Telugu Global
Sports

వెయ్యి కోట్ల క్లబ్ లో విరాట్ కొహ్లీ!

భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు..

వెయ్యి కోట్ల క్లబ్ లో విరాట్ కొహ్లీ!
X

భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు..సంపాదనలోనూ దూసుకుపోతున్నాడు. ప్రపంచ క్రికెట్లో అత్యధికంగా ఆర్జిస్తున్నక్రికెటర్ గా నిలిచాడు...

విరాట్ కొహ్లీ..ఈ పేరు వినగానే పరుగులు, సెంచరీలు, రికార్డులు మాత్రమే గుర్తుకు వస్తాయి. అయితే క్రికెటర్ గా గత పుష్కరకాలంలో విరాట్ సంపాదనతో పాటు ఆస్తులు సైతం అంతై..ఇంతై..అంతింతై అన్నట్లుగా పెరిగిపోతూ వస్తున్నాయి.

స్టాక్ గ్రో సంస్థ వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం భారత స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ..ప్రపంచ క్రికెట్లోనే అత్యధికంగా ఆర్జిస్తున్న క్రికెటర్ గా నిలిచాడు. విరాట్ కొహ్లీ ఆస్తుల విలువ 1050 కోట్ల రూపాయలకు చేరినట్లు స్టాక్ గ్రో వెల్లడించింది.

ఐపీఎల్ ద్వారా అత్యధిక ఆదాయం..

34 సంవత్సరాల విరాట్ కొహ్లీ గత 16 సంవత్సరాలుగా ప్రపంచమేటి క్రికెటర్లో ఒకనిగా కొనసాగుతూ వస్తున్నాడు. 2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి బెంగళూరు ఫ్రాంచైజీకి ఆడుతూ వస్తున్న విరాట్ ప్రస్తుతం సీజన్ కు 17 నుంచి 18 కోట్ల రూపాయల వరకూ కాంట్రాక్టు మొత్తంగా అందుకొంటూ వస్తున్నాడు. మొత్తం 16 సీజన్ల ఐపీఎల్ లో విరాట్ సంపాదన 200 కోట్ల రూపాయలకు మించే ఉంటుందని చెబుతున్నారు.

భారత క్రికెట్ బోర్డు వార్షిక కాంట్రాక్టుల్లో భాగంగా ఏ+ గ్రేడ్ ఆటగాడిగా ఏడాదికి 7 కోట్ల రూపాయలు వేతనం అందుకొంటున్నాడు. గాయాలతో జట్టుకు అందుబాటులో లేకున్నా 7 కోట్ల రూపాయల మొత్తం గ్యారెంటీమనీగా బోర్డు చెల్లిస్తోంది.

ఇక..భారతజట్టులో సభ్యుడిగా ఆడిన ఒక్కో టెస్టుమ్యాచ్ కు 15 లక్షల రూపాయలు, ఒక్కో వన్డే మ్యాచ్ కి 6 లక్షల రూపాయలు, ఒక్కో టీ-20 మ్యాచ్ కు 3 లక్షల రూపాయలు చొప్పున మ్యాచ్ ఫీజుగా విరాట్ అందుకొంటున్నాడు.

బ్రాండ్ అంబాసిడర్ గా సంపాదన...

ప్రపంచ వ్యాప్తంగా అంత్యంత విలువైన క్రికెట్ బ్రాండ్ గా పేరున్న విరాట్ కొహ్లీ పలురకాల సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్నాడు. బ్లూ ట్రైబ్, యూనివర్శల్ స్పోర్ట్స్ బిజ్, ఎమ్ పీఎల్, స్పోర్ట్స్ కాన్వో తో సహా మొత్తం అడు స్టార్ట్- అప్స్ కు ప్రచారకర్తగా సేవలు అందిస్తూ రెండుచేతులా ఆర్జిస్తున్నాడు.

అంతేకాదు..సోషల్ మీడియా వేదికల ద్వారాను విరాట్ కళ్లు చెదిరే మొత్త్లాలను సంపాదిస్తున్నాడు. మొత్తం 18 రకాల బ్రాండ్ లను విరాట్ ప్రమోట్ చేస్తున్నాడు.

ఒక్కో బ్రాండ్ ప్రచారం కోసం ఏడాదికి 7 కోట్ల 50 లక్షల నుంచి 10 కోట్ల రూపాయల వరకూ ఫీజుగా అందుకొంటున్నాడు.

కేవలం వివిధ బ్రాండ్ లకు ప్రచార కర్తగా వ్యవహరించడం ద్వారా విరాట్ 175 కోట్ల రూపాయలు సంపాదించగలుగుతున్నాడు. మనదేశంలోనే ప్రముఖ బాలివుడ్ స్టార్లను మించి విరాట్ కు బ్రాండ్ విలువ ఉండటం విశేషం.

ఖరీదైన కార్లు, విలాసవంతమైన భవంతులు..

సోషల్ మీడియా వేదికలైన ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్లలో పోస్టుల ద్వారాను విరాట్ దండిగానే సంపాదిస్తున్నాడు. ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ కు 8 కోట్ల 90 లక్షల రూపాయలు, ట్విట్టర్ పోస్టుకు 2 కోట్ల 50 లక్షల రూపాయల చొప్పున చార్జ్ చేస్తున్నాడు. ఇన్ స్టా గ్రామ్ ద్వారా విరాట్ ను 2 కోట్ల 52 లక్షల మంది అనుసరిస్తున్నారు.

ముంబైలో విరాట్ నివాసముంటున్ననివాసం ఖరీదు 34 కోట్ల రూపాయలు కాగా..గురుగ్రామ్ లోని భవంతి విలువ 80 కోట్ల రూపాయలుగా ఉంది. 31 కోట్ల రూపాయల విలువైన విదేశీబ్రాండ్ లగ్జరీ కార్లు సైతం విరాట్ కలెక్షన్ లో ఉన్నాయి.

అంతేకాదు..ఇండియన్ సూపర్ లీగ్ లో పాల్గొంటున్న ఎఫ్ సి గోవా ఫుట్ బాల్ క్లబ్ యజమానిగా ఉన్న విరాట్ కు ప్రో-కుస్తీ లీగ్, టెన్నిస్ లీగ్ లలో జట్లకు సైతం ఓనర్ గా ఉన్నాడు.

విరాట్ ప్రస్తుత ఆస్తుల విలువను 1050 కోట్ల రూపాయలుగా స్టాక్ గ్రో అంచనావేసింది. ఇక విరాట్ భార్య అనుష్క, కుమార్తె వమిక పేర్లతో సైతం కోట్లరూపాయల ఆస్తులు ఉన్నాయి.

First Published:  18 Jun 2023 10:01 AM GMT
Next Story