Telugu Global
Sports

రాహుల్, విరాట్ లకు రెస్ట్- నేడే ఆఖరి టీ-20

భారత్- దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఆఖరిమ్యాచ్ లో సైతం విజయమే లక్ష్యంగా ఆతిథ్య భారత్ పోటీకు దిగుతోంది.

రాహుల్, విరాట్ లకు రెస్ట్- నేడే ఆఖరి టీ-20
X

భారత్- దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఆఖరిమ్యాచ్ లో సైతం విజయమే లక్ష్యంగా ఆతిథ్య భారత్ పోటీకు దిగుతోంది. సిరీస్ క్లీన్ స్వీప్ విజయానికి భారత్ గురిపెట్టింది...

టీ-20 ప్రపంచకప్ కు టాప్ ర్యాంకర్ భారత సన్నాహాలు మిశ్రమఫలితాలతో సాగుతున్నాయి. ఆస్ట్ర్రేలియా వేదికగా ఈ నెల 16న ప్రారంభంకానున్న ప్రపంచకప్ టోర్నీకి సన్నాహాలలో భాగంగా ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియా, మూడోర్యాంకర్ దక్షిణాఫ్రికాజట్లతో ఆడిన టీ-20 సిరీస్ లను భారత్ కైవసం చేసుకొన్నా..కీలక ఆటగాళ్లు రవీంద్ర జడేజా, జస్ ప్రీత్ బుమ్రాల గాయాలతో అయోమయంలో చిక్కుకొంది. రెండు పటిష్టమైనజట్లపై సిరీస్ విజయాలు సాధించిన సంతోషమే లేకుండా పోయింది.

సిరీస్ స్వీప్ కు భారత్ గురి...

దక్షిణాఫ్రికాతో సిరీస్ లో భాగంగా తిరువనంతపురం, గౌహతీ నగరాలు వేదికగా ముగిసిన మొదటి రెండు టీ-20ల్లో తిరుగులేని విజయాలు సాధించడం ద్వారా 2-0తో భారత్ సిరీస్ ఖాయం చేసుకోడంతో...ఇండోర్ వేదికగా ఈరోజు ప్రారంభమయ్యే ఆఖరిమ్యాచ్ కు అంతగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈనెల 6న ఆస్ట్ర్రేలియాకు బయలుదేరనున్న నేపథ్యంలో ఓపెనర్ రాహుల్, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీలకు తగిన విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

ఇండోర్ మ్యాచ్ లో రాహుల్ కు బదులుగా రిషభ్ పంత్, కొహ్లీ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కు దిగనున్నారు. పేస్ బౌలర్ బుమ్రా స్థానంలో ఉమేశ్ యాదవ్ లేదా మహ్మద్ సిరాజ్ బౌలింగ్ కు దిగే అవకాశం ఉంది.

పరుగుల గని హోల్కార్ స్టేడియం...

పరుగుల గనిగా పేరుపొందిన ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే ఆఖరిపోరులో సైతం పరుగులు వెల్లువెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. గౌహతీ వేదికగా ముగిసిన రెండో టీ-20లో రెండుజట్లు కలసి 450కి పైగా పరుగులు సాధించడంతో హైస్కోరింగ్ తో ముగిసింది. ఆ మ్యాచ్ కు ఇండోర్ మ్యాచ్ కొనసాగింపుకానుందని క్యూరేటర్ అంటున్నారు.రెండుజట్లు బ్యాటింగ్ లో అత్యంత బలంగాను, బౌలింగ్ లో అంతంత మాత్రంగాను కనిపిస్తున్న ఈ రెండుజట్లూ విజయం కోసమే బరిలోకి దిగుతున్నాయి.

వరుసగా మూడో విజయంతో సిరీస్ స్వీప్ సాధించాలన్న పట్టుదలతో భారత్ ఉంటే..కనీసం ఆఖరిమ్యాచ్ లోనైనా నెగ్గడం ద్వారా పరువు దక్కించుకోవాలని సఫారీటీమ్ భావిస్తోంది.

ఇండోర్ స్టేడియం వికెట్,వాతావరణం చేజింగ్ కు ఎంతో అనువుగా ఉన్న కారణంగా ముందుగా టాస్ నెగ్గినజట్టు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకొనే అవకాశాలున్నాయి. రెండుజట్లూ తమ బ్యాటింగ్ స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితే 200కు పైగా స్కోరు సాధించడం ఏమంతకష్టం కాబోదు.

అరుదైన రికార్డుల రోహిత్...

గౌహతీ మ్యాచ్ ద్వారా 400 టీ-20 మ్యాచ్ లు ఆడిన భారత తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ...దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా టీ-20 సిరీస్ నెగ్గిన తొలి భారత కెప్టెన్ గాను మరో అరుదైన రికార్డు సాధించాడు. ఇండోర్ మ్యాచ్ ను సైతం నెగ్గడం ద్వారా క్లీన్ స్వీప్ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

మరోవైపు...ప్రస్తుత సీజన్లో ఇప్పటికే వెయ్యి పరుగుల రికార్డు నెలకొల్పిన మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్..అర్ధశతకాల హ్యాట్రిక్ కు గురిపెట్టాడు. ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో మెరుపు హాఫ్ సెంచరీలు బాదిన సూర్యకుమార్...ఇండోర్ మ్యాచ్ లో సైతం అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

భారత్ ఇప్పటికే 2-0తో సిరీస్ ను ఖాయం చేసుకోడంతో...ఇండోర్ మ్యాచ్ కు అంతగా ప్రాధాన్యం లేకపోయినా..అభిమానులతో స్టేడియం కిటకిటలాడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ మ్యాచ్ కు వర్షం ముప్పులేకున్నా...మ్యాచ్ జరుగుతున్నంత సేపూ ఆకాశం మేఘావృతం కానుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ తో ...ప్రపంచకప్ కు భారత తుదిసన్నాహాలు ముగియనున్నాయి.

First Published:  4 Oct 2022 9:51 AM IST
Next Story