Telugu Global
Sports

భారత జట్టులో ఉమ్రాన్ మాలిక్, బంగ్లాతో రేపటినుంచే వన్డే సిరీస్!

బంగ్లాదేశ్ తో రేపటినుంచే జరిగే మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో పాల్గొనే భారతజట్టు నుంచి సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గాయంతో వైదొలిగాడు. షమీకి బదులుగా యువఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కు జట్టులో చోటు కల్పించారు.

Umran Malik
X

Umran Malik

బంగ్లాదేశ్ తో రేపటినుంచే జరిగే మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో పాల్గొనే భారతజట్టు నుంచి సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గాయంతో వైదొలిగాడు. షమీకి బదులుగా యువఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కు జట్టులో చోటు కల్పించారు.

బంగ్లాదేశ్ తో బంగ్లాగడ్డపై రేపటి నుంచి జరిగే తీన్మార్ వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే భారత్ కు గట్టి దెబ్బ తగిలింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భుజం గాయంతో జట్టు నుంచి ఉపసంహరించుకొన్నాడు.

షమీ స్థానంలో మెరుపు ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కు చోటు కల్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

సీనియర్ స్టార్లతో భారతజట్టు..

న్యూజిలాండ్ తో ముగిసిన వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న సీనియర్ స్టార్లు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్..బంగ్లాతో సిరీస్ ద్వారా తిరిగి బరిలోకి దిగనున్నారు.

డిసెంబర్ 4 నుంచి 10 వరకూ జరిగే మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులోని ఇతర ఆటగాళ్లలో

విరాట్ కొహ్లీ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠీ, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.

2013 నుంచి భారతజట్టుకు ఆడుతూ వచ్చిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి 82 వన్డేల్లో 152 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. అయితే నెట్ ప్రాక్టీసు చేస్తున్న సమయంలో భుజానికి గాయం కావడంతో బంగ్లాటూర్ కు దూరమయ్యాడు. షమీకి బదులుగా కేవలం 3వన్డేల్లో 3 వికెట్లు మాత్రమే పడగొట్టిన అనుభవం ఉన్న యువఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను జట్టులోకి తీసుకొన్నారు.

సిరీస్ లోని తొలివన్డేను ఢాకా నేషనల్ స్టేడియం వేదికగా నిర్వహిస్తారు. డిసెంబర్ 7న జరిగే రెండోవన్డే సైతం నేషనల్ స్టేడియంలోనే జరుగుతుంది. డిసెంబర్ 10న జరిగే ఆఖరి వన్డే చోటాగ్రామ్ లోని జహూర్ అహ్మద్ చౌదరీ స్టేడియం వేదికగా జరుగుతుంది.

బంగ్లాదేశ్ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ లిట్టన్ దాస్ నాయకత్వం వహిస్తున్నాడు.

First Published:  3 Dec 2022 8:47 AM GMT
Next Story