Telugu Global
Sports

ఆసియాకప్ లీగ్ లో నేడు ఆఖరాట!

ఆసియాకప్ టీ-20 టోర్నీ సూపర్ -4 రౌండ్లో చోటు కోసం రెండుసార్లు విజేత పాకిస్థాన్ కు పసికూన హాంకాంగ్ సవాలు విసురుతోంది. ఆరుజట్లు, రెండుగ్రూపులు, ఆరుమ్యాచ్ ల లీగ్ సమరానికి నేటితో తెరపడనుంది.

ఆసియాకప్ లీగ్ లో నేడు ఆఖరాట!
X

ఆసియాకప్ టీ-20 టోర్నీ సూపర్ -4 రౌండ్లో చోటు కోసం రెండుసార్లు విజేత పాకిస్థాన్ కు పసికూన హాంకాంగ్ సవాలు విసురుతోంది. ఆరుజట్లు, రెండుగ్రూపులు, ఆరుమ్యాచ్ ల లీగ్ సమరానికి నేటితో తెరపడనుంది.

టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా యునైటెట్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న 2022 ఆసియాకప్ టోర్నీ తొలి ( గ్రూప్ లీగ్ ) దశ పోటీలు ముగింపు దశకు చేరాయి.

షార్జా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి 7-30 గంటలకు జరిగే లీగ్ దశ ఆఖరాటలో ప్రపంచ రెండోర్యాంకర్ పాకిస్థాన్ తో పోరుకు 20వ ర్యాంకర్ హాంకాంగ్ సై అంటోంది.


లీగ్ దశ నుంచే బంగ్లాదేశ్ అవుట్....

ఆసియాకప్ మాజీ రన్నరప్ బంగ్లాదేశ్ పోరు లీగ్ దశలోనే ముగిసింది. గ్రూప్ - బీ లీగ్ నుంచి సూపర్ -4 రౌండ్ చేరాలంటే నెగ్గితీరాల్సిన మ్యాచ్ లో శ్రీలంక చేతిలో 2 వికెట్ల పరాజయం చవిచూసింది.

గ్రూప్ ప్రారంభమ్యాచ్ లో ఆప్ఘనిస్థాన్ చేతిలో కంగుతిన్న బంగ్లాదేశ్‌...రెండోమ్యాచ్ లో భారీస్కోరు సాధించినా బౌలర్ల వైఫల్యంతో ఓటమి చవిచూడక తప్పలేదు.

గ్రూప్ - బీ లీగ్ లో ఆప్ఘనిస్థాన్ రెండుకు రెండు మ్యాచ్ లూ నెగ్గి 4 పాయింట్లతో సూపర్ -4 రౌండ్ చేరిన తొలిజట్టుగా నిలిచింది.

తన ప్రారంభమ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఓడినా...బంగ్లాదేశ్ తో ఉత్కంఠభరితంగా సాగిన లీగ్ రెండోరౌండ్ పోరులో శ్రీలంక 2 వికెట్ల సంచలన విజయం సాధించింది.

దుబాయ్ వేదికగా జరిగిన అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లో 184 పరుగుల అత్యధిక స్కోరును చేజ్ చేసిన జట్టుగా శ్రీలంక రికార్డుల్లో చేరింది. ఈ విజయంతో గ్రూప్ - బీ లీగ్ నుంచి ఆప్ఘనిస్థాన్, శ్రీలంకజట్లు సూపర్-4 రౌండ్ చేరినట్లయ్యింది.

గ్రూప్- ఏ నుంచి భారత్...

పాకిస్థాన్, హాంకాంగ్ జట్లు ప్రత్యర్థులుగా గ్రూప్- ఏ లీగ్ లో ఆడిన రెండుకు రెండు మ్యాచ్ లు నెగ్గడం ద్వారా ఏడుసార్లు విన్నర్ భారత్...సూపర్ - 4 రౌండ్ కు అలవోకగా అర్హత సంపాదించింది.

ప్రారంభమ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను 5 వికెట్ల తేడాతో అధిగమించిన భారత్...రెండోమ్యాచ్ లో పసికూన హాంకాంగ్ ను 40 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా బ్యాక్ టు బ్యాక్ విజయాలు నమోదు చేయగలిగింది.

షార్జా స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే పోరులో హాంకాంగ్ ను ఓడించడం ద్వారా మాజీ చాంపియన్ పాకిస్థాన్ సూపర్ -4 రౌండ్ చేరనుంది. పాకిస్థాన్ లో జన్మించిన పలువురు క్రికెటర్లు ప్రస్తుత ఆసియాకప్ లో హాంకాంగ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

పవర్ ఫుల్ పాకిస్థాన్ తో జరిగే పోరులో హాంకాంగ్ ఏమాత్రం పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి పాక్ పై హాంకాంగ్ సంచలన విజయం సాధించినా..రెండుమ్యాచ్ ల్లో నెట్ రన్ రేట్ ప్రాతిపదికన పాక్ జట్టే సూపర్-4 రౌండ్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

క్వాలిఫైయింగ్ టోర్నీలో సింగపూర్, ఎమిరేట్స్, ఒమాన్ లాంటి జట్లను చిత్తు చేయడం ద్వారా ఆసియాకప్ ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించిన హాంకాంగ్ స్థాయికి తగ్గట్టుగా ఆడితేనే పాక్ కు గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది.

సెప్టెంబర్ 4న భారత్- పాక్ ఢీ...

ఆసియాకప్ క్రికెట్ అంటేనే చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. ఆసియాకప్ లో పాల్గొనే జట్లకు తగిన మ్యాచ్ ప్రాక్టీసు ఉండడంతో పాటు...ఆసియా క్రికెట్ మండలికి భారీగా ఆదాయం సమకూరేలా 2022 ఆసియాకప్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

తొలిదశ గ్రూపులీగ్, రెండోదశ సూపర్-4 రౌండ్, ఆఖరి దశ ఫైనల్స్ గా మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

భారత్-పాక్ జట్లు ఢీ కొంటున్నాయంటే చాలు..దుబాయ్, షార్జా, అబుదాబీ క్రికెట్ స్టేడియాలు కిటకిటలాడి పోవడం మామూలు విషయమే. అక్కడి భారత, పాక్ సంతతి ప్రజలు, ఉద్యోగులు, అభిమానులు స్టేడియాలకు భారీసంఖ్యలో తరలిరావడం..నిర్వాహక సంఘానికి కాసుల పంట పండించనుంది.

First Published:  2 Sept 2022 9:29 AM IST
Next Story