ఆరేళ్ల నిరీక్షణ ఇది- శివమ్ మావీ
శ్రీలంకతో తీన్మార్ టీ-20 సిరీస్ తొలిమ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన యువఫాస్ట్ బౌలర్ శివమ్ మావీ గాల్లో తేలిపోతున్నాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈపోరులో భారత్ 2 పరుగుల విజయం సాధించడంలో శివమ్ మావీ ప్రధానపాత్ర వహించాడు.
అరంగేట్రం టీ-20 మ్యాచ్ లోనే మ్యాచ్ విన్నర్ గా నిలవడం పట్ల యువఫాస్ట్ బౌలర్ శివమ్ మావీ పొంగిపోతున్నాడు. ఆరేళ్ల నిరీక్షణకు తగిన ఫలితం వచ్చిందంటూ మురిసిపోతున్నాడు....
శ్రీలంకతో తీన్మార్ టీ-20 సిరీస్ తొలిమ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన యువఫాస్ట్ బౌలర్ శివమ్ మావీ గాల్లో తేలిపోతున్నాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈపోరులో భారత్ 2 పరుగుల విజయం సాధించడంలో శివమ్ మావీ ప్రధానపాత్ర వహించాడు. కెరియర్ తొలిమ్యాచ్ లోనే 4 వికెట్లు సాధించడం ద్వారా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు.
గాయాలను జయించి....
అండర్ -19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన శివమ్ మావీ భారత సీనియర్ జట్టులో చోటు కోసం గత ఆరు సంవత్సరాలుగా నిరీక్షిస్తూ వచ్చాడు. భారతజట్టులో చోటుకు పలువురు బౌలర్ల నుంచి గట్టిపోటీ ఉండడంతో కఠోరసాధనే చేశాడు. సాధన చేస్తూ తరచూ గాయాలకు గురయ్యాడు. ఒకదశలో తన క్రికెట్ జీవితం ముగిసిపోయిందేమోనంటూ భయపడిపోయాడు. తనకుతానే ధైర్యం చెప్పుకొని మొండిగా ఆడటం మొదలు పెట్టాడు.
జూనియర్ ప్రపంచకప్ హీరో...
2018 ప్రపంచ జూనియర్ క్రికెట్ టోర్నీలో భారత్ ను విజేతగా నిలపడంలో మరో యువఫాస్ట్ బౌలర్ కమలేశ్ నగర్ కోటీ తో కలసి శివమ్ మావీ కీలకపాత్ర పోషించాడు. అదేసీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున 2 కోట్ల రూపాయల వేలం ధరకు ఐపీఎల్ లో పాల్గొన్నాడు.
ఐపీఎల్ లో పాల్గొంటూ తరచూ గాయాలకు గురికావటంతో శివమ్ పలు రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి వచ్చింది. గాయాల నుంచి తేరుకొని పూర్తిస్థాయి ఫిట్ నెస్ సాధించడానికి తీవ్రస్థాయిలోనే శ్రమించాల్సి వచ్చింది.
6 కోట్ల ధరతో గుజరాత్ టైటాన్స్ కు...
గత నెలలో ముగిసిన 2023 ఐపీఎల్ సీజన్ మినీ వేలంలో శివమ్ మావీకి 6కోట్ల రూపాయల ధర పలికింది. ప్రస్తుత చాంపియన్ గుజరాత్ టైటాన్స్ భారీధర చెల్లించి మరీ శివమ్ ను దక్కించుకొంది.
అంతేకాదు..కొత్తసంవత్సరం మొదటివారం రోజుల్లోనే అదృష్టం టీ-20 క్యాప్ రూపంలో శివమ్ తలుపు తట్టింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ తో కలసి ముంబై వాంఖడే స్టేడియంలో
శ్రీలంక ప్రత్యర్థిగా అంతర్జాతీయ టీ-20 అరంగేట్రం చేసే అవకాశాన్ని శివమ్ దక్కించుకొన్నాడు. అంతేకాదు..తొలి అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లోనే నిప్పులు చెరిగే బౌలింగ్ తో చెలరేగిపోయాడు. తనజట్టుకు 4 వికెట్లతో సంచలన విజయం అందించడంతో పాటు అరంగేట్రం మ్యాచ్ లో మూడో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత బౌలర్ గా నిలిచాడు.
4 వికెట్లతో అరుదైన రికార్డు..
టీ-20 అరంగేట్రం మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు పడగొట్టిన భారత మూడోబౌలర్ గా, రెండో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన ఫాస్ట్ బౌలర్ గా శివమ్ రికార్డుల్లో చోటు సంపాదించాడు.
2016లో జింబాబ్వే పై బరిందర్ శ్రణ్ సాధించిన 10 పరుగులకే 4 వికెట్ల రికార్డు ఇప్పటికీ అత్యుత్తమ ప్రదర్శనగా రికార్డుల్లో నిలిచింది. లెఫ్టామ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా 2009లో నాటింగ్ హామ్ వేదికగా బంగ్లాదేశ్ పైన తన అరంగేట్రం 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత సిరీస్ తొలిమ్యాచ్ లో శివమ్ 22 పరుగులకు 4 వికెట్ల రికార్డుతో మూడోస్థానంలో నిలిచాడు.
పవర్ ప్లేలో పవర్ ఫుల్ బౌలింగ్...
పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ ను కలిగిన శ్రీలంకను అదుపు చేయాలంటే పవర్ ప్లే ఓవర్లలో దూకుడుగా బౌల్ చేయాలని తాను నిర్ణయించుకొన్నానని, తన వ్యూహాన్ని అమలు చేసి తగిన ఫలితాలను రాబట్టానని శివమ్ చెప్పాడు. తొలి ఓవర్లలోనే బుల్లెట్ లాంటి బంతితో శ్రీలంక ఓపెనర్ పతుమ్ నిస్సంకను పడగొట్టడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని శివమ్ చెప్పాడు.
భారతజట్టులో చోటు కోసం గత ఆరేళ్లుగా ఎదురుచూస్తూ వచ్చానని..కొత్త సంవత్సరంలో ఆ నిరీక్షణ ఫలించదని, అరంగేట్రం మ్యాచ్ లోనే స్థాయికి తగ్గట్టుగా రాణించడం సంతృప్తినిచ్చిందని, రానున్న మ్యాచ్ ల్లోనూ ఇదేజోరు కొనసాగిస్తానని శివమ్ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.