నిజమైన 'శ్రీమంతుడు' సంజు శాంసన్!
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ప్రతిభావంతుడైన క్రికెటర్ మాత్రమే కాదు..చక్కటి వ్యక్తిత్వం, గొప్పమనసున్న వాడు కూడా.
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ప్రతిభావంతుడైన క్రికెటర్ మాత్రమే కాదు..చక్కటి వ్యక్తిత్వం, గొప్పమనసున్న వాడు కూడా...
సంజు శాంసన్...ఈ పేరు వినగానే ప్రతిభకు తగ్గట్టుగా భారతజట్టులో తగిన అవకాశాలు దక్కని ఓ ప్రతిభావంతుడైన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మాత్రమే అభిమానులకు గుర్తుకు వస్తాడు.
ఏడాదికి రెండుమాసాలపాటు మాత్రమే సాగే ఐపీఎల్ లో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ సారథిగా వార్తలలో వినిపించే సంజు శాంసన్ పేరు..ఆ తర్వాత మాత్రం భారత వన్డే, టీ-20 జట్లలో చోటు దక్కని ఆటగాళ్ల జాబితాలో చేరిపోతూ ఉంటుంది.
చురుకైన వికెట్ కీపర్ గా, దూకుడుగా ఆడే బ్యాటర్ గా పేరున్న సంజు శాంసన్ కు..ప్రస్తుత భారత కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రియశిష్యుడిగా కూడా గుర్తింపు ఉంది. అయితే..ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఉండటం, వచ్చిన అవకాశాలను పూర్తి స్థాయిలో సంజు సద్వినియోగం చేసుకోలేకపోడం దెబ్బతీస్తూ వస్తున్నాయి. అడపాదడపా భారత వన్డే జట్టుకు ఆడుతున్న సంజు ..ఐపీఎల్ లో మాత్రం తానేమిటో నిరూపించుకొంటూ వస్తున్నాడు. కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా, టాపార్డర్ బ్యాటర్ గా సత్తా చాటుకొంటూ వస్తున్నాడు.
కృతజ్ఞతకు, విశ్వాసానికి మరోపేరు..
2018 ఐపీఎల్ సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న సంజు శాంసన్..సీజన్ కు 15కోట్ల రూపాయలు కాంట్రాక్టుపై ఆడుతూ వస్తున్నాడు. వేరే ఫ్రాంచైజీల నుంచి భారీగా కాంట్రాక్టు ఇస్తామంటూ ఆఫర్లు వస్తున్న సంజు సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాడు. నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయని వేరే ఫ్రాంచైజీలకు వెళ్లే ప్రసక్తేలేదని, తన వరకూ జైపూర్ ఫ్రాంచైజీని పటిష్టంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని ప్రకటించాడు.
జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్ లాంటి ప్రపంచ మేటి క్రికెటర్లు రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యులుగా ఉండేలా చేయటంలో సంజు చురుకైన పాత్ర పోషించాడు.
2021 సీజన్లో తనజట్టును ఐపీఎల్ ఫైనల్స్ చేర్చడంతో పాటు..రన్నరప్ గా నిలపడంలో కెప్టెన్ గా సంజు శాంసన్ తనవంతు పాత్ర పోషించాడు. వేరే ఫ్రాంచైజీల నుంచి భారీఆఫర్లు వస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళటం లేదంటూ తాను సంజూను ప్రశ్నించానని, తనకు రాజస్థాన్ ఫ్రాంచైజీనే ప్రధానమని సంజు చెబుతూ వచ్చాడన్న విషయాన్ని రాయల్స్ ట్రైనర్ రాజమణి ప్రభు గుర్తు చేసుకొన్నారు.
తన ప్రాంచైజీ పట్ల ప్రేమ, విశ్వాసం, కృతజ్ఞత సంజులో చాలా ఎక్కువని, డబ్బుకు కక్కుర్తిపడే తత్వం సంజూ లేనేలేదని రాజమణి ప్రభు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
సంజు శాంసన్ దొడ్డమనసు...
ఐపీఎల్ లో కోట్ల రూపాయలు ఆర్జించే క్రికెటర్లో దేశంలో ఎందరో ఉన్నారు. అయితే..తనకంటే దిగువన ఉన్న ప్రతిభావంతులైన క్రికెటర్ల కోసం సీజన్ కు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసే గొప్పమనసున్న క్రికెటర్ సంజు శాంసన్ మాత్రమే.
ఐపీఎల్ కాంట్రాక్టుకింద ఏడాదికి 15 కోట్ల రూపాయలు వేతనంగా అందుకొంటున్న సంజు శాంసన్..ఆ మొత్తంలో కోటి రూపాయలను దేశవాళీ క్రికెటర్ల కోసం ఖర్చు చేస్తున్నాడు. అంతేకాదు..మరో కోటిరూపాయల మొత్తాన్నిప్రతిభావంతులైన బాలల కోసం వ్యయం చేస్తున్నాడు.
సాటి క్రికెటర్ల కోసం ఏడాదికి 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసే మరో ఆటగాడు ఎవరైనా ఉన్నారా? అని రాజస్థాన్ రాయల్స్ ట్రైనర్ రాజమణి ప్రభు ప్రశ్నిస్తున్నారు.
కేరళ నుంచి భారత క్రికెట్లోకి..
28 సంవత్సరాల సంజు శాంసన్ కు 2014 అండర్ -19 ప్రపంచకప్ లో భారతజట్టుకు వైస్ కెప్టెన్ గా ఆడిన ఘనత ఉంది. 2021 సీజన్లో శ్రీలంక ప్రత్యర్థిగా భారత్ తరపున తన తొలివన్డే ఆడిన సంజు..2015లోనే జింబాబ్వే ప్రత్యర్థిగా టీ-20 అరంగేట్రం చేశాడు.
భారత్ తరపున ఇప్పటి వరకూ 11 వన్డేలు, 16 టీ-20 మ్యాచ్ లు ఆడిన సంజు శాంసన్ కు..138 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 3వేల 526 పరుగులు సాధించిన రికార్డు ఉంది. ఐపీఎల్ లో ఇప్పటికే మూడు శతకాలు బాదిన మొనగాళ్లలో సంజు కూడా ఉన్నాడు.
2013 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తో తన ఐపీఎల్ కెరియర్ ప్రారంభించిన సంజు..2016, 17 సీజన్లలో మాత్రం ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడాడు. తిరిగి 2018 సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ కే ఆడుతూ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు.
సంజు సారథిగా రాజస్థాన్ రాయల్స్ 2021 సీజన్ ఫైనల్స్ చేరడంతో పాటు రన్నరప్ ట్రోఫీని సైతం సొంతం చేసుకోగలిగింది. దేశవ్యాప్తంగా అభిమానులున్న సంజు నిలకడగా రాణించడం ద్వారా భారతజట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోగలిగితే తనలోని అపారప్రతిభకు తగిన న్యాయం చేసుకొన్నవాడవుతాడు.