Telugu Global
Sports

బౌండ్రీ కోసం 80 బంతులాడిన విరాట్ కొహ్లీ !

వెస్టిండీస్ తో తొలిటెస్టులో భారత పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ తొలిబౌండ్రీ సాధించడానికి 80 బంతులపాటు చెమటోడ్చాల్సి వచ్చింది.

విరాట్ కొహ్లీ
X

విరాట్ కొహ్లీ

వెస్టిండీస్ తో తొలిటెస్టులో భారత పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ తొలిబౌండ్రీ సాధించడానికి 80 బంతులపాటు చెమటోడ్చాల్సి వచ్చింది.

ఆధునిక క్రికెట్లో ఫార్మాట్ ఏదైనా బౌండ్రీలు బాదడంలో విరాట్ కొహ్లీ తర్వాతే ఎవరైనా. అయితే..ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా డోమనికా విండ్సర్ పార్క్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలిటెస్టు తొలిఇన్నింగ్స్ లో మాత్రం విరాట్ కు వింత అనుభవం ఎదురయ్యింది.

బ్యాటింగ్ కు ఏమాత్రం అనువుగాలేని విండ్సర్ పార్క్ స్లో వికెట్ పైన మాత్రం పరుగు పరుగుకోసం బ్యాటర్లు చెమటోడ్చాల్సి వస్తోంది. ఆతిథ్య వెస్టిండీస్ ను తొలిఇన్నింగ్స్ లో 150 పరుగులకే కుప్పకూల్చిన భారత్ సమాధానంగా 113 ఓవర్లలో 2 వికెట్లకు 312 పరుగులు సాధించడం ద్వారా 162 పరుగుల ఆధిక్యంతో ఉంది.

మొదటి వికెట్ కు రోహిత్- యశస్వి జోడీ 229 పరుగుల రికార్డు భాగస్వామ్యం సాధిస్తే..మూడో వికెట్ కు యశస్వి- విరాట్ జోడీ 72 పరుగుల అజేయభాగస్వామ్యం నమోదు చేశారు.


విరాట్ 96 బంతుల్లో 36 పరుగులు

స్పిన్ బౌలర్ల స్వర్గం లాంటి పిచ్ పైన భారత బ్యాటర్లు ఎనలేని నేర్పు, ఓర్పులతో పరుగుల కోసం పోరాడాల్సి వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ 221 బంతులు ఎదుర్కొని 10 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 103 పరుగులకు అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన యువబ్యాటర్ శుభ్ మన్ గిల్ 11 బంతుల్లో ఒక్క బౌండ్రీతో 6 పరుగుల స్కోరుకు అవుట్ కావడంతో క్రీజులోకి విరాట్ కొహ్లీ వచ్చి...యువఓపెనర్ యశస్వీకి జతకలిశాడు.

రెండోరోజు ఆట ముగిసే సమయానికి 96 బంతులు ఎదుర్కొని 36 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడానికి విరాట్ ఓర్పుతో పోరాడాల్సి వచ్చింది. మొత్తం 96 బంతులు ఎదుర్కొన్న విరాట్ ఒక్కటంటే ఒక్కటి మాత్రమే బౌండ్రీ సాధించగలిగాడు.

తన ఏకైక బౌండ్రీని సాధించడానికి విరాట్ 80 బంతులపాటు వేచిచూడాల్సి వచ్చింది. 79 బంతులపాటు జిడ్డాట ఆడిన విరాట్ తాను ఎదుర్కొన్న 80 బంతిని బౌండ్రీకి తరలించగలిగాడు.

తాను బౌండ్రీ సాధించిన వెంటనే పిడికిలి బిగించి మరీ విరాట్ గాలిలోకి అభివాదం చేశాడు. సెంచరీ సాధించిన సమయంలో చేయవలసిన అభివాదాన్ని బౌండ్రీ సాధించిన సమయంలో చేయటం విశేషం.

సెహ్వాగ్ ను అధిగమించిన విరాట్....

విరాట్ కొహ్లీ 36 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా టెస్టు క్రికెట్లో తన పరుగుల సంఖ్యను 8వేల 515 కు పెంచుకోగలిగాడు. భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఐదుగురు దిగ్గజ ఆటగాళ్ల వరుసలో నిలిచాడు.

2011లో వెస్టిండీస్ ప్రత్యర్థిగా టెస్టు అరంగేట్రం చేసిన విరాట్ 2023 నాటికి 107 టెస్టుల మైలురాయిని చేరాడు. అత్యధిక పరుగులు సాధించిన భారతక్రికెటర్లలో 5వ స్థానం సాధించాడు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్ 15, 921 పరుగులతో అగ్రస్థానంలో నిలిస్తే, 13 వేల 265 పరుగులతో రాహుల్ ద్రావిడ్ రెండు, 10, 122 పరుగులతో సునీల్ గవాస్కర్ మూడు, వీవీఎస్ లక్ష్మణ్ 8వేల 781 పరుగులతో నాలుగు స్థానాలలో కొనసాగుతున్నారు. విరాట్ 8 వేల 515 పరుగులతో 5వ స్థానం ఆక్రమించాడు. ఇప్పటి వరకూ ఐదోస్థానంలో ఉంటూ వచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ 6వ స్థానానికి పడిపోయాడు.

విరాట్ తన టెస్టు కెరియర్ లో 27 శతకాలు, 28 అర్థశతకాలతో 52.04 సగటుతో కొనసాగుతున్నాడు.

ఈ టెస్టుమ్యాచ్ రెండోరోజు ఆట ముగిసే సమయానికే భారత్ 162 పరుగుల ఆధిక్యం సంపాదించింది. మూడోరోజుఆటలో భారత్ మరో 250 పరుగులు సాధించగలిగితే..

ఆతిథ్య వెస్టిండీస్ కు మూడున్నర రోజుల్లోనే ఇన్నింగ్స్ ఓటమి తప్పదు.

First Published:  14 July 2023 3:38 PM IST
Next Story