Telugu Global
Sports

రోజుకో మలుపు తిరుగుతున్న కుస్తీ రాజకీయం!

క్రీడలకూ రాజకీయాలకు సంబంధమే లేదు. అయితే..భారత కుస్తీ సమాఖ్యను రాజకీయనాయకులు తమ గుప్పిట్లో ఉంచుకొని రోజుకో నాటకం ఆడుతూ కుస్తీ క్రీడనే ఓ పట్టుపడుతున్నారు.

రోజుకో మలుపు తిరుగుతున్న కుస్తీ రాజకీయం!
X

క్రీడలకూ రాజకీయాలకు సంబంధమే లేదు. అయితే..భారత కుస్తీ సమాఖ్యను రాజకీయనాయకులు తమ గుప్పిట్లో ఉంచుకొని రోజుకో నాటకం ఆడుతూ కుస్తీ క్రీడనే ఓ పట్టుపడుతున్నారు.

అంతర్జాతీయ క్రీడల్లో దేశానికి ఎన్నో పతకాలు, ఎనలేని గౌరవం సంపాదించి పెట్టిన భారత కుస్తీ సమాఖ్య పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారయ్యింది.

క్రీడలతో ఏమాత్రం సంబంధంలేని రాజకీయనాయకుల చెరలో కుస్తీ సమాఖ్య విలవిల లాడిపోతోంది.

సీనియర్ వస్తాదులకు జూనియర్ల కుంపటి...

భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా గత పుష్కరకాలంగా చక్రం తిప్పిన బీజెపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. తన ఇంటినే కుస్తీ సమాఖ్య ప్రధాన కేంద్రంగా చేసుకొని కొద్దిరోజుల క్రితం వరకూ అరాచకం సృష్టించిన బ్రిజ్ భూషణ్ అధికారపార్టీ అండదండలతో కుస్తీ క్రీడనే బజారున పడేశారు.ఏడుగురు భారత మహిళా వస్తాదులను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు బ్రిజ్ భూషణ్, ఆయన అనుచరులు తీవ్రఆరోపణలు ఎదుర్కొంటూ ఇంకా తమ దౌర్జన్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

తమపై జరుగుతున్న వేధింపులకు నిరసనగా మొత్తం 30 మంది సీనియర్ వస్తాదులు గత కొద్దిమాసాల క్రితమే బ్రిజ్ భూషణ్ పై తిరుగుబాటు చేయటంతో..భారత ఒలింపిక్ సంఘం నియమించిన విచారణ సంఘం తూతూమంత్రంగా తన పని ముగించింది. దీంతో మహిళా వస్తాదులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ తొత్తు...

తీవ్రఒత్తిడి నడుమ కుస్తీ సమాఖ్య నుంచి తాను తప్పుకొంటున్నట్లు, ఇక నుంచి తనకూ..కుస్తీ సమాఖ్యకు ఏవిధమైన సంబంధం ఉండబోదని ప్రకటించిన బ్రిజ్ భూషణ్ ..కార్యవర్గ ఎన్నికల్లో తనకు తొత్తులాంటి సంజయ్ సింగ్ ను పోటీకి నిలిపి 40-7 ఓట్ల తేడాతో గెలిపించుకోడం, భారతకుస్తీ సమాఖ్య వ్యవహారాలను తన ఇంటినుంచే నడిపించడం మరో వివాదానికి కారణమయ్యింది.

బ్రిజ్ భూషణ్ జేబుబొమ్మ సంజయ్ సింగ్ ఎన్నికకు నిరసనగా అంతర్జాతీయ రెజ్లర్ సాక్షీమాలిక్..తాను కుస్తీ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించింది. మరో రెజ్లర్ వినేశ్ పోగట్ తన అర్జున, ఖేల్ రత్న పురస్కారాలను, భజరంగ్ పూనియా తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండడంతో..సంజయ్ సింగ్ నేతృత్వంలోని కుస్తీ సమాఖ్యపై భారత క్రీడామంత్రిత్వశాఖ సస్పెన్షన్ విధించి ఓ అడహాక్ కమిటీ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

సంజయ్ సింగ్ ధిక్కార స్వరం..

నిబంధనలకు అనుగుణంగా ఎన్నికైన తన కార్యవర్గాన్ని సస్పెండ్ చేయటాన్ని ఆమోదించేదే లేదంటూ కుస్తీ సమాఖ్య కీలుబొమ్మ అధ్యక్షుడు సంజయ్ సింగ్ ధిక్కారస్వరం వినిపించారు. తమ కార్యవర్గమే త్వరలో జాతీయ కుస్తీ పోటీలు నిర్వహిస్తుందంటూ ప్రకటించి మరో వివాదం సృష్టించారు. అంతేకాదు..

తమపై తిరుగుబాటు చేసిన సీనియర్ వస్తాదులకు వ్యతిరేకంగా జూనియర్ వస్తాదులను ఎగదోశారు.

సాక్షి మాలిక్, వినేశ్ పోగట్, భజరంగ్ పూనియాలకు వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూనియర్ వస్తాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

సీనియర్ వస్తాదుల కారణంగా తమకు అన్యాయం జరుగుతోందంటూ జూనియర్లు గళం విప్పారు. అయితే..ఇదంతా బ్రిజ్ భూషణ్, ఆయన తొత్తు సంజయ్ సింగ్ ఆడిస్తున్న నాటకం అంటూ సాక్షి మాలిక్ ఆందోళన వ్యక్తం చేసింది.

ఏడాదికాలంగా వేధన...

ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల్లో దేశానికి పతకాలు సాధించి పెట్టిన తాము గత ఏడాది కాలంగా మానసికంగా అంతులేని వేధన అనుభవిస్తున్నామని, లైంగిక వేధింపులకు గురైన తమ బాధను ఎవరు తీరుస్తారని సాక్షీ మాలిక్ ప్రశ్నించింది. సోషల్ మీడియాలో తమను విమర్శించేవారి ఇంట్లో అక్కాచెల్లెళ్లు లేరా అంటూ నిలదీసింది.

ప్రభుత్వం తమకు తల్లితండ్రి లాంటిదని, తమకు జరిగిన అన్యాయాన్ని రానున్నతరాలకు జరుగకుండా తగిన చర్యలు ప్రభుత్వమే తీసుకోవాలని కోరింది.

తన జీవితంలో రెండు దశాబ్దాల కాలాన్ని కుస్తీ క్రీడ కోసం అంకితం చేశానని, చివరకు తనకు లైంగిక వేధింపులు మిగిలాయని వాపోయింది.

చేసేది ఏమీలేక అభంశుభం తెలియని జూనియర్ వస్తాదులను భయపెట్టి, ఆశపెట్టి తమపైకే ఎగదోశారని ఆరోపించింది.

2016 రియో ఒలింపిక్స్ లో భారత్ కు కాంస్య పతకం సాధించి పెట్టిన సాక్షీ మాలిక్ ..కామన్వెల్త్ గే్మ్స్ లో బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే.

అడహాక్ కమిటీ ఆధ్వర్యంలో జూనియర్ కుస్తీ పోటీలు...

భారత కుస్తీ సమాఖ్యకు ఎన్నికైన కార్యవర్గంపై సస్పెన్షన్ విధించడంతో ఏర్పాటైన అడహాక్ కమిటీ ఆధ్వర్యంలో 2024 జూనియర్, సబ్ - జూనియర్ కుస్తీ పోటీలు నిర్వహించడానికి రంగం సిద్ధమయ్యింది.

భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన అడహాక్ కమిటీని రద్దు చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద జూనియర్ వస్తాదుల బృందం నిరసన ప్రదర్శన నిర్వహించిన కొద్దిగంటల్లోనే జాతీయ అండర్ -15, అండర్ -20 కుస్తీ పోటీలను నిర్వహించనున్నట్లు అడహాక్ కమిటీ ప్రకటించింది.

కుస్తీ సమాఖ్యలో గొడవల కారణంగా తమ భవిష్యత్ నాశనమైపోతోందని, ఇప్పటికే విలువైన ఏడాదికాలం నష్టపోయామంటూ జూనియర్ వస్తాదులు వాపోతున్నారు.

రాజకీయనాయకులు అడుగుపెడితే ఏదైనా సర్వనాశనం కాక తప్పదనటానికి జాతీయ కుస్తీ సమాఖ్యే తాజా నిదర్శనం.

First Published:  4 Jan 2024 10:58 AM IST
Next Story