భారత కుర్రాళ్లకూ సోకిన' ఫైనల్స్ ఫోబియా'!
లీగ్ దశలో తిరుగులేని విజయాలు సాధించడం..టైటిల్ సమరంలో చేతులెత్తేయడం భారత క్రికెట్ జట్ల పాలిట శాపంగా మారింది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో మాత్రమే కాదు..అండర్ -19 ప్రపంచకప్ లో సైతం భారత్ ఆఖరి మెట్టుపై జారిపడింది. టైటిల్ సమరంలో ఆస్ట్ర్రేలియా చేతిలో ఘోరపరాజయం చవిచూసింది.
లీగ్ దశలో తిరుగులేని విజయాలు సాధించడం..టైటిల్ సమరంలో చేతులెత్తేయడం భారత క్రికెట్ జట్ల పాలిట శాపంగా మారింది. సీనియర్, జూనియర్ జట్లు అన్న తేడాలేకుండా ఫైనల్స్ ఫోబియాతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
చేజారిన ఆరో ప్రపంచ టైటిల్....
అండర్ -19 ప్రపంచకప్ లో అత్యధిక టైటిల్స్ సాధించినజట్టుగా కొనసాగుతున్న భారత్ ఆరో టైటిల్ గెలుచుకోవాలన్న లక్ష్యం నెరవేరలేదు. దక్షిణాఫ్రికా వేదికగా గత మూడువారాలుగా సాగిన 2024 - ఐసీసీ జూనియర్ ప్రపంచకప్ లీగ్ దశ నుంచి సెమీస్ వరకూ అలవోక విజయాలతో అదరగొట్టిన భారత్ చివరకు ఫైనల్స్ లో తేలిపోయింది.
చిరకాల ప్రత్యర్థి ఆస్ట్ర్రేలియాతో జరిగిన టైటిల్ సమరం ఏకపక్షంగా ముగిసిపోయింది. కీలక టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఆస్ట్ర్రేలియాజట్టు భారత్ ఎదుట 254 పరుగుల లక్ష్యాన్ని ఉంచిగలిగింది.
ఉదయ్ సహ్రాన్ నాయకత్వంలోని భారతజట్టులో ముషీర్ ఖాన్, సచిన్ దాస్ లాంటి మేటి బ్యాటర్లు, సెంచరీల మొనగాళ్లున్నచేజింగ్ లో భారత్ బోల్తా కొట్టింది. స్టార్ బ్యాటర్లంతా విఫలం కావడంతో 79 పరుగుల భారీ ఓటమితో మరోసారి రన్నరప్ గా మిలిగిపోవాల్సి వచ్చింది.
మురుగన్ అభిషేక్ పోరాడినా....
గత 15 ప్రపంచకప్ టోర్నీలలో ఎనిమిది ఫైనల్స్ ఆడి ఐదుసార్లు విజేతగా, మూడుసార్లు రన్నరప్ నిలిచిన భారత్ ప్రస్తుత టోర్నీలో మాత్రం డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో నిలిచింది.
గ్రూప్ లీగ్ దశలో ఆల్ విన్ రికార్డుతో పాటు..సూపర్ -6 రౌండ్లో న్యూజిలాండ్, నేపాల్ జట్లను చిత్తు చేయడం ద్వారా సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.
ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్ పోరులో సైతం చేజింగ్ కు దిగి 2 వికెట్లతో గట్టెక్కినా...ఫైనల్లో ఆస్ట్ర్రేలియా ముందు చేతులెత్తక తప్పలేదు.
ఓపెనర్ ఆదర్శ్ సింగ్, స్పిన్ ఆల్ రౌండర్ మురుగన్ అభిషేక్ మినహా మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ ఉదయ్ సహ్రాన్ సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరగడం భారత్ ను కోలుకోనివ్వకుండా చేసింది. ముషీర్ ఖాన్, ట్రబుల్ షూటర్ సచిన్ దాస్ సైతం తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో భారత్ టైటిల్ ఆశలు మురుగన్ అభిషేక్ పైన పడ్డాయి.
ఒక దశలో 91 పరుగులకే ఆరు టాపార్డర్ వికెట్లు నష్టపోయిన భారత్ ను మురుగన్- నమన్ తివారీ 9వ వికెట్ కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ద్వారా టైటిల్ ఆశలు రేపారు. అయితే..మురుగన్ అవుట్ కావడంతో భారత్ 79 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
ఆస్ట్ర్రేలియా బౌలర్లలో పేసర్ మహ్లీ బియర్డ్ మాన్, స్పిన్నర్ రాఫ్ మెక్మిలన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
ఫైనల్లో భారత్ ఓటమితో ఆస్ట్ర్రేలియా నాలుగోసారి జూనియర్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఆస్ట్ర్రేలియా పేసర్ మహ్లీ బియర్డ్ మాన్ ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ క్వెనా మపాకా ప్లేయర్ ఆఫ్ ది ప్రపంచకప్ అవార్డులు గెలుచుకొన్నారు. మపాకా లీగ్ దశ నుంచి సెమీస్ వరకూ ఆడిన మ్యాచ్ ల్లో 21 వికెట్లు పడగొట్టడం ద్వారా నంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు.
ప్రపంచ కప్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లలో కెప్టెన్ ఉదయ్ సహ్రాన్, ముషీర్ ఖాన్, సచిన్ దాస్ ఉన్నారు.
ఏడాది కాలంలో మూడోసారి.....
ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్స్ లో భారతజట్లు ఫైనల్లో పరాజయం పొందటం ఇది మూడోసారి. టెస్టు లీగ్ ఫైనల్లో , ఐసీసీ వన్డే టోర్నీ ఫైనల్స్ లో భారత్ సీనియర్ జట్లు పరాజయాలు పొందగా..ఇప్పుడు జూనియర్ ఫైనల్స్ లో సైతం అదే ఫలితం ఎదురయ్యింది.
రోహిత్ శర్మ నాయకత్వంలో టెస్టు లీగ్, వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ లో భారత్ ను కంగుతినిపించిన ఆస్ట్ర్రేలియాజట్టే జూనియర్స్ ఫైనల్స్ సైతం భారత కుర్రాళ్లను చిత్తు చేయడం గమనార్హం.
ఇప్పటి వరకూ సీనియర్ జట్లను మాత్రమే పట్టిపీడించిన ' ఫైనల్స్ ఫోబియా ' అభంశుభం తెలియని జూనియర్ క్రికెటర్లకు సైతం సోకడం ఆందోళన కరమే.