షమీకి కరోనా, ఉమేశ్‌కు పిలుపు!
ప్రపంచకప్‌కు సన్నాహాలలో భాగంగా ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభంకానున్న తీన్మార్ టీ-20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో మహ్మద్ షమీకి చోటు దక్కింది.
ఆస్ట్రేలియాతో తీన్మార్ టీ-20 సిరీస్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కరోనాబారిన పడడంతో..మరో ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌కు జట్టులో చోటు కల్పించారు. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోనా వైరస్..క్రమక్రమంగా తగ్గిపోతున్నా..భారత క్రికెటర్లను మాత్రం వెంటాడుతూనే ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో కెప్టెన్ రోహిత్ శర్మ, ఆసియాకప్ ప్రారంభానికి ముందు చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కరోనాబారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై కరోనా వైరస్ దాడి చేసింది.
పాపం! షమీ...
ప్రపంచకప్‌కు సన్నాహాలలో భాగంగా ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభంకానున్న తీన్మార్ టీ-20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో మహ్మద్ షమీకి చోటు దక్కింది. ప్రపంచకప్ జట్టులో స్టాండ్ బైస్ లో చోటు సంపాదించిన షమీ...కంగారూలతో తొలి టీ-20 మ్యాచ్ ఆడటానికి కొద్దిరోజుల ముందే కరోనా వైరస్‌తో జట్టుకు దూరమయ్యాడు. షమీకి కరోనా టెస్టులో పాజిటివ్ వచ్చిందని, అతని స్థానంలో ఉమేశ్ యాదవ్‌కు జట్టులో చోటు కల్పించినట్లు బీసీసీఐ ప్రకటించింది. షమీని క్వారంటైన్‌లో ఉంచామని, అతను కోలుకొని నెగిటివ్‌గా వస్తే తిరిగి జట్టుతో చేరవచ్చునని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌కు షమీ అందుబాటులోకి రాగలడని భావిస్తున్నట్లు తెలిపారు.
2019 తర్వాత ఉమేశ్‌కు పిలుపు...
మహ్మద్ షమీకి సోకిన కరోనా...మరో ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ పాలిట వరంగా మారింది. కేవలం టెస్టు మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమైన ఉమేశ్ యాదవ్ కాలి పిక్కల గాయంతో గత కొద్ది మాసాలుగా ఆటకు దూరంగా ఉన్నాడు. అంతేకాదు..2019లో చివరిసారిగా భారత టీ-20 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఉమేశ్ యాదవ్ భారత్ తరపున తన చివరి 7 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లను 2019కు ముందే ఆడాడు. మూడేళ్ల విరామం తర్వాత..మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 20న జరుగనున్న తొలి మ్యాచ్ ద్వారా తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో మిడిల్ సెక్స్ జట్టు తరపున ఆడుతూ 35 సంవత్సరాల ఉమేశ్ యాదవ్ గాయపడి..చికిత్సతో పూర్తిగా కోలుకొన్నాడు. మిడిల్ సెక్స్ జట్టు తరపున ఉమేస్ 7 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. 2022 ఐపీఎల్ మొదటి అంచె పోటీలలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఉమేశ్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్ నెస్ టెస్టులో ఉమేశ్ యాదవ్ సఫలమయ్యాడు. అదే సమయంలో షమీకి కరోనా పాజిటివ్ కావడంతో...అతని స్థానంలో ఉమేశ్‌కు భారత జట్టులో చోటు కల్పించారు.