భారత ఫాస్టెస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్!
శ్రీలంకతో ముంబై వేదికగా ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
భారత యువఫాస్ట్ బౌలర్, జమ్మూ-కాశ్మీర్ ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సత్తా చాటుకొన్నాడు. శ్రీలంకతో ముంబై వేదికగా ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పాడు...
కొత్తసంవత్సరంలో..శ్రీలంకతో ప్రారంభమైన తీన్మార్ టీ-20 సిరీస్ తొలిమ్యాచ్ లోనే భారత యువఫాస్ట్ బౌలర్ల జోడీ నిప్పులు చెరిగే బౌలింగ్ తో చెలరేగిపోయారు. తమజట్టు సాధించిన 2 పరుగుల వెంట్రుక వాసి విజయంలో కీలకపాత్ర పోషించారు.
ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో..ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగుల స్కోరు సాధించింది. 6వ వికెట్ కు దీపక్ హుడా ( 41 ), అక్షర్ పటేల్ ( 31 ) 68 పరుగుల అజేయభాగస్వామ్యం నమోదు చేయడంతో భారత్ ప్రత్యర్థి ఎదుట 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.
అయితే..భారత యువఫాస్ట్ బౌలర్లజోడీ శివమ్ మావీ, ఉమ్రాన్ మాలిక్ మెరుపుబౌలింగ్ తో శ్రీలంక జోరుకు కళ్లెం వేయగలిగారు.
మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సిన శ్రీలంకను లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కట్టడి చేయగలిగాడు. చివరకు భారత్ 2 పరుగుల తేడాతో విజేతగా నిలవడం ద్వారా మూడుమ్యాచ్ ల సిరీస్ లో 1-0తో పైచేయి సాధించగలిగింది.
బుమ్రాను మించిన ఉమ్రాన్ మాలిక్ ..
భారత బౌలర్లలో శివమ్ మావీ 4 వికెట్లు, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్ 17వ ఓవర్ 4వ బంతిని ఉమ్రాన్ మాలిక్ 155 కిలోమీటర్ల వేగంతో విసిరి..డేంజర్ మ్యాన్ షనకను పడగొట్టడం ద్వారా మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఈ క్రమంలో జస్ ప్రీత్ బుమ్రా పేరుతో ఉన్న ఫాస్టెస్ట్ బాల్ రికార్డును ఉమ్రాన్ మాలిక్ తెరమరుగు చేశాడు.
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా బంతులు విసిరిన బౌలర్ల రికార్డు ఇప్పటి వరకూ బుమ్రా, షమీ, నవదీప్ సైనీల పేరుతో ఉంది. బుమ్రా 153.36 కిలోమీటర్లు, మహ్మద్ షమీ 153.3 కిలోమీటర్లు, నవదీప్ సైనీ 152. 85 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం ద్వారా ఇప్పటి వరకూ మొదటి మూడుస్థానాలలో కొనసాగుతూ వచ్చారు.
అయితే..యువఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరడం ద్వారా సరికొత్త రికార్డుతో..ఫాస్టెస్ట్ బౌలర్ గా అవతరించాడు.
శ్రీలంకపై వరుసగా 11వ గెలుపు...
భారత గడ్డపై శ్రీలంక ప్రత్యర్థిగా ఆడిన టీ-20 మ్యాచ్ ల్లో టాప్ ర్యాంకర్ భారత్ కు ఇది వరుసగా 11వ విజయం కావడం ఓ రికార్డు. అంతేకాదు..2 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా టీ-20ల్లో భారత్ మూడో అతిస్వల్ప విజయాన్ని నమోదు చేయగలిగింది.
2012లో కొలంబో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 1 పరుగు, 2016లో బెంగళూరు వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఒకే ఒక్క పరుగు తేడా విజయాలు నమోదు చేసిన భారత్..ప్రస్తుత 2023 సిరీస్ లోని తొలిమ్యాచ్ లో 2 పరుగులతో విజేతగా నిలవడం మరో అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది.
భారత్- శ్రీలంకజట్ల సిరీస్ లోని రెండోవన్డే పూణే వేదికగా జనవరి 5న జరుగనుంది.