వాత విదేశీగడ్డపై టెస్టు తొలిశతకం సాధించాడు. పలువురు క్రికెట్ దిగ్గజాలకు దక్కని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నాడు.

విరాట్ కొహ్లీ
X

విరాట్ కొహ్లీ

భారత క్రికెట్ నయా రన్ మెషీన్ విరాట్ కొహ్లీ ఐదేళ్ల తర్వాత విదేశీగడ్డపై టెస్టు తొలిశతకం సాధించాడు. పలువురు క్రికెట్ దిగ్గజాలకు దక్కని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నాడు.

భారత్- వెస్టిండీస్ జట్ల వందో టెస్టుమ్యాచ్ ను భారత 'రన్ మెషీన్' విరాట్ కొహ్లీ చిరస్మరణీయం చేసుకొన్నాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో లోని క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐసీసీటెస్టు లీగ్ రెండోమ్యాచ్ తొలిఇన్నింగ్స్‌ ను విరాట్ కొహ్లీ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొన్నాడు.

విదేశీగడ్డపై జరిగిన టెస్టు సిరీస్ ల్లో శతకం కోసం గత ఐదేళ్లుగా నిరీక్షిస్తూ వచ్చిన విరాట్ ఎట్టకేలకు మూడంకెల స్కోరు సాధించగలిగాడు.

500వ మ్యాచ్ లో 76వ సెంచరీ...

13 సంవత్సరాల తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ లో విరాట్ మొత్తం మూడు ఫార్మాట్లలో కలిసి 500 మ్యాచ్ లు ఆడిన భారత నాలుగో క్రికెటర్ రికార్డు సాధించాడు.

అంతేకాదు..తన 500వ మ్యాచ్ లో శతకం బాదడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.

క్వీన్స్ పార్క్ పిచ్ పైన రెండోరోజుఆటలో విరాట్ మొత్తం 206 బంతులు ఎదుర్కొని 121 పరుగులతో తన అంతర్జాతీయ శతకాల సంఖ్యను 76కు పెంచుకోగలిగాడు.

విరాట్ 45 సింగిల్స్, 13 డబుల్స్ తో సహా మొత్తం 77 పరుగులతో పాటు 11 బౌండ్రీలు సైతం సాధించాడు. బ్యాట్స్ మన్ సత్తాకు సవాలుగా నిలిచిన వాతావరణంలో విరాట్ తిరుగులేని తన ఫిట్ నెస్ తో సఫలం కాగలిగాడు.

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో కలసి 5వ వికెట్ కు 159 పరుగుల భారీభాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా టెస్టు క్రికెట్లో 29వ శతకాన్ని సాధించగలిగాడు.

2018 తర్వాత తొలి శతకం..

తన కెరియర్ లో ఇప్పటి వరకూ సాధించిన మొత్తం 29 టెస్టు శతకాలలో 15 విదేశీగడ్డపైన సాధించినవే ఉన్నాయి. అయితే 2018 సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్ లో తన చివరి విదేశీ శతకం బాదిన విరాట్..ఆ తర్వాత ఐదేళ్లపాటు సెంచరీకోసం ఎదురుచూడాల్సి వచ్చింది.

తన 29వ శతకంతో విరాట్ పలు రికార్డులను అధిగమించాడు. టెస్టు చరిత్రలో ఇప్పటికే 29 సెంచరీలు సాధించిన సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ రికార్డును సమం చేసిన విరాట్.

..అతితక్కువ ఇన్నింగ్స్ లో 29 సెంచరీలు బాదిన బ్యాటర్ గా మాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డును సైతం తెరమరుగు చేయగలిగాడు.

అంతేకాదు..500వ అంతర్జాతీయమ్యాచ్ ఆడుతూ శతకం బాదిన తొలి బ్యాటర్ గా విరాట్ ప్రపంచ రికార్డు నెలకొల్పగలిగాడు.

వెస్టిండీస్ ప్రత్యర్థిగా భారత వందో టెస్టుమ్యాచ్, తన కెరియర్ లో 500వ అంతర్జాతీయమ్యాచ్ లో సెంచరీ నమోదు చేయడం తనకు ఎనలేని సంతృప్తినిచ్చిందని రెండోరోజు ఆట ముగిసిన అనంతరం విరాట్ చెప్పాడు.

మాస్టర్ సచిన్, క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్, కూల్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ తర్వాత 500 మ్యాచ్ లు ఆడిన నాలుగో భారత క్రికెటర్ గా విరాట్ రికార్డుల్లో చేరాడు.

స‌చిన్ 587 ఇన్నింగ్స్‌ల్లో 29వ టెస్టు శతకం సాధించగలిగాడు. అదే విరాట్ మాత్రం సచిన్ కంటే అతితక్కువ ( 559 ) ఇన్నింగ్స్ లోనే..ఈ ఘనత సాధించాడు. స‌చిన్ కంటే 28 కంటే త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ రికార్డు శ‌త‌కం నమోదు చేయగలిగాడు.

విరాట్ కు ముందే స‌చిన్(664), ఎంఎస్ ధోనీ(538), రాహుల్ ద్ర‌విడ్‌(509)లు టీమిండియా త‌ర‌ఫున‌ 500ల మ్యాచ్‌లు ఆడారు.

500 మ్యాచ్ లు, 76 శతకాలు, 25వేల 582 పరుగులు...

విరాట్ గత 13 ఏళ్లుగా..క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ఆడిన 500 అంతర్జాతీయ మ్యాచ్ లు, 559 ఇన్నింగ్స్ లో 76 శతకాలు, 131 అర్థశతకాలతో సహా 25వేల 582 పరుగులు సాధించాడు. 254 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరుతో 53. 63 సగటు నమోదు చేశాడు.

ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ ప్రధాన ప్రత్యర్థి బ్యాటర్లు స్టీవ్ స్మిత్ 32, జో రూట్ 30 టెస్టు శతకాలతో మొదటి రెండుస్థానాలలో కొనసాగుతున్నారు. విరాట్ 29, కేన్ విలియమ్స్ సన్ 28 శతకాలతో మూడు, నాలుగు స్థానాలలో ఉన్నారు.

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలసి విరాట్ 76 శతకాలతో అగ్రస్థానంలో నిలిస్తే...జో రూట్ 46, డేవిడ్ వార్నర్ 45, స్టీవ్ స్మిత్, రోహిత్ శర్మ చెరో 44 శతకాలతో ఆ తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు.

టెస్టు లీగ్ లో అత్యధిక పరుగుల విరాట్...

2019లో ప్రవేశపెట్టిన ఐసీసీ టెస్టు లీగ్ లో సైతం అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్ ఘనతను సైతం విరాట్ దక్కించుకొన్నాడు. మొత్తం 34 టెస్టు లీగ్ మ్యాచ్ లు ఆడిన విరాట్ 56 ఇన్నింగ్స్ లో 4 సెంచరీలు, 9 అర్థసెంచరీలతో 2వేల 063 పరుగులు సాధించాడు. ఇందులో 254 పరుగుల నాటౌట్ స్కోరు సైతం ఉంది.

టెస్టు లీగ్ లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ 3వేల 891 పరుగులతో టాపర్ గా నిలిచాడు.

ప్రస్తుత 2023 సీజన్లో విరాట్ మొత్తం 7 టెస్టులు ఆడి 2 శతకాలతో పాటు.. ఓ హాఫ్ సెంచరీతో 557 పరుగులతో 55.70 సగటు నమోదు చేశాడు.

మొత్తం 10 ఇన్నింగ్స్ లో విరాట్ 186 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయగలిగాడు.

First Published:  22 July 2023 8:00 AM GMT
Next Story