Telugu Global
Sports

ప్రపంచకప్ లో నేడే తొలి క్వార్టర్స్ పోరు!

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ తొలిమ్యాచ్ లో ఈ రోజు టాప్ ర్యాంకర్ బ్రెజిల్ తో 16వ ర్యాంకర్ క్రొయేషియా తలపడనుంది

ప్రపంచకప్ లో నేడే తొలి క్వార్టర్స్ పోరు!
X

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ తొలిమ్యాచ్ లో ఈ రోజు టాప్ ర్యాంకర్ బ్రెజిల్ తో 16వ ర్యాంకర్ క్రొయేషియా తలపడనుంది. ఈ పోరు భారత కాలమానం ప్రకారం రాత్రి 8-30 గంటలకు ప్రారంభంకానుంది....

ప్రపంచ సాకర్ అభిమానులను గత మూడువారాలుగా ఓలలాడిస్తున్న 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ నాకౌట్ సమరం రెండోదశ పోటీలకు ఈరోజు తెరలేవనుంది.

ఖతర్ రాజధాని దోహా లోని పలు స్టేడియాలు వేదికలుగా జరుగుతున్న ఈటోర్నీలో అసలుసిసలు పోరు ఇప్పుడే ప్రారంభమయ్యింది.

16 జట్ల ప్రీ-క్వార్టర్ ఫైనల్ నాకౌట్ రౌండ్ నుంచి బ్రెజిల్, ఫ్రాన్స్, క్రొయేషియా, ఇంగ్లండ్, అర్జెంటీనా, పోర్చుగల్, మొరాకో, నెదర్లాండ్స్ జట్లు ఆఖరి ఎనిమిదిజట్ల పోరుకు అర్హత సాధించడంతో క్వార్టర్ ఫైనల్స్ పోరుకు రంగం సిద్ధమయ్యింది.

సాంబాజోరుకు క్రొయేషియా బేజారేనా?

దోహాలోని ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం వేదికగా ఈ రాత్రి 8-30 గంటలకు ప్రారంభమయ్యే తొలి క్వార్టర్ ఫైనల్లో ఐదుసార్లు విజేత బ్రెజిల్ తో గత టోర్నీ రన్నరప్ క్రొయేషియా తలపడనుంది.

ఫిఫా ర్యాంకింగ్స్ ప్రకారం బ్రెజిల్ నంబర్ వన్ గా ఉంటే..క్రొయేషియా 16వ ర్యాంక్ జట్టుగా ఉంది. నైమర్, రిచార్లీసన్, వినీషియో జూనియర్, రోడ్రిగో, ఎల్డర్, రాఫినా, కస్మీరో లాంటి పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కూడిన బ్రెజిల్ హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది.

ప్రీ-క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాను 4-1 గోల్స్ తో చిత్తు చేసిన సాంబాటీమ్...క్వార్టర్స్ లోనూ అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది.

మరోవైపు..లూకా మాడ్రిచ్ నాయకత్వంలోని క్రొయేషియాజట్టు సైతం యువత, అనుభంతో కూడిన ఆటగాళ్ల మేళవింపుతో నిలకడగా రాణిస్తూ వస్తోంది. గత ప్రపంచకప్ లో ఫైనల్ చేరడం ద్వారా అందరి దృష్టీ ఆకర్షించిన క్రొయేషియా వరుసగా రెండో ప్రపంచకప్ టోర్నీలో క్వార్టర్స్ చేరడం ద్వారా సత్తా చాటుకొంది.

ప్రీ-క్వార్టర్ ఫైనల్లో జపాన్ పై పెనాల్టీ షూటౌట్ గెలుపుతో క్వార్టర్స్ లో అడుగుపెట్టిన క్రొయేషియా స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితే బ్రెజిల్ కు గట్టిపోటీ తప్పదు.

యువఆటగాడు జోస్కో గ్వార్డియోల్ తో సహా 18 మంది నవతరం ఆటగాళ్లతో క్రొయేషియా కేరింతలు కొడుతోంది.

కేవలం 40 లక్షల జనాభా మాత్రమే కలిగిన అతిచిన్నదేశం క్రొయేషియా..ప్రపంచ ఫుట్ బాల్ లో మాత్రం అగ్రశ్రేణిజట్లలో ఒకటిగా ఉంటూ వస్తోంది. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకూ ఆరుసార్లు ఫైనల్ రౌండ్లో పాల్గొన్న క్రొయేషియాకు మూడుసార్లు క్వార్టర్ ఫైనల్ రౌండ్ చేరిన రికార్డు ఉంది.

హాట్ ఫేవరెట్ బ్రెజిల్ పై సంచలన విజయంతో సెమీస్ చేరితే క్రొయేషియా అతిపెద్ద సంచలనం సృష్టించినజట్టుగా మిగిలిపోతుంది.

First Published:  9 Dec 2022 10:34 AM IST
Next Story