Telugu Global
Sports

యూఎస్ ఓపెన్ తొలిరౌండ్లో సీడెడ్లు టపటపా!

అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో సీడెడ్ స్టార్ల పరాజయాల పరంపర మొదలయ్యింది. బుధవారం న్యూయార్క్ లో జరిగిన తొలిరౌండ్ పోటీలలోనే చాంపియన్ ఎమ్మా రాడుకానూ, మాజీ చాంపియన్ నవోమీ ఒసాకా ఇంటిదారి పట్టారు.

యూఎస్ ఓపెన్ తొలిరౌండ్లో సీడెడ్లు టపటపా!
X

అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో సీడెడ్ స్టార్ల పరాజయాల పరంపర మొదలయ్యింది. బుధవారం న్యూయార్క్ లో జరిగిన తొలిరౌండ్ పోటీలలోనే చాంపియన్ ఎమ్మా రాడుకానూ, మాజీ చాంపియన్ నవోమీ ఒసాకా ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్ లో నాలుగుసార్లు విన్నర్ రాఫెల్ నడాల్ తొలి గెలుపుతో శుభారంభం చేశాడు....

న్యూయార్క్ లోని అర్థర్ యాష్ స్టేడియం వేదికగా జరుగుతున్న 2022 టెన్నిస్ సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ అమెరికన్ ఓపెన్ తొలిరౌండ్ పోరు అనూహ్య ఫలితాలతో ప్రారంభమయ్యింది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లోనే గ్రీకువీరుడు సిటిస్ పాస్ అనూహ్యరీతిలో ఓటమిపాలేతే...మహిళల సింగిల్స్ ప్రారంభ రౌండ్ మ్యాచ్ ల్లోనే ప్రస్తుత చాంపియన్ ఎమ్మా రాడుకాను, మాజీ చాంపియన్ నవోమీ ఒసాకా పరాజయాలతో ఇంటిదారి పట్టారు.

కాగా...పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ తొలి విజయంతో ఐదోటైటిల్ జైత్రయాత్ర ప్రారంభించాడు.

ఎమ్మాకు తొలిరౌండ్ షాక్...

బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్ వేటకు దిగిన బ్రిటీష్ ప్లేయర్ ఎమ్మా రాడుకానుకు తొలిరౌండ్లోనే చుక్కెదురయ్యింది. 11వ సీడెడ్ ప్లేయర్ ఎమ్మాను వరుస సెట్లలో 40వ ర్యాంకర్ ఫ్రెంచ్ ప్లేయర్ అలీజ్ కోర్నెట్ చిత్తు చేయడం ద్వారా సంచలనం సృష్టించింది.

32 సంవత్సరాల కోర్నెట్ తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడి 6-3, 6-3తో 19 ఏళ్ల ఎమ్మాను కంగుతినిపించింది. గత నెలలో ముగిసిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ లో ప్రపంచ టాప్ ర్యాంకర్ ఇగా స్వయ్ టెక్ పై వరుససెట్ల సంచలన విజయం సాధించిన కోర్నెట్...సీజన్ ఆఖరిటోర్నీ యూఎస్ ఓపెన్లో సైతం అదేజోరు కొనసాగించింది.

గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లో అన్ సీడెడ్ గా, క్వాలిఫైయర్ గా మెయిన్ డ్రాలో చోటు సంపాదించిన ఎమ్మా ఏకంగా టైటిల్ సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. అయితే..ప్రస్తుత యూఎస్ ఓపెన్లో మాత్రం స్థాయికి తగ్గట్టుగా రాణించలేక కోర్నెట్ కు దాసోహమనక తప్పలేదు.

ఇప్పటికే తొలిరౌండ్ పరాజయాలు చవిచూసిన దిగ్గజ ప్లేయర్లలో 2017 విన్నర్ ఏంజెలికో కెర్బర్, 2005 చాంపియన్ స్వెత్లానా కుజెనెత్సేవా ల సరసన ఎమ్మా రాడుకానూ సైతం చేరినట్లయ్యింది.

రెండోరౌండ్లో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ కాథరీనా సిన్యాకోవాతో కోర్నెట్ తలపడనుంది.

అదేదారిలో నవోమీ ఒసాకా...

తొలిరౌండ్ నుంచే నిష్క్రమించిన ప్లేయర్ల జాబితాలో మాజీ చాంపియన్, జపాన్ కు చెందిన నవోమీ ఒసాకా సైతం వచ్చిచేరింది. నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ ఒసాకాను అమెరికాకు చెందిన 19 వ సీడెడ్ ప్లేయర్ డానియెల్లీ కోలిన్స్ 7-6, 6-3తో అధిగమించింది.

2018, 2020 సీజన్లలో అమెరికన్ ఓపెన్ విజేతగా నిలిచిన నవోమీ ఒసాకా...ప్రస్తుత సీజన్ టోర్నీలో మాత్రం తొలిరౌండ్ నుంచే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.

గతంలో ప్రపంచ నంబర్ వన్ స్థాయికి ఎదిగిన ఒసాకా గత ఏడాదిగా వరుస వైఫల్యాలతో 44వ ర్యాంక్ కు పడిపోయింది.


స్పానిష్ బుల్ టైటిల్ వేట షురూ...

పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో నాలుగుసార్లు విన్నర్ రాఫెల్ నడాల్ తొలిగెలుపుతో ఐదో యూఎస్ ఓపెన్ టైటిల్ వేటను మొదలుపెట్టాడు. ఆస్ట్ర్రేలియాకు చెందినన 198వ ర్యాంక్ ప్లేయర్ రింకీ హిజికాటాతో జరిగిన తొలిరౌండ్ పోరులో తొలిసెట్ ను 4-6తో చేజార్చుకొన్న 36 ఏళ్ల నడాల్ ఆ తర్వాతి మూడుసెట్లనూ 6-2, 6-3, 6-3తో అలవోకగా గెలుచుకొని విజేతగా నిలిచాడు.

22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ నడాల్ కు యూఎస్ ఓపెన్లో ఇది 65వ సింగిల్స్ విజయం కావడం విశేషం. రెండోరౌండ్ పోరులో ఇటలీ ఆటగాడు ఫాబియో ఫాగ్నినీతో నడాల్ తలపడనున్నాడు. ఫాబియో ప్రత్యర్థిగా నడాల్ కు 13 విజయాలు, 4 పరాజయాల రికార్డు ఉంది.2019 సీజన్లో యూఎస్ ఓపెన్ టైటిల్ ను చివరిసారిగా గెలుచుకొన్న నడాల్ ప్రస్తుత సీజన్ టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా నిలిచాడు.

First Published:  31 Aug 2022 4:07 PM IST
Next Story