Telugu Global
Sports

కొహ్లీ-గంభీర్ మాటల యుద్ధం..భారీజరిమానా!

ఐపీఎల్ దిగ్గజ మాజీ కెప్టెన్లలో ఒకడైన గౌతం గంభీర్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీల మధ్య గత కొద్దిసంవత్సరాలుగా కోల్డ్ వార్ చోటు చేసుకొంది.

Virat Kohli, Gautam Gambhir war of words post IPL match
X

కొహ్లీ-గంభీర్ మాటల యుద్ధం..భారీజరిమానా!

భారత క్రికెట్ పరువును ఇద్దరు భారత దిగ్గజ క్రికెటర్లు అంతర్జాతీయంగా మంటగలిపారు. బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కొహ్లీ, లక్నో మెంటార్ గౌతం గంభీర్ లకు బీసీసీఐ 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించింది....

200 స్కోర్లు..పరుగుల హోరు గా సాగుతున్న ఐపీఎల్-16 సీజన్ నడిమధ్యన ఓ అపశృతి చోటు చేసుకొంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం వేదికగా..

లక్నో సూపర్ జెయింట్స్- బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య లోస్కోరింగ్ సమరంలా సాగిన రెండో అంచె పోటీ ముగిసిన సమయంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీ, లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్, భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ల నడుమ మాటలయుద్ధం కాస్త కట్టలు తెంచుకొని భావోద్వేగాల నడుమ ముగిసింది.

అహంభావం..భావోద్వేగాల సమరం..

ఐపీఎల్ దిగ్గజ మాజీ కెప్టెన్లలో ఒకడైన గౌతం గంభీర్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీల మధ్య గత కొద్దిసంవత్సరాలుగా కోల్డ్ వార్ చోటు చేసుకొంది.

అవకాశం దొరికిన ప్రతిసారీ ఒకరిపై ఒకరు ట్విట్టర్ లేదా వివిధ వేదికల ద్వారా మాటలతూటాలు పేల్చుకోడం ఓ అలవాటుగా మారింది. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకొన్న తర్వాత గంభీర్ బీజెపీ తీర్థం పుచ్చుకొని లోక్ సభ సభ్యుడి అవతారం ఎత్తాడు. అంతటితో ఆగిపోకుండా క్రికెట్ వ్యాఖ్యాతగా, విమర్శకుడిగా కొన్నిసార్లు స్థాయికి మించిన వ్యాఖ్యలు చేస్తూ శతృత్వాన్ని కొని తెచ్చుకొంటున్నాడు.

వాస్తవానికి ఇటు గంభీర్, అటు విరాట్ కొహ్లీ..ఇద్దరూ ఢిల్లీ రంజీజట్టుకు నాయకత్వం వహించినవారే. ఇద్దరూ ఢిల్లీకి చెందినవారే. అయితే..ఇద్దరి మధ్యన సఖ్యత లేకపోడం, ఒకరి పట్ల ఒకరు అనుచితంగా వ్యాఖ్యలు చేసుకోడం మామూలు విషయంగా మారిపోయింది. ఇద్దరి మనస్తత్వం ఒకే విధంగా ఉండడంతో పాటు.. అహంభావులు కావడం కూడా సత్సంబంధాలు లేకపోడానికి కారణమయ్యింది.

బెంగళూరులో లక్నో, లక్నోలో బెంగళూరు జోరు!

ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి అంచె..హైస్కోరింగ్ పోరులో లక్నో విజేతగా నిలిచింది. ఇక..లక్నో వేదికగా ముగిసిన రెండో అంచె లోస్కోరింగ్ సమరంలో బెంగళూరు 18 పరుగులతో నెగ్గడం ద్వారా దెబ్బకు దెబ్బ తీసింది.

బెంగళూరు విజేతగా నిలిచిన వెంటనే విరాట్ కొహ్లీ..స్టేడియంలోని అభిమానులను చూసి రెచ్చగొట్టేలా సంజ్ఞలు చేయటం వివాదానికి దారితీసింది. అదీ చాలదన్నట్లు..

లక్నో ఓపెనర్ కీల్ మేయర్స్ తో విరాట్ కొహ్లీ ఏదోమాట్లాడుతూ ఉండటంతో లక్నోమెంటార్ గౌతం గంభీర్ జోక్యం చేసుకోడం కూడా మాటా మాటకు దారి తీసింది.

కొహ్లీ, గంభీర్ ల మధ్య వాడిగా వేడిగా మాటలయుద్ధం చోటు చేసుకోడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్, లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా వారిని వేరు చేసి ఉద్రిక్తతను చల్లార్చడానికి ప్రయత్నించారు. ఓ దశలో ఈ ఇద్దరూ పరస్పరం దూషించుకొన్నారు. ఈ సంఘటనల వీడియో ఒకటి ఆన్ లైన్ లో వైరల్ కావడంతో బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది.

ఇద్దరికీ భారీగా జరిమానా...

ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి...ఆర్టిక‌ల్ 2.21 ప్ర‌కారం నిబంధనలు అతిక్రమించిన విరాట్ కొహ్లీ, గౌతం గంభీర్ లకు బీసీసీఐ క్రమశిక్షణ సంఘం నూటికి నూరుశాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించింది.

గంభీర్ తో పాటు విరాట్ కొహ్లీ సైతం తన పొరపాటును ఒప్పుకొన్నాడని, నియమావళి ప్రకారం 100 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించినట్లు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు.

లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాగా కోత విధించారు

విరాట్ కొహ్లీ- గౌతం గంభీర నడుమ చోటు చేసుకొన్న ఈ అవాంఛనీయ ఘటన భారత క్రికెట్ పరువును అంతర్జాతీయంగా మంటగలిపేలా ఉందంటూ పలువురు మాజీ దిగ్గజ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

భారతమాజీ కెప్టెన్ అనీల్ కుంబ్లే, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం..ఇది భారత క్రికెట్ కు ఏమంత మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఈ సంఘటనను బీసీసీఐ తీవ్రంగా తీసుకోవాలని సూచించారు.

First Published:  2 May 2023 4:57 PM IST
Next Story