నేడే ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంకతో భారత్ ఢీ.. మ్యాచ్‌కు వర్షం ముప్పు
ఆసియా కప్‌లో ప్రదర్శనను చూస్తే భారత జట్టే హాట్ ఫేవరెట్‌గా కనపడుతోంది. సూపర్-4 దశలో శ్రీలంకపై భారత్ చెమటోడ్చి నెగ్గింది.
ఆసియా కప్ వన్డే టోర్నీ తుది అంకానికి చేరుకున్నది. బలమైన భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటల నుంచి ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. భారత్ ఇప్పటి వరకు 7 సార్లు, శ్రీలంక 6 సార్లు విజేతగా నిలిచాయి. ఇక సొంత గడ్డపై ఆడుతున్న శ్రీలంక ఈ టోర్నీ గెలిచి భారత్‌తో సమానంగా నిలుస్తుందా? శ్రీలంక స్నిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఎనిమిదోసారి టైటిల్ గెలుస్తుందా అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోనున్నది.
ఆసియా కప్‌లో ప్రదర్శనను చూస్తే భారత జట్టే హాట్ ఫేవరెట్‌గా కనపడుతోంది. సూపర్-4 దశలో శ్రీలంకపై భారత్ చెమటోడ్చి నెగ్గింది. శ్రీలంక స్పిన్నర్లు సొంత గడ్డపై ఈ మధ్య చక్కగా రాణిస్తున్నారు. పాకిస్తాన్‌ను చాలా వరకు కట్టడి చేయడంలో సఫలం అయ్యారు. భారత్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో కూడా టాప్ బ్యాటర్లను పెవీలియన్‌కు పంపారు. ముఖ్యంగా వెల్లలాగే స్పిన్‌తో భారత్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతడు చెలరేగితే భారత బ్యాటింగ్‌కు సవాలుగా మారే అవకాశం ఉన్నది.
కోహ్లీ, గిల్, రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరు చెలరేగి ఆడినా భారత్‌కు భారీ స్కోర్ లభించడం ఖాయమే. మిగిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లు ఉన్నారు. హార్దిక్ పాండ్యా కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. ఇక బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మకు ఫైనల్‌లో చోటు దొరుకుతుందా లేదా అనేది అనుమానమే.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ చక్కని ఫామ్‌లో ఉన్నాడు. పాక్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విజృంభించాడు. అతడికి బుమ్రా, సిరాజ్‌లు తోడైతే శ్రీలంకను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయవచ్చు. కొలంబో ప్రేమదాస స్టేడియంలో ఇప్పటి వరకు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ సార్లు గెలిచాయి. దీంతో టాస్ కూడా కీలకంగా మారనున్నది.
కాగా, ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉన్నది. మొదటి నుంచి ఆసియా కప్‌ను వెంటాడుతున్న వర్షం.. ఫైనల్ మ్యాచ్‌ను కూడా డిస్ట్రబ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే సోమవారాన్ని రిజర్వ్ డేగా ప్రకటించారు. ఈ రోజు మ్యాచ్ జరగకపోతే సోమవారం ఫైనల్ నిర్వహించనున్నారు.