సూర్యజోరు వెనుక అసలు రహస్యం?
థూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో గత ఏడాదికాలంగా తాను పరుగులమోత మోగించడం వెనుక ఉన్న అసలు కిటుకు ఏమిటో బయటపెట్టాడు.
థూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో గత ఏడాదికాలంగా తాను పరుగులమోత మోగించడం వెనుక ఉన్న అసలు కిటుకు ఏమిటో బయటపెట్టాడు. బీసీసీఐ కోసం సహఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ రూపొందించిన ఓ ఇంటర్వ్యూలో తన సక్సెస్ ఫార్ములాను వెల్లడించాడు....
టీ-20 క్రికెట్లో గత ఏడాదికాలంగా అత్యంత విజయవంతమైన బ్యాటర్ గా పలు అరుదైన రికార్డులు నెలకొల్పిన మిస్టర్ 360 షాట్ మేకర్, నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు తన సక్సెస్ కు కారణం ఏంటో బయటపెట్టాడు.
విలక్షణ షాట్లతో పరుగుల సునామీ...
టీ-20 క్రికెట్ ను పలు వినూత్న షాట్లతో కొత్తపుంతలు తొక్కిస్తున్న సూర్యకుమార్ యాదవ్ గత 11 మాసాలలో అత్యంత విజయవంతమైన బ్యాటర్ గా నిలిచాడు. 2022 క్యాలెండర్ ఇయర్ లో వెయ్యి పరుగులు సాధించిన తొలి, ఏకైక భారత బ్యాటర్ గా నిలిచిన సూర్యకుమార్ ప్రస్తుత ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ ఐదు గ్రూపుమ్యాచ్ ల్లోనే మూడు అర్ధశతకాలతో సహా 225 పరుగులు సాధించాడు. రికార్డుస్థాయిలో 193.97 స్ట్ర్రయిక్ రేట్ తో వారేవ్వా అనిపించుకొన్నాడు.
రెండోడౌన్లో సూపర్ హిట్...
రోహిత్ శర్మ, రాహుల్, విరాట్ కొహ్లీ లాంటి దిగ్గజ బ్యాటర్లతో కూడిన భారత బ్యాటింగ్ ఆర్డర్ రెండోడౌన్లో బ్యాటింగ్ కు దిగుతున్న సూర్యకుమార్..క్రీజులోకి వచ్చిరావడంతోనే
ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతున్నాడు. ఆఫ్ సైడ్, ఆన్ సైడ్, వికెట్ల ముందు, వెనుక అన్నతేడాలేకుండా అలవోకగా బౌండ్రీలు, సిక్సర్లు బాదేస్తూ సూర్యానా ..మజాకానా అనిపించుకొంటున్నాడు.
ఇంగ్లండ్ తో టీ-20 సిరీస్ లో మెరుపు సెంచరీతో అంతర్జాతీయ టీ-20 క్రికెట్లోకి ఓ మెరుపులా దూసుకొచ్చిన సూర్యకుమార్ ..దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్ లో హాంకాంగ్ తో ముగిసిన పోరులోనూ, ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్ -2 లీగ్ లో భాగంగా నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లతో ముగిసిన పోటీలలో తన బ్యాటింగ్ పవర్ ఏంటో ప్రత్యర్థిజట్లకు మాత్రమే కాదు...కోట్లాదిమంది అభిమానులకు సైతం చవిచూపించాడు.
వికెట్ కు వెలుపలగా వెళుతున్న బంతులను ర్యాంప్ షాట్లతో సిక్సర్లకు బాదడం కేవలం సూర్యకుమార్ కు మాత్రమే చెల్లింది. గ్రౌండ్ 360 డిగ్రీల కోణంలో ఏదిశగానైనా షాట్లు కొట్టగల మొనగాడు సూర్యకుమార్.
ఆ షాట్లతోనే పరుగుల మోత...
తాను కొడుతున్న పలురకాల విలక్షణ, అసాధారణ ( ర్యాంప్, రివర్స్ స్వీప్, స్వీప్, స్విచ్ హిట్, హెలీకాప్టర్ ) షాట్ల వెనుక గంటలతరబడి చేసిన సాధన ఉందని, తన హోం గ్రౌండ్ ముంబై వాంఖడే స్టేడియంలో తాను నిరంతరం ప్రాక్టీసు చేస్తూ వచ్చానని, నెట్ ప్రాక్టీస్ సమయంలో ఇవే షాట్లు ఆడుతూ రావడమే తన విజయరహస్యమని..అశ్విన్ తో మాట్లాడుతూ సూర్య చెప్పాడు.
జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడటం, నిర్భయంగా, ఒత్తిడి ఏమాత్రం లేకుండా, బౌలర్ ఎవరన్నది చూడకుండా, ప్రత్యర్థి ఎవరన్నది ఏమాత్రం పట్టించుకోకుండా షాట్లు కొట్టడమే తన విధానమని చెప్పాడు.
ర్యాంప్ షాట్లతో తన సక్సెస్ రేట్ చాలా ఎక్కువని, తనకు అత్యధిక పరుగులు ర్యాంప్ షాట్లతోనూ వస్తుంటాయని వివరించాడు.
వాంఖడేలో సూర్యా...వికెట్...
ముంబై వాంఖెడీ స్టేడియంలో సూర్యకుమార్ ప్రాక్టీసు కోసం ప్రత్యేకంగా ఓ ఫాస్ట్ పిచ్ ను అందుబాటులో ఉంచారు. ప్రస్తుత ప్రపంచకప్ కు ముందు వరకూ తనకు ఆస్ట్ర్రేలియా పిచ్ లపైన ఆడిన అనుభవం ఏమాత్రం లేదని, అక్కడి ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లపై ఆడాలంటే...ప్రాక్టీసు సమయంలో ఓ బౌన్సీ పిచ్ ఉండాలని, అలాంటి పిచ్ ను ముంబై క్రికెట్ సంఘం తనకోసం తయారు చేసిందని సూర్య గుర్తు చేశాడు.
ఆస్ట్ర్రేలియాలోని స్టేడియాలు పెద్దవిగా, బౌండ్రీలు సుదూరంగా ఉన్న..ముంబై ఫాస్ట్ పిచ్ పై ర్యాంప్ షాట్లు ప్రాక్టీసు చేయడం ద్వారా అధిగమించానని గుర్తు చేశాడు. ఆస్ట్ర్రేలియా పిచ్ లపైన సైతం తాను అలవోకగా పరుగులు సాధించడం వెనుక బౌన్సీ పిచ్ పైన సాధనే కారణమని చెప్పాడు.
ఒత్తిడి సమయంలో బ్యాటింగ్ కు దిగటం, మెరుపుషాట్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థిజట్లనే ఒత్తిడిలోకి నెట్టడమే తన ప్రధాన వ్యూహమని సూర్యకుమార్ వివరించాడు.
ప్రస్తుతం టీ-20 ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ గా ఉన్న సూర్యకుమార్..ఇంగ్లండ్ తో గురువారం అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ లో కీలకం కానున్నాడు.
ప్రస్తుత టీ-20 క్రికెట్లో క్రికెట్ దిగ్గజాలందరూ సూర్యకుమార్ గురించే మాట్లాడుకోటం చూస్తే...మిస్టర్ 360 షాట్ మేకర్ సూర్యానా..మజాకానా! అనుకోక తప్పదు మరి.!