అప్పుడు గుండప్ప విశ్వనాథ్...ఇప్పుడు రోహిత్ శర్మ!
గౌహతీ వేదికగా శ్రీలంకతో ముగిసిన తొలివన్డేలో భారత సారధి రోహిత్ శర్మ గొప్ప క్రికెట్ స్ఫూర్తిని ప్రదర్శించాడు. కెప్టెన్ గా తన పరిణతిని చాటుకొన్నాడు.
గౌహతీ వేదికగా శ్రీలంకతో ముగిసిన తొలివన్డేలో భారత సారధి రోహిత్ శర్మ గొప్ప క్రికెట్ స్ఫూర్తిని ప్రదర్శించాడు. కెప్టెన్ గా తన పరిణతిని చాటుకొన్నాడు.
క్రికెట్ కు జెంటిల్మన్ గేమ్ అన్నపేరుంది. అయితే..ప్రొఫెషనల్ క్రికెట్ పేరుతో ఈ పెద్దమనుషుల క్రీడను గత రెండుదశాబ్దాలుగా క్రికెటర్లే భ్రష్టు పట్టిస్తూ వస్తున్నారు.
క్రికెట్ మర్యాదనే మంటగలుపుతూ వస్తున్నారు.
నిబంధనలు, నియమాల పేరుతో..కిందపడైనా తామే గెలవాలన్నలక్ష్యంతో అడ్డదారిలో విజయాల కోసం క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించే క్రికెటర్లు, కెప్టెన్లు ఎందరో ఉన్నారు.
అయితే..తమ హుందా తనం, ఔచిత్యంతో క్రికెట్ మర్యాదనే కాపాడి, మర్యాదస్తుల క్రీడకే వన్నె తెచ్చిన అతికొద్ది మంది కెప్టెన్ల జాబితాలో భారత సారధి రోహిత్ శర్మ సైతం చేరాడు.
1980లో గుండప్ప విశ్వనాథ్..
1980లో ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన సెంటినరీ టెస్టుమ్యాచ్ లో భారత కెప్టెన్ గా వ్యవహరించిన గుండప్ప విశ్వనాథ్...అంపైర్ అవుట్ గా ప్రకటించిన ఇంగ్లండ్ బ్యాటర్ ఇయాన్ బోథమ్ ను వెనక్కు పిలిపించి ఆడించడమే కాదు..భారత పరాజయానికి కారకుడైనా..విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకొన్నారు. కెప్టెన్ అంటే విశ్వనాథే అంటూ కొనియాడారు. తన మనసుకు అవుటయ్యానని అనిపిస్తే..అంపైర్ల నిర్ణయం కోసం వేచిచూడకుండా క్రీజు విడిచి వెళ్లే మొనగాడిగా గుండప్ప విశ్వనాథ్ కు పేరుంది.
2023 లో రోహిత్ శర్మ....
2023 వన్డే సిరీస్ లో భాగంగా గౌహతీ వేదికగా శ్రీలంకతో ముగిసిన తొలివన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన అసాధారణ నిర్ణయంతో క్రికెట్ స్ఫూర్తికే వన్నె తెచ్చాడు.
ప్రత్యర్థిజట్టు కెప్టెన్ దాసున్ షనకను భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ( మన్కడింగ్ అవుట్ ) రనౌట్ చేయడంతో అంపైర్..అవుట్ గా ప్రకటించారు. అప్పటికే షనక తనజట్టు తరపున ఒంటరిపోరాటం చేస్తూ..భారత బౌలర్లను వీరోచితంగా ఎదుర్కొంటూ పోరాడుతున్నాడు. షనక 98 పరుగుల స్కోరుతో ఉన్న సమయంలో అవుటయ్యాడు.
అయితే..భారత కెప్టెన్ రోహిత్ మాత్రం..అవుటైన షనకను వెనక్కు పిలిపించడం ద్వారా..తమ నిర్ణయాన్ని వెనక్కితీసుకొంటున్నట్లు ప్రకటించాడు.
దాంతో షనక 88 బంతుల్లో 108 పరుగుల నాటౌట్ స్కోరు సాధించగలిగాడు.
రోహిత్ పుణ్యమా అంటు షనక శతకం..
షనక అవుటైనట్లు అంపైర్ ప్రకటించిన నిర్ణయాన్ని రోహిత్ శిరసావహించి ఉంటే..సెంచరీ పూర్తి చేయకుండానే 98 పరుగుల స్కోరుకే శ్రీలంక కెప్టెన్ వెనుదిరిగే వాడే. అయితే..భారత బౌలర్ షమీ..ప్రత్యర్థి కెప్టెన్ ను రనౌట్ చేసిన తీరు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నా..క్రికెట్ స్ఫూర్తికి మాత్రం విరుద్ధమంటూ భారత కెప్టెన్ తన నిర్ణయాన్ని సమర్థించుకొన్నాడు.
గొప్పగా పోరాడుతూ, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న షనకను ఆ విధంగా అవుట్ చేయాలని తాము అనుకోలేదని, 98 పరుగుల స్కోరుతో ఉన్న ఆటగాడిని మన్కడింగ్ అవుట్ తో పెవీలియన్ దారి పట్టించడం సముచితంకానేకాదని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ రోహిత్ ప్రకటించాడు.
భారతజట్టు భారీవిజయం సాధించిన ఈమ్యాచ్ లో 670కి పైగా పరుగులు నమోదు కావడం, విరాట్ కొహ్లీ తన 45వ వన్డే శతకం బాదడం, రోహిత్- శుభ్ మన్ గిల్ మొదటి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడం, రోహిత్ 83, గిల్ 70 పరుగుల స్కోర్లు సాధించడం లాంటి అసాధారణ సంఘటనలు చోటు చేసుకొన్న ఈ మ్యాచ్ లో
కెప్టెన్ హోదాలో రోహిత్ శర్మ ఓ గొప్ప నిర్ణయం తీసుకోడం ద్వారా వివాదానికి తావివ్వకుండా..క్రీడాస్ఫూర్తిని, క్రికెట్ స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా వారేవ్వా! అనిపించుకొన్నాడు. కెప్టెన్ అంటే ఎలా ఉండాలో భావితరాలకు తెలియచెప్పాడు.