Telugu Global
Sports

వన్డే ప్రపంచకప్ కు నేడు భారతజట్టు ఎంపిక

భారత్ వేదికగా అక్టోబర్ లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ఈరోజు ప్రకటించనుంది.

వన్డే ప్రపంచకప్ కు నేడు భారతజట్టు ఎంపిక
X

భారత్ వేదికగా అక్టోబర్ లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ఈరోజు ప్రకటించనుంది....

భారత్ వేదికగా 12 సంవత్సరాల విరామం తర్వాత జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల ఆతిథ్యజట్టును బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించనున్నారు.

ఆసియాకప్ కు ఎంపిక చేసిన 18 మంది సభ్యులజట్టు నుంచి ముగ్గురు సభ్యులకు ప్రపంచకప్ జట్టులో చోటు ఉండబోదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ గతవారమే సూచనప్రాయంగా తెలిపాడు.

తుదిజట్టులో చోటు లేని ఆ ముగ్గురు?

ప్రస్తుతం శ్రీలంక, పాకిస్థాన్ దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న 2023 ఆసియాకప్ టోర్నీలో పాల్గొంటున్న భారతజట్టులో 17 మంది సభ్యులతో ప్రధానజట్టుతో పాటు..విజిటింగ్ సభ్యుడిగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు సైతం చోటు కల్పించారు.

మొత్తం 18 మంది సభ్యుల జట్టులో రోహిత్ శర్మ కెప్టెన్, హార్థిక్ పాండ్యా వైస్-కెప్టెన్లుగా, శుభ్ మన్ గిల్, విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ, ఇషాన్ కిషన్ తో పాటు విజిటింగ్ సభ్యుడిగా సంజు శాంసన్ ఉన్నారు.

ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ఫిట్ నెస్ సమస్యల కారణంగా సంజు శాంసన్ ను స్టాండ్ బై వికెట్ కీపర్ బ్యాటర్ గా జట్టుతో పాటు విజిటింగ్ మెంబర్ గా కొనసాగిస్తున్నట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు.

తిలక్ వర్మకు ప్రపంచకప్ బెర్త్ లేనట్లే?

హైదరాబాదీ స్టార్ బ్యాటర్ తిలకవర్మతో పాటు ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ, సంజు శాసన్ లకు ప్రపంచకప్ జట్టులో అవకాశం లేదని బోర్డువర్గాలు చెబుతున్నాయి. కెఎల్ రాహుల్ ఫిట్ నెస్ పై అనుమానాలున్నా ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయమైపోయింది.

రోహిత్ శర్మ నాయకుడిగాను, హార్థిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గాను ఖాయం కాగా..జట్టులోని మిగిలిన 13మంది సభ్యుల్లో శుభ్ మన్ గిల్, విరాట్ కొహ్లీ, ఇషాన్ కిషన్,కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రాకు చోటు దక్కనుంది.

గాయాల నుంచి పూర్తిగా కోలుకొని జట్టుకు అందుబాటులోకి వచ్చిన బుమ్రా, రాహుల్, శ్రేయస్ అయ్యర్ ల ఆటతీరు పైనే ప్రపంచకప్ లో భారత్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

యజువేంద్ర చహాల్ కు మొండిచెయ్యి..

లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ కు ప్రపంచకప్ జట్టులో సైతం చోటు దక్కదని తేలిపోయింది.

ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లతో చర్చించిన అనంతరం ప్రపంచకప్ కు భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ఖాయం చేయనుంది.

ఐసీసీ ఆదేశించిన గడువు ప్రకారం సెప్టెంబర్ 5 లోగా వివిధ క్రికెట్ బోర్డులు 15 మందిసభ్యులతో కూడిన తమతమ జట్లను ప్రకటించి తీరాలి. అయితే..బీసీసీఐ మాత్రం ఐసీసీ గడువుకు రెండురోజుల ముందే తుదిజట్టును ప్రకటించాలని నిర్ణయించింది.

1983, 2011 ప్రపంచకప్ టోర్నీలలో విజేతగా నిలిచిన భారత్ ఆ తర్వాత నుంచి గత పుష్కరకాలంగా మరో టైటిల్ కోసం ఎదురుచూస్తోంది.

First Published:  3 Sept 2023 2:41 PM IST
Next Story