Telugu Global
Sports

ఆసియాలో క్రీడాశ్రీమంతుడు విరాట్ కొహ్లీ!

భారతక్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లోనే కాదు..సంపాదనలోనూ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఆసియాఖండంలోనే అత్యధికంగా ఆర్జించే క్రీడాకారుడిగా నిలిచాడు..

ఆసియాలో క్రీడాశ్రీమంతుడు విరాట్ కొహ్లీ!
X

ఆసియాలో క్రీడాశ్రీమంతుడు విరాట్ కొహ్లీ!

భారతక్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లోనే కాదు..సంపాదనలోనూ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఆసియాఖండంలోనే అత్యధికంగా ఆర్జించే క్రీడాకారుడిగా నిలిచాడు......

విరాట్ కొహ్లీ..భారత, ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచ మేటి క్రికెటర్లలో ఒకడిగా, భారత క్రికెట్ పరుగుల యంత్రంగా రికార్డుల మోత మోగిస్తున్న విరాట్ సంపాదనలోనూ తనకు కారెవ్వరూ సాటి అని చెప్పకనే చెబుతున్నాడు.

స్పోర్టికో సంస్థ ఇటీవలే వెల్లడించిన వివరాల ప్రకారం ఆసియాఖండంలోనే రెండో అత్యధిక శ్రీమంతుడైన ప్లేయర్ గా నిలిచాడు. 2022 సంవత్సరంలో విరాట్ కొహ్లీ వివిధ రూపాలలో 277 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు వివరించింది.

అగ్రస్థానంలో నవోమీ ఒసాకా...

క్రీడలద్వారా అత్యధికంగా ఆర్జించే ఆసియా నంబర్ వన్ ప్లేయర్ గా జపాన్ టెన్నిస్ క్వీన్ నవోమీ ఒసాకా నిలిచింది. గత ఏడాది నవోమీ ఒసాకా 434 కోట్ల రూపాయల సంపాదనతో రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాతి స్థానంలో విరాట్ కొహ్లీ 277 కోట్ల రూపాయల సంపాదనతో నిలిచాడు.

విరాట్ కొహ్లీ భారత క్రికెట్ బోర్డు వార్షిక కాంట్రాక్టు ద్వారా ఏడాదికి 7 కోట్ల రూపాయలు, ఐపీఎల్ కాంట్రాక్టు ద్వారా 15 కోట్ల రూపాయలు, భారత్ తరపున ఆడిన ఒక్కో టెస్టుకు 15 లక్షల రూపాయలు, వన్డే కి 6 లక్షల రూపాయలు, టీ-20 మ్యాచ్ కు 3 లక్షల రూపాయలు చొప్పున అందుకొంటూ వస్తున్నాడు.

వివిధ బహుళజాతి సంస్థలకు ప్రచారకర్తగా, సోషల్ మీడియా వేదికల ద్వారా, ఇతర వ్యాపారాల ద్వారా విరాట్ కోట్ల రూపాయల మేర సంపాదిస్తున్నాడు.

ప్రపంచస్థాయిలో 61వ స్థానం...

ప్రపంచస్థాయిలో 2022 సంవత్సరంలో అత్యధికంగా ఆర్జించిన క్రీడాకారుల వరుసలో విరాట్ కొహ్లీ 61వ స్థానంలో నిలిచాడు. అత్యధికంగా ఆర్జించిన మొదటి 100 మంది ప్రపంచ క్రీడాకారులలో నిలిచిన ఏకైక క్రికెటర్ విరాట్ కొహ్లీ మాత్రమే.

టెస్టు క్రికెట్లో ఇటీవలే తన 29వ శతకం, అంతర్జాతీయ క్రికెట్లో 76వ సెంచరీ నమోదు చేసిన విరాట్ మొత్తం 1040 కోట్ల రూపాయల ఆస్తులతో భారత అగ్రశ్రేణి క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు.

విరాట్ కొహ్లీకి నోయిడాలోని గురుగ్రామ్ తో పాటు ముంబై మహానగరంలోనూ 150 కోట్ల రూపాయలకు పైగా విలువైన విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. రెస్టారెంట్లతో పాటు వివిధరకాల వ్యాపారాలలో విరాట్ కోట్లరూపాయల మేర పెట్టుబడులు పెట్టాడు.

బరోడా మాజీ క్రికెటర్ దే ఆ ఘనత..

క్రికెట్ చరిత్రలోనే అత్యంత శ్రీమంతుడైన క్రికెటర్ ఘనత బరోడా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ సమర్జీత్ సింగ్ రంజిత్ సిన్హ్ గయక్వాడ్ కే దక్కుతుంది. ప్రస్తుతం బరోడా మహారాజాగా ఉన్న సమర్జీత్ సింహ్ కు 20వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయి.

1987-88, 1988-89 సీజన్లలో బరోడాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ప్రాతినిథ్యం వహించిన సమర్జీత్ రిటైర్మెంట్ తర్వాత బరోడా క్రికెట్ సంఘం పాలకుడిగా వ్యవహరించారు.

600 ఎకరాలలో విస్తరించిన లక్ష్మీవిలాస్ ప్యాలెస్ కు ఆయన ఓనర్ గా ఉన్నారు. బ్రిటీష్ రాజవంశీకుల భవనం బకింగ్ హామ్ ప్యాలెస్ కంటే బరోడాలోని లక్ష్మీవిలాస్ ప్యాలెస్ 4 రెట్లు పెద్దదిగా ఉంది.

బరోడా మహారాజా ఫతేసింగ్ రావ్ గయక్వాడ్ 1988లో మృతిచెందడతో ఆయన సోదరుల్లో ఒకరైన సమర్జీత్ సింహ్ కు వారసత్వంగా 20వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సంక్రమించాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన క్రికెటర్ గా సమర్జీత్ సింహ్ కొనసాగుతున్నారు.

సచిన్, ధోనీ ఆస్తులెంత?

కేవలం క్రికెట్ కీడ ద్వారానే ఆర్జించినవారిలో సచిన్ టెండుల్కర్, మహేంద్రసింగ్ ధోనీ ముందువరుసలో నిలుస్తారు. భారత, ప్రపంచ క్రికెట్ ను రెండుదశాబ్దాలుపాటు ఏలిన మాస్టర్ సచిన్ టెండుల్క్ ఆస్తుల విలువ 1300 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు.

గత ఏడాది వివిధ రూపాలలో సచిన్ ఆర్జించిన మొత్తం 50 కోట్లరూపాయలని ఎకనమిక్ టైమ్స్ దినపత్రిక వెల్లడించింది.

భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆస్తులు 1050 కోట్లుగా చెబుతున్నారు. ధోనీ తన పేరుతో ఏర్పాటు చేసిన ధోనీ ఎంటర్ టెయిన్ మెంట్ సంస్థ ...ఎల్ జిఎమ్ ( లెట్స్ గెట్ మ్యారీడ్ ) అనే ఓ తమిళ సినిమాను నిర్మించింది.

జార్ఖండ్ లో అత్యధిక మొత్తంలో ఎడ్వాన్స్ డ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వ్యక్తి మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే.

ప్రపంచక్రీడాకుబేరులు...

ప్రపంచస్థాయిలో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారులలో బాస్కెట్ బాల్ సూపర్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ నంబర్ వన్ గా ఉన్నాడు. లెబ్రాన్ 1037 కోట్లు, సాకర్ స్టార్ లయనల్ మెస్సీ 997 కోట్లు, క్రిస్టియానో రొనాల్డో 939 కోట్లు, బ్రెజిల్ సాకర్ స్టార్ నైమార్ 843 కోట్లు,కానెల్లో అల్వారెజ్ 727 కోట్లతో మొదటి ఐదుస్థానాలలో ఉన్నారు.

277 కోట్ల రూపాయల ఆర్జనతో విరాట్ ఆసియాస్థాయిలో రెండు, ప్రపంచ స్థాయిలో 61 స్థానాలలో నిలిచాడు.

క్రీడల్ని కెరియర్ గా ఎంచుకొంటే...అదీ ప్రపంచ మేటి బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ ప్లేయర్లు కాగలిగితే కోట్లే కోట్లు, డబ్బే డబ్బు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  26 July 2023 2:00 PM IST
Next Story