Telugu Global
Sports

మూడేళ్ల తర్వాత విరాట్ తొలివన్డే సెంచరీ!

భారతజట్టు ప్రారంభ ఓవర్లలోనే ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ నష్టపోయిన తరుణంలో క్రీజులోకి అడుగుపెట్టిన దిగ్గజ ఆటగాడు విరాట్ కొహ్లీ తగిన సమయం తీసుకొని మరీ ఆడి మూడే్ళ్ల సుదీర్ఘివిరామం తర్వాత మరో వన్డే సెంచరీ సాధించగలిగాడు.

Virat Kohli mouths after first ODI hundred in three years
X

విరాట్ కొహ్లీ

బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ సమరం భారత్ కు నిరాశను మిగిల్చినా..మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, యువఆటగాడు ఇషాన్ కిషన్ లకు మాత్రం కలకాలం గుర్తుంచుకొనే రికార్డులను అందించింది...

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా బంగ్లాదేశ్ తో బంగ్లాగడ్డపై ఆడిన తీన్మార్ వన్డే సిరీస్...4వ ర్యాంకర్ భారత్ కు చేదుఅనుభవాన్నే మిగిల్చింది. మీర్పూర్ వేదికగా ముగిసిన మొదటి రెండువన్డేలలో...ఒక వికెట్ తేడాతో, ఐదు పరుగుల తేడాతో పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది. దీనికితోడు కెప్టెన్ రోహిత్ శర్మతో సహా ముగ్గురు ఆటగాళ్లు గాయాలపాలు కావాల్సి వచ్చింది.

అయితే ..చిట్టగాంగ్ లోని చోటాగ్రామ్ వేదికగా జరిగిన ఆఖరివన్డేలో మాత్రం భారత్ విశ్వరూపమే ప్రదర్శించింది. 50 ఓవర్లలో 409 పరుగుల భారీస్కోరు సాధించడమే కాదు..పలు ప్రపంచ రికార్డులతో పాటు 227 పరుగుల అతిపెద్ద విజయంతో బంగ్లాను చిత్తుగా ఓడించింది.

విరాట్ 44వ వన్డే శతకం...

భారతజట్టు ప్రారంభ ఓవర్లలోనే ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ నష్టపోయిన తరుణంలో క్రీజులోకి అడుగుపెట్టిన దిగ్గజ ఆటగాడు విరాట్ కొహ్లీ తగిన సమయం తీసుకొని మరీ ఆడి మూడే్ళ్ల సుదీర్ఘివిరామం తర్వాత మరో వన్డే సెంచరీ సాధించగలిగాడు.

వన్డే క్రికెట్లో 2019 నాటికే 43 సెంచరీలు బాదేసిన విరాట్.. ఆ తర్వాతి ఎనిమిది ఇన్నింగ్స్ లో 20 కంటే తక్కువ స్కోర్లకే అవుటయ్యాడు. తన 44వ శతకం కోసం మూడేళ్లపాటు నిరీక్షించాల్సి వచ్చింది. దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్ టీ-20 టోర్నీలో సెంచరీ చేయడం ద్వారా సెంచరీల లేమి నుంచి బయటపడిన విరాట్...వన్డేలలో సైతం ఆలోటును పూడ్చుకోగలిగాడు.

సరికొత్త రికార్డు...

యువఓపెనర్ ఇషాన్ కిషన్ తో కలసి రెండో వికెట్ కు 290 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇషాన్ కిషన్ జోరు కారణంగా విరాట్ ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడగలిగాడు. వన్డే క్రికెట్లో భారత్ కు ఇది మూడో అత్యుత్తమ భాగస్వామ్యం కాగా..ప్రపంచ క్రికెట్లో 7వ అత్యుత్తమ భాగస్వామ్యంగా రికార్డుల్లో చేరింది.

తన మొదటి 50 పరుగుల స్కోరును 54 బంతుల్లో సాధించిన విరాట్..పేసర్ ఇబాదత్ హుస్సేన్ బౌలింగ్ లో ఫైన్ లెగ్ బౌండ్రీ సాధించడం ద్వారా 100 పరుగుల స్కోరును చేరుకోగలిగాడు.

2019లో తన చివరి ( 43వ) వన్డే శతకం సాధించిన విరాట్ కు ఇది 44వ శతకం కాగా..ఓవరాల్ గా 72వ సెంచరీ. అంతేకాదు..వన్డే క్రికెట్లో భారతజట్టు 400కు పైగా స్కోరు సాధించడం ఇది నాలుగోసారి.

ఇషాన్ ప్రపంచ రికార్డు...

ఇక...యువఆటగాడు ఇషాన్ కిషన్ సైతం తనపేరుతో ఓ ప్రపంచ రికార్డు సాధించుకోగలిగాడు. 210 పరుగుల స్కోరు సాధించడం ద్వారా వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా ద్విశతకం బాదిన తొలి బ్యాటర్ గా ఇషాన్ నిలిచాడు. ఇప్పటి వరకూ కరీబియన్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇషాన్ తెరమరుగు చేయగలిగాడు.

కేవలం 126 బంతుల్లోనే 23 బౌండ్రీలు, 9 సిక్సర్లతో డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ మొదటి 100 పరుగుల స్కోరును 85 బంతుల్లో పూర్తి చేయగలిగాడు.

2015 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో జింబాబ్వే ప్రత్యర్థిగా 138 బంతుల్లో క్రిస్ గేల్ డబుల్ సెంచరీ సాధిస్తే..ఇషాన్ ఆ రికార్డును 126 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం.

నాలుగో భారత క్రికెటర్ ఇషాన్...

వన్డే క్రికెట్లో ద్విశతకం సాధించిన నాలుగో భారత క్రికెటర్ గా ఇషాన్ కిషన్ రికార్డుల్లో చేరాడు. మాస్టర్ సచిన్ టెండుల్కర్, బ్లాస్టర్ వీరేంద్ర సెహ్వాగ్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మల సరసన ఇషాన్ కిషన్ నిలిచాడు.

సచిన్, సెహ్వాగ్, తలో డబుల్ సెంచరీ సాధించగా..రోహిత్ శర్మ ఒక్కడే మూడు ద్విశతకాలు నమోదు చేసిన మొనగాడిగా నిలిచాడు.

వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీలు బాదిన విదేశీ క్రికెటర్లలో మార్టిన్ గప్టిల్, ఫకర్ జమాన్, క్రిస్ గేల్ సైతం ఉన్నారు. ఇషాన్ కిషన్ వరకూ మొత్తం ఏడుగురు బ్యాటర్లు మాత్రమే వన్డే క్రికెట్ డబుల్ సెంచరీలు సాధించగలిగారు.

ఇషాన్ కిషన్ 24 బౌండ్రీలు, 10 సిక్సర్లతో 210 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

First Published:  11 Dec 2022 12:30 PM IST
Next Story