Telugu Global
Sports

అప్పుడు మారడోనా- ఇప్పుడు మెస్సీ!

ఆధునిక సాకర్ గ్రేట్ లయనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. తన ఆఖరి ప్రపంచకప్ టోర్నీలో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. 36 సంవత్సరాల చిరకాల స్వప్నాన్ని ఎట్టకేలకు సాకారం చేశాడు.

అప్పుడు మారడోనా- ఇప్పుడు మెస్సీ!
X

అప్పుడు మారడోనా- ఇప్పుడు మెస్సీ!

ఆధునిక సాకర్ గ్రేట్ లయనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. తన ఆఖరి ప్రపంచకప్ టోర్నీలో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. 36 సంవత్సరాల చిరకాల స్వప్నాన్ని ఎట్టకేలకు సాకారం చేశాడు....

ప్రపంచకప్ ఫుట్ బాల్ టైటిల్ ను మూడోసారి గెలుచుకోవాలన్న అర్జెంటీనా 36 సంవత్సరాల కలను కెప్టెన్, దిగ్గజ ఆటగాడు లయనల్ మెస్సీ ఎట్టకేలకు నిజం చేశాడు.

ఖతర్ రాజధాని దోహాలోని లూసేయిల్ స్టేడియం వేదికగా ముగిసిన మహాటైటిల్ సమరంలో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ పై పెనాల్టీ షూటౌట్ విజయం సాధించడం ద్వారా తనజట్టును విశ్వవిజేతగా నిలిపాడు.

1986లో మారడోనా.....

ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనాకు గతంలో ఐదుసార్లు ఫైనల్స్ చేరినా రెండుసార్లు మాత్రమే విజేతగా నిలిచిన రికార్డు ఉంది. 1978 లో మారియో కాంపెస్ నాయకత్వంలో తొలిసారిగా ప్రపంచకప్ నెగ్గిన అర్జెంటీనా తన రెండో టైటిల్ ను 1986లో డియాగో మారడోనా కెప్టెన్సీలో గెలుచుకొంది.

1986 ప్రపంచకప్ లో యూరోపియన్ జట్ల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయటం ద్వారా దిగ్గజ ఆటగాడు డియాగో మారడోనా తనజట్టు కు..అన్నీతానై విజయం అందించాడు.

ఆ తర్వాత నుంచి మరో ప్రపంచకప్ టైటిల్ కోసం అర్జెంటీనా గత 36 సంవత్సరాలుగా చకోరపక్షిలా ఎదురుచూస్తూ వచ్చింది.

2022లో లయనల్ మెస్సీ...

16 సంవత్సరాల చిరుప్రాయంలో ప్రపంచకప్ అరంగేట్రం చేసిన లయనల్ మెస్సీకి తన కెరియర్ లో ఇదే ఆఖరి ప్రపంచకప్. గత ఐదు ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొంటూ వచ్చిన మెస్సీ ఆఖరి ప్రయత్నంలో కానీ అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలుపలేకపోయాడు.

ఏ మాత్రం అంచనాలు లేకుండా 2022 ప్రపంచకప్ బరిలో నిలిచిన అర్జెంటీనా గ్రూప్- సీ లీగ్ పోరు ఓటమితో మొదలు పెట్టింది.

ప్రారంభమ్యాచ్ లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత నుంచి విజయపరంపర కొనసాగించింది. గ్రూప్-సీ లీగ్ టాపర్ గా ప్రీ-క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన అర్జెంటీనా...నాకౌట్ మ్యాచ్ ల్లో ఆస్ట్ర్రేలియా, క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్, సెమీఫైనల్లో క్రొయేషియాను చిత్తు చేయడం ద్వారా ఆరోసారి ఫైనల్ కు అర్హత సాధించింది

అంతేకాదు..హోరాహోరీగా సాగిన టైటిల్ సమరంలో ప్రాన్స్ ను పెనాల్టీ షూటౌట్లో 4-2 గోల్స్ తో అధిగమించడం ద్వారా ప్రపంచకప్ ను మూడోసారి అందుకోగలిగింది.

1986లో గొప్పనాయకుడిగా, స్టార్ ఆటగాడిగా మారడోనా అర్జెంటీనాకు రెండోసారి ప్రపంచకప్ అందిస్తే...2022లో లయనల్ మెస్సీ మిడ్ ఫీల్డ్ మాంత్రికుడిగా, అసలు సిసలు నాయకుడిగా తనజట్టుకు మూడోసారి ప్రపంచకప్ అందించడం ద్వారా..తన ఆరాధ్యదైవం మారడోనా సరసన చోటు సంపాదించాడు.

మెస్సీ రికార్డులే రికార్డులు...

ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా లయనల్ మెస్సీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మొత్తం ఐదు ప్రపంచకప్ టోర్నీలలో 26 మ్యాచ్ లు ఆడి 13 గోల్స్ తో టాపర్ గా నిలిచాడు. అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్ ల్లో ( 19 ) నాయకత్వం వహించిన ఆటగాడిగా కూడా మెస్సీ ప్రపంచ రికార్డు సాధించాడు.

అత్యుత్తమ ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బాల్ అవార్డును సైతం మెస్సీ సొంతం చేసుకోగలిగాడు. ప్రపంచకప్ ప్రారంభానికి ముందే తన రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ..చివరి ప్రయత్నంలో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలపడం ద్వారా తన సాకర్ జీవితాన్ని సార్థకం చేసుకోగలిగాడు.

అర్జెంటీనాకు కోపా అమెరికా కప్ తో పాటు..ఫిఫా ప్రపంచకప్ అందించిన మొనగాడిగా లయనల్ మెస్సీ ఫుట్ బాల్ చరిత్రలో మిగిలిపోతాడు.

First Published:  19 Dec 2022 9:16 AM IST
Next Story