భారత తొలి క్రికెటర్ గా విరాట్ జంట రికార్డులు!
ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీ జంటరికార్డులు నెలకొల్పాడు.
ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీ జంటరికార్డులు నెలకొల్పాడు. ఈ ఘనత సాధించిన భారత తొలిఆటగాడిగా చరిత్ర సృష్టించాడు....
వ్యక్తిగత కారణాలతో క్రికెట్ కు గత రెండుమాసాలుగా దూరంగా ఉన్న దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీ ..2024 సీజన్ ఐపీఎల్ రెండోమ్యాచ్ లోనే అదరగొట్టాడు. జంట రికార్డులతో తన జట్టుకు తొలివిజయం అందించాడు.
ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ ను 4 వికెట్ల తేడాతో అధిగమించింది.
100వసారి 50 పరుగుల రికార్డు....
పంజాబ్ కింగ్స్ జట్టు తమ ఎదుట ఉంచిన 177 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో విరాట్ ప్రధానపాత్ర వహించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా తనదైన శైలిలో బ్యాటు ఝళిపిస్తూ 157 స్ట్రయిక్ రేట్ తో కేవలం 49 బంతుల్లోనే 77 పరుగుల స్కోరు సాధించాడు. మొత్తం 11 ఫోర్లు, 2 సిక్సర్లతో తన టీ-20 కెరియర్ లో 100వ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఘనత సాధించిన భారత తొలి క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.
ముగ్గురిలో ఒక్కడు విరాట్...
టీ-20 క్రికెట్ చరిత్రలో విరాట్ కు ముందు వరకూ ఇద్దరు మాత్రమే వందకు పైగా హాఫ్ సెంచరీలు సాధించగలిగారు. బెంగళూరు మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ 463 మ్యాచ్ ల్లో 110సార్లు 50కి పైగా స్కోర్లు సాధిస్తే..కంగారూ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 371 మ్యాచ్ ల్లో 109సార్లు 50కి పైగా స్కోర్లు నమోదు చేశాడు.
ఇప్పుడు సరికొత్తగా విరాట్ కొహ్లీ 377 మ్యాచ్ ల్లో100 సార్లు 50కి పైగా స్కోర్లు సాధించడం ద్వారా ఇద్దరు దిగ్గజ బ్యాటర్ల సరసన నిలువగలిగాడు. భారత క్రికెట్ చరిత్రలో వందసార్లు యాభైకి పైగా స్కోర్లు సాధించిన తొలి బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు. 35 సంవత్సరాల విరాట్ కేవలం 31 బంతుల్లోనే తన వందవ హాఫ్ సెంచరీ పూర్తి చేయడం విశేషం.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 290 మ్యాచ్ ల్లో 98 సార్లు 50కి పైగా స్కోర్లు సాధిస్తే...ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ 404 మ్యాచ్ ల్లో 86సార్లు 50కి పైగా స్కోర్లు చేయగలిగాడు.
క్రిస్ గేల్ 110సార్లు 50కి పైగా స్కోర్లతో 14, 562 పరుగులు, డేవిడ్ వార్నర్ 109సార్లు 50కి పైగా స్కోర్లతో 12 వేల 094 పరుగులు సాధించడం ద్వారా మొదటి రెండుస్థానాలలో కొనసాగుతున్నారు.
అత్యధిక క్యాచ్ ల మొనగాడు విరాట్...
ఇదే మ్యాచ్ లో విరాట్ మరో అరుదైన రికార్డును సైతం తన పేరుతో లిఖించుకోగలిగాడు. టీ-20 ఫార్మాట్లో ఇప్పటి వరకూ అత్యధిక క్యాచ్ లు పట్టిన ఫీల్డర్ గా సురేశ్ రైనా పేరుతో ఉన్న రికార్డును విరాట్ అధిగమించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డర్ సురేశ్ రైనా పట్టిన 172 క్యాచ్ ల రికార్డును విరాట్ తన 173వ క్యాచ్ తో తెరమరుగు చేశాడు. పంజాబ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో ఇచ్చిన క్యాచ్ ను విరాట్ అందుకోడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పగలిగాడు.
ముంబై ఇండియన్స్ ఫీల్డర్ రోహిత్ శర్మ 167 క్యాచ్ లతో మూడు, మనీశ్ పాండే 146 క్యాచ్ లతో నాలుగు, సూర్యకుమార్ యాదవ్ 136 క్యాచ్ లతో ఐదుస్థానాలలో కొనసాగుతున్నారు.
ప్రస్తుత 17వ సీజన్ ఐపీఎల్ ప్రారంభమ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో కంగుతిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ..రెండోమ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించడం ద్వారా నిలదొక్కుకోగలిగింది.