Telugu Global
Sports

తిలక్ వర్మ మెరిసినా తొలి టీ-20లో భారత్ బోల్తా!

వెస్టిండీస్ తో పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ ఓటమితో ప్రారంభించింది. తొలిపోరులో 4 పరుగుల ఓటమి చవిచూసింది.

తిలక్ వర్మ మెరిసినా తొలి టీ-20లో భారత్ బోల్తా!
X

వెస్టిండీస్ తో పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ ఓటమితో ప్రారంభించింది. తొలిపోరులో 4 పరుగుల ఓటమి చవిచూసింది.

కరీబియన్ గడ్డపై వెస్టిండీస్ తో ప్రారంభమైన ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ తొలిపోరులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్ పోరాడి ఓడింది. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ తన అరంగేట్రం మ్యాచ్ లోనే మెరుపులు మెరిపించినా మిగిలిన బ్యాటర్ల వైఫల్యంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

స్లో పిచ్ పైన లోస్కోరింగ్ పోరు....

ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని బ్రయన్ లారా స్టేడియం స్లోపిచ్ పైన జరిగిన ఈ తొలిపోరులో భారత్ ఇద్దరు యువఆటగాళ్లకు అంతర్జాతీయ టీ-20 అరంగేట్రం అవకాశం కల్పించింది.

2023 ఐపీఎల్ లో సత్తాచాటుకొన్న హైదరాబాద్ కమ్ ముంబై ఇండియన్స్ యువబ్యాటర్ తిలక్ వర్మతో పాటు..బెంగాల్ మీడియం పేసర్ ముకేశ్ కుమార్ లకు టీ-20 క్యాప్ లు దక్కాయి.

బ్యాటింగ్ కు అంతగా అనువుకాని తారుబా పిచ్ పైన ..కీలక టాస్ నెగ్గిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగుల స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ రోవ్ మన్ పావెల్ 32 బంతుల్లో 48 పరుగులు సాధించడంతో ప్రత్యర్థి ఎదుట కరీబియన్ జట్టు 150 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.

కరీబియన్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ 34 బంతుల్లో 41 పరుగులతో రాణించాడు.

ఓపెనర్ బ్రెండన్ కింగ్ సైతం 19 బంతుల్లోనే 28 పరుగులతో తనజట్టుకు చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే ..భారత బౌలర్లు పకడ్బందీగా బౌల్ చేసి ఆఖరి 30 బంతుల్లో కరీబియన్ బ్యాటర్లను 42 పరుగులకే పరిమితం చేయగలిగారు.

భారత బౌలర్లలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ 24 పరుగులిచ్చి 2 వికెట్లు, పేసర్ అర్షదీప్ 2 వికెట్లు, కుల్దీప్, పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.

150 స్కోరు ముందు చిన్నబోయిన భారత్..

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 150 పరుగులు మాత్రమే చేయాల్సిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ మెరుపు ఆరంభాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారు.

గిల్ 3, ఇషాన్ 6 పరుగులకు అవుటైనా..వన్ డౌన్ సూర్యకుమార్, రెండో డౌన్ తిలక్ వర్మ మూడో వికెట్ కు 41 పరుగుల భాగస్వామ్యంతో విజయానికి మార్గం సుగమం చేశారు.

20 సంవత్సరాల తిలక్ వర్మ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగుల స్కోరుతో వారేవ్వా అనిపించుకొన్నాడు. మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ 21 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ తో 21 పరుగులు సాధించి అవుటయ్యాడు.

మ్యాచ్ ను మలుపుతిప్పిన హోల్డర్..

భారత విజయం ఖాయమనుకొంటున్న తరుణంలో కరీబియన్ జెయింట్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ వరుస వికెట్లతో మ్యాచ్ ను మలుపుతిప్పాడు. ఆట 16వ ఓవర్ ను మేడిన్ గా వేయటంతో పాటు కెప్టెన్ హార్థిక్ పాండ్యాను 19 పరుగుల స్కోరుకే పడగొట్టాడు. డేంజర్ మాన్ సంజు శాంసన్ 12 బంతుల్లో ఓ సిక్సర్ తో 12 పరుగుల స్కోరు రనౌట్ కావడంతో భారత్ 113 పరుగులకే 6 టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఓటమి అంచుల్లో పడిపోయింది.

లోయర్ ఆర్డర్లో అర్షదీప్ సింగ్ 12 పరుగులు సాధించినా..మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరి 6 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన భారత్ 6 పరుగులు మాత్రమే రాబట్టి 4 పరుగుల ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వెస్టిండీస్ విజయంలో ప్రధానపాత్ర వహించిన జేసన్ హోల్డర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

కరీబియన్ జట్టుకు ఇది నాలుగో గెలుపు...

భారత్ ప్రత్యర్థిగా లోస్కోరింగ్ లక్ష్యాన్ని వెస్టిండీస్ నాలుగోసారి కాపాడుకోగలిగింది. 2016లో నాగపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 126 పరుగుల లక్ష్యాన్ని , 2009లో నాటింగ్ హామ్ వేదికగా 130 పరుగులు, 2015లో హరారే వేదికగా 145 పరుగుల లక్ష్యాలను కాపాడుకొన్న కరీబియన్ టీమ్..ప్రస్తుత సిరీస్ లో 150 పరుగుల విజయలక్ష్యాన్ని సైతం రక్షించుకోగలిగింది.

సిరీస్ లోని రెండో సమరం గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా ఆగస్టు 6న సూపర్ సండే ఫైట్ గా జరుగనుంది.

First Published:  4 Aug 2023 11:42 AM IST
Next Story