Telugu Global
Sports

ఒకే వేదికలో 3వేల పరుగులు, విరాట్ కొహ్లీ ప్రపంచ రికార్డు!

ఐపీఎల్ కింగ్ విరాట్ కొహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు. ఒకే వేదికలో 3వేల పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Virat Kohli Records: Virat Kohli becomes batter with most runs at a single venue
X

ఒకే వేదికలో 3వేల పరుగులు, విరాట్ కొహ్లీ ప్రపంచ రికార్డు!

ఐపీఎల్ కింగ్ విరాట్ కొహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు. ఒకే వేదికలో 3వేల పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఐపీఎల్ సూపర్ స్టార్ బ్యాటర్, రికార్డుల కింగ్ విరాట్ కొహ్లీ మరో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ చరిత్రలో కేవలం ఒకే వేదికగా 3వేలకు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.

బెంగళూరు రన్ మెషీన్....

గత 16 సీజన్లుగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐపీఎల్ టీ-20 మ్యాచ్ లు ఆడుతూ వస్తున్న 34 సంవత్సరాల విరాట్ కొహ్లీ..కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన 8వ రౌండ్ మ్యాచ్ ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన పోరులో విజేతగా నిలవాలంటే 201 పరుగులు చేయాల్సిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరపున విరాట్ ఒంటరిపోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది.

37 బంతులు ఎదుర్కొని 54 పరుగులు సాధించినా తనజట్టును విజేతగా నిలుపలేకపోయాడు. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన ఎనిమిది రౌండ్ల మ్యాచ్ ల్లో మూడుసార్లు డకౌట్లయిన విరాట్ ..మిగిలిన ఐదుమ్యాచ్ ల్లోనూ అర్థశతకాలు బాదటం విశేషం.

92 ఇన్నింగ్స్ లో 3వేల 15 పరుగులు...

బెంగళూరు ఫ్రాంచైజీ హోంగ్రౌండ్ గా ఉన్న చిన్నస్వామి స్టేడియం వేదికగా 92 టీ-20 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కొహ్లీ మొత్తం 3వేల 15 పరుగులు సాధించాడు. ఈ ఘతన సాధించిన తొలి బ్యాటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఒకే వేదికలో 3వేలకు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా అవతరించాడు. ప్రస్తుత ఐపీఎల్ మొదటి 8 మ్యాచ్ ల్లో మొత్తం 5 హాఫ్ సెంచరీలతో విరాట్ 333 పరుగులతో రెండో అత్యుత్తమ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు.

విరాట్ తర్వాతి స్థానాలలో నిలిచిన బ్యాటర్లలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్లు ముష్ ఫికుర్ రహీం,మహ్మదుల్లా సైతం ఉన్నారు. మీర్పూర్ లోని షేరే- నేషనల్ బంగ్లా స్టేడియం

వేదికగా రహీం 121 ఇన్నింగ్స్ లో 2వేల 989 పరుగులు, మహ్మదుల్లా 130 ఇన్నింగ్స్ లో 2వేల 813 పరుగులు సాధించారు.

ఇంగ్లండ్ డాషింగ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ నాటింగ్ హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా90 ఇన్నింగ్స్ లో 2వేల 749 పరుగులు సాధించాడు.

బంగ్లాదేశ్ మరో మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ మీర్పూర్ వేదికగా 2వేల 706 పరుగులు సాధించడం ద్వారా టాప్ -5లో నిలిచాడు.

కొహ్లీజట్టుకు కోల్ కతా షాక్...

హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన 8వ రౌండ్ మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు కోల్ కతా నైట్ రైడర్స్ 21 పరుగుల విజయంతో షాకిచ్చింది.

మరోవైపు రెండుసార్లు విన్నర్ కోల్ కతా నైట్ రైడర్స్ ప్రస్తుత సీజన్లో వరుస పరాజయాలకు ఎట్టకేలకు ముగింపు పలికింది.

వరుస విజయాలతో దూకుడుమీదున్న బెంగళూరుతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ కీలక పోరులో డాషింగ్ ఓపెనర్ జేసన్ రాయ్, కెప్టెన్ నితీష్ రాణా, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ చెలరేగి ఆడటంతో రాయల్ చాలెంజర్స్ అనుకోని ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

శివమెత్తిన జేసన్ రాయ్..

కోల్ కతా ఓపెనర్ జేసన్ రాయ్ స్థాయికి తగ్గట్టుగా ఆడి బెంగళూరు బౌలింగ్ ఎటాక్ ను కకావికలు చేశాడు. కేవలం 29 బంతుల్లోనే 4ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 పరుగులు చేయటం ద్వారా తన జట్టు 200 భారీస్కోరు సాదించడం లో ప్రధాన పాత్ర వహించాడు.కెప్టెన్ నితీష్ రాణా 21 బంతుల్లో 48, 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో తనవంతు పాత్ర నిర్వర్తించాడు. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 స్కోరు నమోదు చేసింది.

బెంగళూరు బౌలర్లలో లెగ్ స్పిన్నర్ హసరంగ(2/24), విశాక్‌(2/41) చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

మ్యాచ్ నెగ్గాలంటే 201 పరుగులు చేయాల్సిన బెంగళూరు 8 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(37 బంతుల్లో 54, 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు.

కోల్ కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి (3/27), రస్సెల్‌ (2/29), సుయాశ్‌ శర్మ(2/30) రాణించారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

మొదటి 8 రౌండ్ల మ్యాచ్ ల్లో బెంగళూరుకు ఇది నాలుగో ఓటమి కాగా..కోల్ కతాకు మూడో విజయం మాత్రమే.

First Published:  27 April 2023 4:53 PM IST
Next Story