Telugu Global
Sports

భారత్-పాక్ సమరానికి వరుణగండం!

టీ-20 ప్రపంచకప్ లో అతిపెద్ద సమరంగా పేరుపొందిన భారత్-పాకిస్థాన్ జట్ల ప్రారంభమ్యాచ్ కు వానగండం పొంచి ఉంది.

భారత్-పాక్ సమరానికి వరుణగండం!
X

T-20 World Cupలో అతిపెద్ద సమరంగా పేరుపొందిన భారత్-పాకిస్థాన్ జట్ల ప్రారంభమ్యాచ్ కు వానగండం పొంచి ఉంది. మెల్బోర్న్ వేదికగా ఈనెల 23న జరిగే సూపర్ సండే ఫైట్ సమయంలో 4 నుంచి 10 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఆస్ట్ర్రేలియా వాతావరణశాఖ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది...

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న 2022 టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్..గ్రూప్-2 ప్రారంభమ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థులు, ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, పాక్ జట్లు ఓవైపు పోటీకి సిద్ధమవుతుంటే...మరోవైపు మ్యాచ్ జరిగే సమయంలో తన ప్రతాపం చూపుతానంటూ వరుణదేవుడు భయపెడుతున్నాడు

మేఘావృతం...వానముప్పు

ప్రస్తుత ప్రపంచకప్ కే అతిపెద్ద సమరంగా పేరుపొందిన భారత్- పాక్ సూపర్ -12 సమరం టికెట్లు హాటు కేకుల్లా అమ్ముడుపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికల్లో ఒకటైన మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఈపోరుకు ఆతిథ్యమిస్తోంది. లక్షకు పైగా సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ స్టేడియంలో...భారత్-పాక్ జట్ల పోరు టికెట్లు 80వేల వరకూ విక్రయించారు.

సూపర్ సండే ఫైట్ గా ఈనెల 23న జరిగే ఈ ఉత్కంఠభరిత పోరు కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

80వేల మందికి పైగా అభిమానులతో స్టేడియం కిటకిటలాడటం ఖాయమని నిర్వహకసంఘం ప్రకటించింది. అయితే..మ్యాచ్ జరిగే రోజున వానముప్పు పొంచి ఉందని...అక్టోబర్ 23 నుంచి 25 వరకూ మెల్బోర్న్ పరిసర ప్రాంతాలలో భారీగా వర్షం పడే అవకాశం ఉందంటూ ఆస్ట్ర్రేలియా వాతావరణశాఖ హెచ్చరించింది.

4 నుంచి 10 మిల్లీమీటర్ల వరకూ వాన...

భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1-30 గంటలకు భారత్- పాక్ పోరుకు తెరలేవనుంది. మ్యాచ్ జరిగేంత సేపూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని,

4 నుంచి 10 మిల్లీమీటర్ల వరకూ వానపడే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది. భారత్- పాక్ మ్యాచ్ జరిగే రోజున మెల్బో్ర్న్ స్టేడియం పైన 90 శాతం మేఘావృతమై ఉంటుందని, గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు ఈనెల 23న మెల్బో్ర్న్ వేదికగా పాక్ ప్రత్యర్థిగా తన తొలిరౌండ్ మ్యాచ్ ఆడుతుంది. అక్టోబర్ 27న సిడ్నీ వేదికగా క్వాలిఫైయర్స్ ద్వారా అర్హత సాధించిన జట్టుతో రెండోరౌండ్, అక్టోబర్ 30న పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో మూడోరౌండ్, నవంబర్ 2న అడిలైడ్ ఓవల్ వేదికగా బంగ్లాదేశ్ తో నాలుగో రౌండ్, నవంబర్ 6 మెల్బోర్న్ వేదికగా జరిగే ఐదోరౌండ్ లో నెదర్లాండ్స్ జట్లతో భారత్ తలపడాల్సి ఉంది.

First Published:  21 Oct 2022 11:09 AM IST
Next Story