ఐపీఎల్ డబ్బుతో మదం తలకెక్కింది..కపిల్ చురకలు!
భారత స్టార్ క్రికెటర్లకు దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ చురకలంటించారు. ఐపీఎల్ డబ్బుతో మదం తలకెక్కిందంటూ మండి పడ్డారు.
భారత స్టార్ క్రికెటర్లకు దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ చురకలంటించారు. ఐపీఎల్ డబ్బుతో మదం తలకెక్కిందంటూ మండి పడ్డారు.
నేటితరం భారత స్టార్ క్రికెటర్ల తీరుపట్ల లెజెండరీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతాతమకే తెలుసుననే భ్రమల్లో జీవిస్తున్నారంటూ మండిపడ్డారు.
తాము క్రికెటర్లుగా ఉన్నరోజుల్లో బ్యాటింగ్ లేదా బౌలింగ్ సమస్యలు ఎదురైతే సీనియర్ క్రికెటర్ల సలహాలు, సూచనలు తీసుకొంటూ లోపాలను సరిదిద్దుకొనేవారమని..
ప్రస్తుతం స్టార్ క్రికెటర్లుగా పేరున్న పలువురు ఆటగాళ్లలో అలాంటి ధోరణి ఏమాత్రం కనిపించడం లేదని ఓ ఇంటర్వూలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఐపీఎల్ ఆదాయంతోనే అంతా....
ఐపీఎల్ తో కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న డబ్బుతో ఎగిరిపడుతున్నారని, అంతా తమకే తెలుసునన్న ధోరణి రానురాను పెరిగిపోతోందని, తమ లోపాలను సరిదిద్దుకోడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని అన్నారు.
అంతర్జాతీయస్థాయిలో క్రికెట్ ఆడుతున్న సమయంలో బ్యాటింగ్ లేదా బౌలింగ్ విభాగాలలో సాంకేతికగా పలు రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయని, బలహీనతలు వెంటాడుతూ ఉండడంతో వరుస వైఫల్యాలు తప్పవని, ఈ పరిస్థితి నుంచి ఎవ్వరికీ మినహాయింపు ఉండదని గుర్తు చేశారు.
వరుసగా విఫలమవుతూ వస్తున్న సమయంలో ఆ పరిస్థితి నుంచి బయటపడటం కోసం అపారఅనుభవం కలిగిన దిగ్గజ క్రికెటర్ల సలహాలు, సూచనలు అడగటంలో తప్పులేదని, తమ రోజుల్లో అదే చేసేవారమని చెప్పుకొచ్చారు.
అయితే..మితిమీరిన ఆత్మవిశ్వాసంతో, అంతా తమకే తెలుసునని భావించే నేటితరం స్టార్ క్రికెటర్లు మాత్రం తమ లోపాలు, బలహీనతలను అంతతేలికగా ఆమోదించరని, ఎవ్వరితీనూ సంప్రదించరని, సీనియర్ల సలహాలు సూచనలు తీసుకోనే తీసుకోరని వివరించారు.
అప్పుడు గవాస్కర్, ఇప్పుడు కపిల్ దేవ్...
గతంలో భారత ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్, దిగ్గజ కామెంటటీర్ సునీల్ గవాస్కర్ సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. విరాట్ కొహ్లీ వరుసగా మూడేళ్ల పాటు విఫలమవుతూ వచ్చిన సమయంలో తన లోపాల గురించి ఏనాడూ తనతో పాలుపంచుకోలేదని, తన సలహాలు, సూచనలు అడగనే లేదని అప్పట్లో గవాస్కర్ ప్రకటించారు.
టెస్టు క్రికెట్ చరిత్రలో 125కు పైగా మ్యాచ్ లు ఆడి 10వేల పరుగులు సాధించిన తొలి ఓపెనర్ గా సునీల్ గవాస్కర్ కు గొప్పఅనుభవమే ఉంది. అంతేకాదు..లోపాలను ఇట్టే పసిగట్టి, బలహీనతల్ని అధిగమించడానికి సలహాలు, సూచనలు ఇచ్చే నేర్పు సైతం లిటిల్ మాస్టర్ లో ఎంతో ఉంది. 50 సంవత్సరాల క్రికెట్ అనుభవం ఉన్న గవాస్కర్ తో తమ లోపాలను సవరించుకోడానికి సలహాలు తీసుకొనే వారే కరువయ్యారని కపిల్ వాపోయారు.
రాహుల్ ద్రావిడ్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి ప్రపంచ మేటి బ్యాటర్లే తమకు సమస్యలు ఎదురైనప్పుడు సిగ్గపడకుండా, ఏమాత్రం సంకోచం లేకుండా తమవద్దకు వచ్చి సలహాలు సూచనలు తీసుకొంటూ తమ లోపాలను అధిగమించే వారని కపిల్ గుర్తు చేశారు.
ఐపీఎల్ లో సీజన్ కు కేవలం 5వారాలపాటు ఆడితేనే జీవితానికి సరిపడా డబ్బు నేటితరం క్రికెటర్లకు వస్తోందని, ఇదంత అపరిమితంగా వచ్చిన డబ్బు తెచ్చిన తంటా, మితిమీరిన ఆత్మవిశ్వాసం, లెక్కలేని తనం అంటూ కపిల్ అసహనం వ్యక్తం చేశారు.
కాలంమారింది, కాలాన్ని బట్టి క్రికెటర్లూ మారిపోతున్నారన్న వాస్తవాన్ని 1970 దశకం నాటి దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ గ్రహించలేకపోతున్నారేమో అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.