Telugu Global
Sports

లలిత్ మోడీ.. ఐపీఎల్‌ను ఎంత పాపులర్ చేశాడో.. అంతకంటే ఎక్కువ భ్రష్టుపట్టించిన అడ్మినిస్ట్రేటర్

లలిత్ మోడీ జీవితం అంతా స్కాములు, ఇతర వివాదాలకు నిలయమే. లలిత్ మోడీ కుటుంబానికి పెద్ద వ్యాపారమే ఉన్నది. కానీ దానిలోకి వెళ్లకుండా సొంతగా మోడీ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్ వర్క్ (మెన్) అనే సంస్థను ప్రారంభించాడు.

లలిత్ మోడీ.. ఐపీఎల్‌ను ఎంత పాపులర్ చేశాడో.. అంతకంటే ఎక్కువ భ్రష్టుపట్టించిన అడ్మినిస్ట్రేటర్
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌గా పేరు తెచ్చుకున్న ఐపీఎల్.. బీసీసీఐని అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా మార్చింది. కేవలం ఐపీఎల్ కారణంగా బీసీసీఐ ఖజానాలోకి వేల కొట్ల రూపాయలు వచ్చి జమ అవుతున్నాయి. ఐపీఎల్ పేరు వినగానే అందరికీ లలిత్ మోడీనే గుర్తుకు వస్తాడు. ఈ మెగా లీగ్‌ను రూపొందించి, తొలి మూడేళ్ల పాటు చైర్మన్‌గా వ్యవహరించింది అతడే. ఐపీఎల్‌ను కార్పొరేట్లకు దగ్గర చేయడమే కాకుండా, క్రికెటర్ల వేతనాలు కోట్ల రూపాయలకు పెంచాడు. అయితే, మొదటి నుంచి అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయిన లలిత్ మోడీ.. ఐపీఎల్‌ను కూడా తన సొంత అవసరాలకు వాడుకుందామని ప్రయత్నించి బొక్కాబోర్లా పడ్డాడు. ఐపీఎల్ చైర్మన్‌గా ఉంటూనే కొన్ని ఫ్రాంచైజీల్లో వాటాలు కొనడం, బెట్టింగ్‌లకు వీలు కల్పించేలా వ్యవహరించడం, స్పాట్ ఫిక్సింగ్ వంటి ఆరోపణలను ఎదుర్కొని.. చివరకు దేశం విడిచి వెళ్లిపోయాడు. ఐపీఎల్‌ను ఎంత పాపులర్ చేశాడో.. తన అక్రమాల కారణంగా అంతే భ్రష్టు పట్టించాడనే ఆరోపణలు ఎదుర్కున్నాడు.

గతం కూడా వివాదాస్పదమే..

లలిత్ మోడీ జీవితం అంతా స్కాములు, ఇతర వివాదాలకు నిలయమే. లలిత్ మోడీ కుటుంబానికి పెద్ద వ్యాపారమే ఉన్నది. కానీ దానిలోకి వెళ్లకుండా సొంతగా మోడీ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్ వర్క్ (మెన్) అనే సంస్థను ప్రారంభించాడు. తండ్రి దగ్గర డబ్బులు అడుక్కొని 1993లో ఈ వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఇండియాలో వాల్ట్ డిస్నీకి చెందిన టీవీ ఛానల్స్‌ను మెన్ అనే సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసేది. ఫ్యాషన్ టీవీ, ఈఎస్‌పీఎన్‌కు ఇండియాలో మెన్ అధికారిక డిస్ట్రిబ్యూటర్. కేబుట్ టీవీ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేసి వాల్ట్ డిస్నీకి చెల్లించడమం మోడీ కంపెనీ పని. 10 ఏళ్లకు గాను 978 మిలియన్ డాలర్ల విలువ చేసే పనిని.. మోడీకి అప్పగిస్తే.. చివరకు నష్టాలు చూపించాడు. కేబుల్ ఆపరేటర్లు చెల్లించిన సొమ్ములను సగం దారి మళ్లించి జేబులో వేసుకున్నాడు. దీంతో ఈఎస్‌పీఎన్ కాంట్రాక్టును పొడిగించలేదు.

మోడీ సొంతగా ముంబైలో చాలా వ్యాపారాలు చేశాడు. కానీ ఒక్కటి కూడా లాభాల్లో లేకుండా పోయింది. 2002లో కేరళలో సిక్సో అనే సంస్థను ప్రారంభించాడు. అది కూడా వర్కవుట్ కాలేదు. అయితే ఈఎస్‌పీఎన్‌ డిస్ట్రిబ్యూటర్‌గా క్రికెట్ పెద్దలతో పరిచయాలు ఏర్పడ్డాయి. అంతకు ముందు అమెరికా స్పోర్ట్స్ లీగ్‌ను దగ్గర నుంచి గమనించిన మోడీ.. బీసీసీఐ కూడా అలాంటి లీగ్‌ను ప్రారంభించాలని భావించాడు. కానీ.. అతడికి బీసీసీఐలోకి ఎంట్రీ ఎలాగనే ఆలోచన వచ్చింది.

ఎన్సీపీ అధినేత శరద్ పవర్‌ సాయంతో నెమ్మదిగా బోర్డులోకి వచ్చాడు. అంతకు ముందు దొడ్డి దారిన రాజస్థాన్ క్రికెట్ ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పటి రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే లలిత్ మోడీకి సహకరించారు. జగ్‌మోహన్ దాల్మియాను బీసీసీఐ ప్రెసిడెంట్‌గా పక్కకు తప్పించడంలో శరద్ పవార్‌కు సహకరించాడు. అలా బీసీసీఐ వైస్-ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే అంతకు ముందే అతడు అమెరికాలో డ్రగ్ ట్రాఫికింగ్ కేసును, ఈఎస్‌పీఎన్‌ స్కామ్ కేసును ఎదుర్కుంటున్నాడు. అయినా సరే బీసీసీఐలోకి వసుంధర రాజే మరియు శరద్ పవర్ లాబీయింగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.

బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా ఉంటూ ఐపీఎల్‌కు రూపకల్పన చేశాడు. పూర్తిగా కార్పొరేట్ల చేతిలో ఇండియన్ క్రికెట్‌ను పెట్టేశాడు. ప్రతీ దానికి స్పాన్సరర్ ఉండేలా చూశాడు. అప్పటి వరకు బౌండరీ లైన్‌ దగ్గర ఒక తాడు మాత్రమే ఉండేది. దాని మీద కూడా యాడ్స్ వెయ్యాలనే ఐడియా లలిత్ మోడీదే. ఇలా ఎంత వీలైతే అంతగా మార్కెటింగ్ చేసి ఐపీఎల్‌ను బీసీసీఐకి ఒక బంగారు బాతులా మార్చేశాడు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌తో పాటే ఐపీఎల్ గవర్నింగ్ బాడీ చైర్మన్‌గా మారిపోయాడు. ఇక ఐపీఎల్ విషయంలో తాను ఆడిందే ఆట.. పాడిందే పాటగా మార్చేశాడు.

కొంత మంది ఫ్రాంచైజీ యాజమాన్యాలతో దగ్గరగా ఉంటూ వచ్చాడు. బెట్టింగ్స్, డ్రగ్స్, పార్టీలు, స్పాట్ ఫిక్సింగ్.. వాట్ నాట్.. అన్ని రకాల అక్రమాలకు లలిత్ మోడీ కేంద్ర బిందువు అయ్యాడు. ఫ్రాంచైజీలు కట్టబెడతానని కొంత మంది దగ్గర కోట్లలో వసూలు చేశాడు. అతడి నిర్వాకాల కారణంగానే కోచి ఫ్రాంచైజీకి సంబంధించి ఎన్నో గొడవలు జరిగాయ. మీ ఫ్రాంచైజీని ఐపీఎల్‌లో లేకుండా చేస్తానని బెదిరించాడు. దీనిపై సదరు ఫ్రాంచైజీ బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో లలిత్ మోడీపై సస్పెన్షన్ విధించింది. 2010 ఏప్రిల్ 22న మోడీకి బీసీసీఐకి సంబంధాలు తెగిపోయాయి. అతడిపై 22 రకాల అభియోగాలను బీసీసీఐ మోపింది.

క్రికెట్‌కు సంబంధించిన ఎన్నో డీల్స్ తన స్నేహితులకు ఇప్పించినట్లు, బ్రాడ్‌కాస్ట్ టెండర్లలో కూడా వేలు పెట్టినట్లు, గవర్నింగ్ బాడీని కాదని సొంత నిర్ణయాలు తీసుకున్నట్లు పలు ఆరోపణలు అతడిపై నమోదయ్యాయి. మనీ లాండరింగ్ కేసుకూడా నమోదు కావడంతో అతడు ఇండియా నుంచి లండన్ పారిపోయాడు. ఆ రోజు నుంచి ఇండియా ముఖం చూడని లలిత్ మోడీ తరచూ వార్తల్లో ఉంటారు. ఆ మధ్య మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో సన్నిహితంగా ఉంటున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ.. తాము ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పారు.

తాజాగా, రాహుల్ గాంధీపై లండన్ కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. దొంగల ఇంటి పేరు మోడీ అని ఎందుకుంటుందనే వ్యాఖ్యలపై లలిత్ మోడీకి కూడా కోపం వచ్చింది. అయితే, అతడి జీవితం ఒక సారి పరిశీలిస్తే అన్నీ స్కాములు, కేసులే ఉంటాయి. ఇప్పుడు ఇవే విషయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

First Published:  30 March 2023 10:42 AM GMT
Next Story