Telugu Global
Sports

భారత టెస్టు క్రికెట్లో ఉనద్కత్ అరుదైన రికార్డు!

భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు

భారత టెస్టు క్రికెట్లో ఉనద్కత్ అరుదైన రికార్డు!
X

భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండోటెస్ట్ తొలిరోజు ఆటలో ఈ ఘనత సాధించాడు....

భారత లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండుమ్యాచ్ ల సిరీస్ లోని

ఆఖరి టెస్టు తుదిజట్టులో చోటు సాధించడమే కాదు..50 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు సైతం పడగొట్టాడు. బంగ్లాదేశ్ ను తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగులకే ఆలౌట్ చేయడంలో తనవంతు పాత్ర నిర్వర్తించాడు. ఈ క్రమంలో రెండు అరుదైన రికార్డులు నమోదు చేశాడు.

12 ఏళ్ళ తర్వాత టెస్టు తొలివికెట్ ...

దేశవాళీ క్రికెట్లో అపారఅనుభవం కలిగిన జయదేవ్ ఉనద్కత్ 19 సంవత్సరాల వయసులోనే టెస్టు అరంగేట్రం చేసినా..టెస్టుల్లో తన తొలి వికెట్ కోసం 12 సంవత్సరాలపాటు వేచిచూడాల్సి వచ్చింది.

2010 దక్షిణాఫ్రికా సిరీస్ లో భాగంగా సెంచూరియన్ పార్క్ వేదికగా జరిగిన టెస్టుమ్యాచ్ ద్వారా 19 సంవత్సరాల చిరుప్రాయంలో ఉనద్కత్ అరంగేట్రం చేశాడు. అయితే..ఆ మ్యాచ్ లో ఉనద్కత్ కు కనీసం ఒక వికెట్టూ దక్కలేదు. ఆ తర్వాత నుంచి మరో టెస్టు అవకాశం కోసం 12 సంవత్సరాల 2 రోజులపాటు వేచిచూడాల్సి వచ్చింది.

మీర్పూర్ నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన రెండోటెస్టు తుదిజట్టులో ఉనద్కత్ కు చోటు దక్కింది.

వన్ చేంజ్ బౌలర్ గా బంతి అందుకొన్న ఉనద్కత్ బంగ్లా ఓపెనర్ కమ్ తొలిటెస్టు సెంచరీ హీరో జకీర్ హసన్ ను రెండంకెల స్కోరుకే పెవీలియన్ దారి పట్టించాడు.

ఆ తర్వాత 80కి పైగా పరుగుల స్కోరుతో సెంచరీకి చేరువైన బంగ్లా మాజీ కెప్టెన్ మోమినుల్ హుక్ ను సైతం అవుట్ చేశాడు. ఉనద్కత్ మొత్తం 16 ఓవర్లలో 50 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టగలిగాడు.

2010లో తొలిటెస్టు ఆడిన ఉనద్కత్ తన రెండోటెస్టు అవకాశం కోసం 12 సంవత్సరాల 2 రోజుల సుదీర్ఘకాలం పాటు వేచిచూడాల్సి వచ్చింది. అంతేకాదు..19 సంవత్సరాల వయసులో టెస్టు అరంగేట్రం చేసి..తొలివికెట్ ను 31 సంవత్సరాల వయసులో పడగొట్టడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

భారత టెస్టు చరిత్రలో లాలా అమర్ నాథ్ 1934లో ఓ టెస్టు మ్యాచ్ ఆడి..ఆ తర్వాత 12 సంవత్సరాల 129 రోజుల విరామం తర్వాత 1946లో తన రెండోటెస్టును ఆడగలిగాడు.

ఆ తర్వాతి స్థానంలో జయదేవ్ ఉనద్కత్ నిలిచాడు.

2010 డిసెంబర్ 10న దక్షిణాఫ్రికా పై తన తొలిటెస్టుమ్యాచ్ ఆడిన ఉనద్కత్..12 సంవత్సరాల 2 రోజుల విరామం తర్వాత 2022 డిసెంబర్ 22న కానీ తన రెండోటెస్టు మ్యాచ్ ను ఆడే అవకాశం దక్కించుకోలేకపోయాడు.

డియర్ రెడ్ బాల్..నాకు మరో టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వు, నీ పేరు నిలబెడతా అంటూ ట్విట్ చేయడం జయదేవ్ ఉనద్కత్ కు మాత్రమే చెల్లింది.

పట్టువదలని విక్రమార్కుడు...

భారత దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర్ర, వెస్ట్ జోన్ జట్ల తరపున రంజీట్రోఫీ, విజయ్ హజారే, దులీప్ ట్రోఫీ టోర్నీలలో నిలకడగా రాణిస్తూ వచ్చినా ఉనద్కత్ ను సెలెక్టర్లు ఏమాత్రం పట్టించుకోకుండా పక్కన పెట్టారు.

చక్కటి లైన్ అండ్ లెంగ్త్ తో కుదురుగా , నియంత్రణతో బౌల్ చేసే ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ గా ఉనద్కత్ కు పేరుంది. 2010 తర్వాత నుంచి బీసీసీఐ తనను పట్టించుకోకున్నా ఉనద్కత్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా దేశవాళీ క్రికెట్ టోర్నీలలో పాల్గొంటూ నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు. ఐపీఎల్ లో సైతం తానేమిటో నిరూపించుకొంటూ తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర్ర జట్టుకు నాయకుడిగా వ్యవహరిస్తున్న ఉనద్కత్ ఇటీవలే ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో కేవలం బౌలింగ్ ప్రతిభతోనే తనజట్టును విజేతగా నిలిపాడు. ప్రస్తుత సీజన్లో భాగంగా ఆడిన మొత్తం 10 మ్యాచ్ ల్లో 19 వికెట్లు పడగొట్టడం ద్వారా నంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు.

తన తొలిటెస్టు ఆడిన తర్వాత నుంచి గత ఆరు సీజన్లలో 224 వికెట్లు పడగొట్టాడు. 2019-20 రంజీ సీజన్లో మొత్తం 10 మ్యాచ్ లు ఆడి 67 వికెట్లు పడగొట్టడం ద్వారా భారత నంబర్ వన్ దేశవాళీ బౌలర్ గా నిలిచాడు. దులీప్ ట్రోఫీ మ్యాచ్ ల్లో సైతం వెస్ట్ జోన్ తరపున 13 వికెట్లు సాధించాడు.

7 వన్డేలు, 10 టీ-20 మ్యాచ్ లు...

12 సంవత్సరాల క్రితమే భారత టెస్ట్ క్యాప్ అందుకొన్న ఉనద్కత్ కు 7 వన్డేలు, 10 టీ-20 మ్యాచ్ లు ఆడిన రికార్డు ఉంది. తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 96 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 353 వికెట్లు పడగొట్టిన ఘనత సైతం ఉంది.

స్టార్ బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, స్వింగ్ బౌలర్ దీపక్ చహార్ గాయాలతో జట్టుకు దూరం కావడంతో..ఉమ్రాన్ మాలిక్, నవదీప్ సైనీ లాంటి పలువురు బౌలర్లు అందుబాటులో ఉన్నా..అనుభవజ్ఞుడైన జయదేవ్ ఉనద్కత్ వైపే భారత టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గు చూపింది.

.

First Published:  23 Dec 2022 5:17 AM GMT
Next Story