Telugu Global
Sports

టీ-20 ఫ్రపంచకప్ కు వేళాయెరా!

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ చరిత్రలో ఎనిమిదో ప్రపంచకప్ సమరానికి ఆస్ట్ర్రేలియా వేదికగా రంగం సిద్ధమయ్యింది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్ 2007 తర్వాత మరో ప్రపంచకప్ కు ఉరకలేస్తోంది.

టీ-20 ఫ్రపంచకప్ కు వేళాయెరా!
X

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ చరిత్రలో ఎనిమిదో ప్రపంచకప్ సమరానికి ఆస్ట్ర్రేలియా వేదికగా రంగం సిద్ధమయ్యింది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్ 2007 తర్వాత మరో ప్రపంచకప్ కు ఉరకలేస్తోంది. 12 అత్యుత్తమజట్ల ఈ పోరు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను నాలుగువారాలపాటు ఉర్రూతలూగించనుంది...

కరోనా పుణ్యమా అంటూ ఏడాది విరామంలోనే రెండో టీ-20 ప్రపంచకప్ క్రికెట్ సమరానికి కంగారూల్యాండ్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. గత ఏడాది భారత్ వేదికగా జరగాల్సిన 2021 ప్రపంచకప్ టోర్నీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా నిర్వహించారు. 2022 ప్రపంచకప్ కు మాత్రం ఆస్ట్ర్రేలియా ఆతిథ్యమిస్తోంది.

అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకూ జరిగే ఈ టోర్నీలో మొత్తం 12 ( భారత్, ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, అఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాతో పాటు...యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జింబాబ్వే, నమీబియా, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ జట్ల నుంచి మరో రెండుజట్లు సూపర్ -12 రౌండ్లో పోటీపడనున్నాయి.

16జట్లు...45 మ్యాచ్ లు...నాలుగువారాల షో...

సూపర్ -12 రౌండ్లో చోటు కోసం జరిగే తొలి అంచె పోటీలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జింబాబ్వే, నమీబియా, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ జట్లు తలపడతాయి.

2022 సీజన్ టీ-20 ఫార్మాట్లో అత్యధిక విజయాలతో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టుగా నిలిచిన భారత్ ...రోహిత్ శర్మ కెప్టెన్ గా, రాహుల్ ద్రావిడ్ ప్రధాన శిక్షకునిగా మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతోంది.

2007 ప్రారంభ ప్రపంచకప్ ను మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో గెలుచుకొన్న నాటినుంచి..మరో ప్రపంచకప్ కోసం గత 15 సంవత్సరాలుగా భారత్ ఎదురుచూస్తోంది.

2007 నుంచి 2021 వరకూ జరిగిన మొత్తం ఏడు ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధికంగా రెండుసార్లు విజేతగా నిలిచిన ఏకైకజట్టుగా వెస్టిండీస్ ( 2012, 2016 ) చరిత్ర సృష్టించింది.

2007లో భారత్, 2009లో పాకిస్థాన్, 2010లో ఇంగ్లండ్, 2014లో శ్రీలంక, 2021లో ఆస్ట్ర్రేలియా ప్రపంచ చాంపియన్లుగా నిలిచాయి. టెస్ట్ హోదా పొందిన దేశాలలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే మాత్రమే కనీసం ఒక్కసారీ టైటిల్ కు నోచుకోలేకపోయాయి.

హాట్ ఫేవరెట్లుగా భారత్, ఆస్ట్ర్రేలియా, పాక్...

భిన్నమైన వాతావరణం, ఫాస్ట్ బౌన్సీ పిచ్ లకు మరో పేరైన ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగున్న ప్రస్తుత ప్రపంచకప్ లో ఆతిథ్య ఆస్ట్ర్రేలియా, ప్రపంచ టాప్ ర్యాంకర్ భారత్, మాజీ చాంపియన్ పాకిస్థాన్ జట్లు హాట్ ఫేవరెట్లుగా టైటిల్ వేటకు దిగుతున్నాయి. న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు సైతం అంచనాలకు మించి రాణించడం ద్వారా ప్రపంచకప్ అందుకొన్నా ఆశ్చర్యపోనక్కరలేదు.

ప్రపంచకప్ లో నంబర్ వన్ టీమ్ భారత్ అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా తన ప్రారంభమ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆడనుంది. అక్టోబర్ 27న సిడ్నీ వేదికగా క్వాలిఫైయర్స్ ద్వారా అర్హత సాధించినజట్టుతో పోటీపడుతుంది. అక్టోబర్ 30న పెర్త్ వేదికగా జరిగే పోరులో దక్షిణాఫ్రికాతోను, నవంబర్ 2న అడిలైడ్ ఓవల్ వేదికగా బంగ్లాదేశ్ తోనూ, నవంబర్ 6న మెల్బోర్న్ వేదికగా జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ లో క్వాలిఫైయర్స్ ద్వారా అర్హత సాధించిన మరో జట్టుతోనూ భారత్ తలపడాల్సి ఉంది.

గ్రూప్ లీగ్ లో 5 మ్యాచ్ లు...

గ్రూప్ -1 లో ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్ఘనిస్థాన్ తో పాటు క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా వచ్చిన మరో రెండుజట్లు పోటీపడతాయి. గ్రూప్ -2 లీగ్ లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లతో పాటు క్వాలిఫైయిర్స్ ద్వారా అర్హత సాధించిన మరో రెండుజట్లు పోటీపడతాయి.

గ్రూప్ లీగ్ దశలో మొదటి రెండుస్థానాలు సాధించిన జట్లు సెమీఫైనల్స్ నాకౌట్ దశలో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

45 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ...

ప్రపంచకప్ విజేతల కోసం ఐసీసీ మొత్తం 45కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కేటాయించింది. సూపర్-12 రౌండ్లో ఆస్ట్ర్రేలియా, భారత్, న్యూజిలాండ్, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, భారత్, నమీబియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లతో పాటు ఐర్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తలపడనున్నాయి. రెండో అంచె సూపర్ -12 రౌండ్లో 12 ప్రధానజట్లు టైటిల్ సమరంలో పాల్గోనున్నాయి.

విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు 13 కోట్ల 50 లక్షల 35వేల 440 రూపాయల ప్రైజ్ మనీ అందచేయనున్నారు. రన్నరప్ జట్టుకు 6 కోట్ల 52 లక్షల 64వేల 280 రూపాయలు దక్కనున్నాయి.

సెమీస్ లో ఓడిన రెండుజట్లకు చెరో 3 కోట్ల 26 లక్షల 20వేల 220 రూపాయల చొప్పున ఇస్తారు. సూపర్ -12 రౌండ్ నుంచే నిష్క్ర్రమించినజట్లకు 57 లక్షల రూపాయల చొప్పున, సూపర్ -12 రౌండ్లో విజయం సాధించిన జట్లకు మ్యాచ్ కు 32 లక్షల 62వేల 22 రూపాయల చొప్పున అందచేస్తారు.

గత ప్రపంచకప్ విజేతకు 11 కోట్ల 90 లక్షలు ప్రైజ్ మనీగా చెల్లించగా...ప్రస్తుత టోర్నీలో ఆ మొత్తం 13 కోట్ల 50 లక్షలకు పెరిగింది.

భారత్ సత్తాకు అసలు పరీక్ష....

టీ-20 ప్రపంచకప్ కోసం గత 15 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ బ్యాటింగ్ లో భీకరంగాను, బౌలింగ్ లో అసమతౌల్యంతోనూ కనిపిస్తోంది. ప్రపంచకప్ ప్రారంభంనాటికి గాయాలపాలైన భారత కీలక ఆటగాళ్లందరూ పూర్తిస్థాయిలో కోలుకోవాలని, రోహిత్ సేన స్థాయికి తగ్గట్టుగా ఆడి విశ్వవిజేతగా స్వదేశానికి తిరిగిరావాలని శతకోటి భారత అభిమానులు ఆశపడుతున్నారు.

First Published:  16 Oct 2022 10:21 AM IST
Next Story