Telugu Global
Sports

పారిస్ లో నేటినుంచే విశ్వక్రీడాసంరంభం!

ప్రపంచ క్రీడల పండుగ ఒలింపిక్స్ కు పారిస్ నగరంలో రంగం సిద్ధమయ్యింది. భారత్ తో సహా 204 దేశాలకు చెందిన 10500మంది క్రీడాకారులు 329 స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు.

పారిస్ లో నేటినుంచే విశ్వక్రీడాసంరంభం!
X

ప్రపంచ క్రీడల పండుగ ఒలింపిక్స్ కు పారిస్ నగరంలో రంగం సిద్ధమయ్యింది. భారత్ తో సహా 204 దేశాలకు చెందిన 10500మంది క్రీడాకారులు 329 స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు.

క్రీడలు స్నేహవారథులు. భిన్నజాతులు, మతాలతో కూడిన 204 దేశాలకు చెందిన క్రీడాకారులను ఏకతాటిమీదకు తీసుకువచ్చే విశ్వక్రీడల పండుగ ఒలింపిక్స్ కు పారిస్ నగరం సకల హంగులతో ముస్తాబయ్యింది. ఈరోజు నుంచి ఆగస్టు 11 వరకూ ఈ క్రీడాపండుగ సరికొత్త రికార్డులతో మార్మోగనుంది.

1896 ఏథెన్స్ గేమ్స్ నుంచి నాలుగేళ్లకోమారు ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ పరంపర ఆటుపోట్లు ఎదురైనా గత 11 దశాబ్దాలుగా అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది.

ఈ భూఖండంలోని 204 దేశాలకు చెందిన క్రీడాకారులు మాత్రమే కాదు..ప్రపంచ వ్యాప్తంగా వందలకోట్ల మంది క్రీడాభిమానులు ఈ ఒలింపిక్స్ పండుగ కోసం ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

పారిస్ వేదికగా మూడోసారి....

ప్రపంచంలోనే 'షోకులనగరంగా' పేరుపొందిన ఫ్లాన్స్ రాజధాని పారిస్ వేదికగా మూడోసారి ఒలింపిక్స్ కు తెరలేవనుంది. 1900, 1924 సంవత్సరాల ఒలింపిక్స్ కు వేదికగా నిలిచిన పారిస్ శతాబ్దకాలం సుదీర్ఘ విరామం తరువాత మరోసారి ఆతిథ్యమిస్తోంది.

జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ రెండువారాలపాటు సాగే ఈ ఒలింపిక్స్ లో భాగంగా మొత్తం 32 క్రీడాంశాలలోని 329 స్వర్ణపతకాల కోసం వివిధ దేశాలకు చెందిన పదివేల 500 మంది అథ్లెట్లు పోటీపడబోతున్నారు.

కొత్తగా నాలుగు క్రీడలకు అవకాశం...

ఒలింపిక్స్ కు ఒలింపిక్స్ కూ క్రీడాంశాలలో మార్పులు చేర్పులు పరిపాటిగా వస్తోంది. తనకు నచ్చిన మూడు లేదా నాలుగు క్రీడల్ని ఒలింపిక్స్ లో భాగంగా నిర్వహించుకొనే వెసలుబాటు ఆతిథ్య దేశానికి ఉంటుంది.

పారిస్ ఒలింపిక్స్ లో తొలిసారిగా బ్రేక్ డాన్సింగ్ క్రీడను పతకం అంశంగా ప్రవేశపెట్టారు. టోక్యో ఒలింపిక్స్ లో నిర్వహించిన కరాటే, సాఫ్ట్ బాల్, బేస్ బాల్ అంశాలకు పారిస్ ఒలింపిక్స్ క్రీడాంశాలలో చోటు దక్కలేదు.

స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లయింబింగ్, సర్ఫింగ్ క్రీడలకు పారిస్ ఒలింపిక్స్ ప్రధాన క్రీడల జాబితాలో చోటు దక్కింది. 2018 యూత్ ఒలింపిక్స్ లో తొలిసారిగా నిర్వహించిన డ్యాన్సింగ్ కమ్ బ్రేక్ డ్యాన్సింగ్ క్రీడను వేసవి ఒలింపిక్స్ లోనూ తొలిసారిగా పతకం అంశంగా నిర్వహిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ లోని నాలుగు అంశాలను తొలగించి..కనోయింగ్ విభాగంలో రెండు అంశాలను అదనంగా చేర్చారు.

ట్రాక్ అండ్ ఫీల్డ్, ఫీల్డ్ హాకీ, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, వాలీబాల్, టెన్నిస్, జిమ్నాస్టిక్స్, విలువిద్య, కుస్తీ, బాక్సింగ్,రగ్బీ సెవెన్స్, హ్యాండ్ బాల్, వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, ఈతలాంటి ప్రధాన క్రీడలతో పాటు ప్రస్తుత ఒలింపిక్స్ లో సరికొత్తగా బ్రేకింగ్, స్కేట్ బోర్డింగ్, స్పోర్‌ క్లయింబింగ్, సర్ఫింగ్ క్రీడల్ని సైతం నిర్వహించబోతున్నారు.

ఈ క్రీడల నిర్వహణ కోసం పారిస్ నగరం చుట్టుపక్కల పలు అత్యాధునిక క్రీడావేదికలను నిర్వాహక సంఘం సిద్ధం చేసింది. ప్రారంభవేడుకల నుంచి ముగింపు వేడుకల వరకూ వివిధ దేశాల నుంచి వచ్చే అథ్లెట్లు, అధికారులు, ప్రముఖుల కోసం ఫ్రెంచ్ ఒలింపిక్స్ సమాఖ్య కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

తొలిసారిగా స్టేడియం వెలుపల ప్రారంభవేడుకలు...

2024 పారిస్ ఒలింపిక్స్ ను వినూత్నంగా నిర్వహించాలని నిర్వాహక సంఘం నిర్ణయించింది. గత శతాబ్దకాలంగా వస్తున్న స్టేడియాలలోనే నిర్వహించే ప్రారంభ వేడుకల సాంప్రదాయాన్ని తప్పించి.. తొలిసారిగా స్టేడియం వెలుపల నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు.

ప్రారంభవేడుకలను స్టేడియంలో కాకుండా ఫ్రెంచ్ రాజధాని శివారులో ఉన్న సీన్ నది తీరంలో నిర్వహించడానికి భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. సీన్ నదిలో 6 కిలోమీటర్ల దూరం పడవల పరేడ్ తో ప్రారంభవేడుకలు నిర్వహించనున్నారు. ప్రారంభవేడుకలకు కేవలం 3 లక్షల 25వేల మందిని మాత్రమే అనుమతించనున్నారు.

ప్రారంభవేడుకల కవాతులో పాల్గొనే ఒక్కోజట్టుకు ఒక్కో బోటును కేటాయించారు. బోట్ల కవాతు సీన్ నదీ తీరంలోని ఆస్టర్ లిడ్ వంతెన వద్ద మొదలై..రెండు ద్వీపాలను చుట్టి వచ్చి..ట్రోకాడెరోలో ముగియనుంది.

మొత్తం 45వేల మంది పోలీసులు, మిలిటరీ సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొంటారని ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది.

ఇజ్రాయిల్- హమస్, ఇరాన్- ఇజ్రాయిల్ దేశాల నడుమ జరుగుతున్న పోరు ప్రభావం సైతం ఒలింపిక్స్ పైన పడే అవకాశం లేకపోలేదు. రష్యా- ఉక్రెయిన్ ల యుద్ధం కారణంగా రష్యా అథ్లెట్లు పాల్గొనటంపై ఆంక్షలు విధించారు.

రష్యా అథ్లెట్లు తమ దేశానికి కాకుండా వ్యక్తిగత హోదాలో లేదా..తటస్థ పతాకం కింద పాల్గొనవచ్చునని నిర్వాహక సంఘం ప్రకటించింది. పతకాల వేటలో పోటీ ప్రధానంగా అమెరికా, చైనాల నడుమే జరుగనుంది.

భద్రతా కారణాల దృష్ట్యా ప్రారంభ వేడుకలను సెయింట్ డెన్నిస్ లోని స్టేడియం ఫ్రాన్స్ లో కాకుండా సీన్ నదీతీరంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించారు. ప్రారంభ వేడుకలకు ముందే ఫుట్ బాల్, రగ్బీ సెవెన్స్, హ్యాండ్ బాల్, ఆర్చరీ పోటీలకు తరలేవనుంది.

32 క్రీడల్లో 329 పతకాలకు పోటీ....

పారిస్ ఒలింపిక్స్ ను 16 రోజులపాటు..32 రకాల క్రీడల్లో 329 పతకాల కోసం 10వేల మంది అథ్లెట్లు పోటీపడనున్నారు.పారిస్ చుట్టు పక్కల ఉన్న మొత్తం 35 వేదికల్లో పోటీలు నిర్వహిస్తారు.

పారిస్ లోని ఐఫిల్ టవర్ చెంతనే ఏర్పాటు చేసిన తాత్కాలిక వేదికలో బీచ్ బాలీబాల్ పోటీలను, పాలెస్ ఆఫ్ వెర్సెలో వేదికగా అశ్వక్రీడలు, మోడర్న్ పెంటాథ్లాన్ పోటీలను, 124 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రాండ్ పాలెస్ వేదికగా ఫెన్సింగ్ టైక్వాండో పోటీలను నిర్వహించనున్నారు.

1924 పారిస్ ఒలింపిక్స్ ప్రారంభవేడుకలకు వేదికగా నిలిచిన 117 సంవత్సరాల యువ్స్ డు మాన్యోర్ స్టేడియం వేదికగా ఫీల్డ్ హాకీ పోటీలు నిర్వహిస్తారు.

క్రీడల ప్రధాన స్టేడియం వేదికగా ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలతో పాటు ముగింపు వేడుకలు జరుగుతాయి.

రోలాండ్ గారోస్ వేదికగా టెన్నిస్ తో పాటు బాక్సింగ్ పోటీలను, పార్క్ డెస్ ప్రిన్సెస్ వేదికగా ఫుట్ బాల్ మ్యాచ్ లను నిర్వహిస్తారు.

తాహితీ ద్వీపాల వేదికగా సర్ఫింగ్ పోటీలు...

ఫ్రెంచ్ పాలిత పోలినీసియన్ ద్వీపం తాహితీ వేదికగా సర్ఫింగ్ పోటీలను తొలిసారిగా నిర్వహించబోతున్నారు. ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధం చేసిన వేదికల్లో 95 శాతం ఇప్పటికే ఉన్నవి లేదా తాత్కాలికంగా ఏర్పాటు చేసినవే కావడం విశేషం.

'బంగారు' ఆశలతో భారత్....

1904 ఒలింపిక్స్ లో తొలిసారిగా పాల్గొన్న భారత్ ప్రస్తుత 2024 ఒలింపిక్స్ లో పాల్గొనడం ద్వారా 124 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోనుంది.

టోక్యో వేదికగా ముగిసిన గత ఒలింపిక్స్ పతకాల పట్టిక 48వ స్థానంలో నిలిచిన భారత్..ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మెరుగైన ఫలితాలు సాధించాలన్న పట్టుదలతో ఉంది. పురుషుల జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకం, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహెయిన్, పీవీ సింధు, రవికుమార్ దహియా, బజరంగ్ పూనియా,నీరజ్ చోప్రా వ్యక్తిగత విభాగాలలో పతకాలు తెస్తే..పురుషుల హాకీలో భారత్ కాంస్య పతకం గెలుచుకోడం ద్వారా సంచలనం సృష్టించింది.

నీరజ్ చోప్రా సాధించిన బంగారు పతకం పుణ్యమా అని భారత్ గత నాలుగు దశాబ్దాల ఒలింపిక్స్ పతకాల పట్టిక చరిత్రలో అత్యుత్తమంగా 48వ స్థానం సంపాదించగలిగింది.

1900 నుంచే భారత్ ప్రస్థానం...

విశ్వమానవాళి నడుమ స్నేహసౌభ్రాతృత్వాలను పాదుకొల్పడం కోసమే 18వ శతాబ్దంలోనే ఒలింపిక్స్ ఉద్యమం ప్రారంభమయ్యింది.అందులో భారత్ కు సైతం ఓ ప్రత్యేక స్థానమే ఉంది.

జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ కు 1947లో స్వాతంత్రం వచ్చినా...1900 సంవత్సరం నుంచే ఒలింపిక్స్ లో పాల్గొంటూ వస్తోంది.

బ్రిటీష్ వలసపాలిత దేశంగా ఉన్న భారత్ కు చెందిన ఒకేఒక్క అథ్లెట్ నార్మన్ ప్రిట్ చర్డ్ పారిస్ వేదికగా జరిగిన 1900 ఒలింపిక్స్ లో పాల్గొని ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో రెండు రజత పతకాలు సాధించడంతో పతకాల వేటకు తెరలేచింది.

అయితే...భారత్ కు స్వాతంత్ర్యం రాక ముందే...1927లో భారత ఒలింపిక్స్ సంఘం ఆవిర్భవించింది. అంతర్జాతీయ ఒలింపిక్స్ సమాఖ్యకు అనుబంధంగా ఉంటూ..

భారత్ లో క్రీడారంగ అభివృద్ధితో పాటు ఒలింపిక్స్ ఉద్యమం పటిష్టత కోసం పాటుపడుతూ వస్తోంది.

సర్ దొరాబ్ టాటా అధ్యక్షుడుగా భారత ఒలింపిక్స్ సంఘం ఏర్పాటయ్యింది. దేశంలోని వివిధ రాష్ట్ర్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రక్షణ దళాలకు చెందిన మొత్తం 35ఒలింపిక్స్ సంఘాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.

మొత్తం 28 రకాల క్రీడలకు చెందిన క్రీడాసంఘాలు అనుబంధంగా ఉంటూ వస్తున్నాయి. కేంద్రప్రభుత్వం, క్రీడామంత్రిత్వశాఖ తోడ్పాటుతో భారత ఒలింపిక్స్ సంఘం..

వివిధ క్రీడాసంఘాలకు గ్రాంట్ల ద్వారా నిధులు అందచేస్తూ క్రీడాభివృద్ధికి పాటుపడుతోంది.

1951 లో ఆసియా క్రీడలకు తొలిసారిగా ఆతిథ్యమిచ్చిన ఘనత భారత ఒలింపిక్స్ సంఘానికి మాత్రమే దక్కుతుంది. 1987లో దక్షిణాసియా దేశాల సమాఖ్య క్రీడలు, 2003లో ఆఫ్రో-ఆసియా క్రీడలు, 2010లో కామన్వెల్త్ క్రీడలు నిర్వహించిన అనుభవం భారత ఒలింపిక్స్ సంఘానికి ఉంది.

12 దశాబ్దాలు...35 పతకాలు

1900 పారిస్ ఒలింపిక్స్ నుంచి 2020 టోక్యో ఒలింపిక్స్ వరకూ క్రమం తప్పకుండా ప్రపంచ క్రీడోత్సవాలలో భారత బృందాలు పాల్గొంటూ వస్తున్నా...పతకాల సాధనలో మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాయి.

ఒలింపిక్స్ లో గత 124 సంవత్సరాలుగా భారత్ సాధించిన మొత్తం పతకాలు కేవలం 35మాత్రమే.ఇందులో పది మాత్రమే బంగారు పతకాలు.మొత్తం స్వర్ణాలలో హాకీజట్టు అందించినవే ఎనిమిది ఉన్నాయి.

1928 నుంచి 1956 ఒలింపిక్స్ వరకూ హాకీలో వరుసగా ఆరు బంగారు పతకాలు సాధించిన ప్రపంచ రికార్డు భారత్ కు మాత్రమే సొంతం. వ్యక్తిగతంగా బంగారు పతకం సాధించిన భారత తొలి క్రీడాకారుడి ఘనత షూటర్ అభినవ్ భింద్రాకు దక్కుతుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో అభినవ్ భారత్ కు బంగారు పతకం అందించాడు.

2020 టోక్యో ఒలింపిక్స్ పురుషుల జావలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా స్వర్ణ విజేతగా నిలిచాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ లో బంగారు పతకం సాధించిన తొలి క్రీడాకారుడి ఘనతను నీరజ్ సొంతం చేసుకొన్నాడు.

రజత పతకాలు సాధించిన భారత క్రీడాకారులలో నార్మన్ ప్రిట్ చార్డ్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, సుశీల్ కుమార్, విజయ్ కుమార్, పీవీ సింధు,మీరాబాయి చాను మాత్రమే ఉన్నారు. వివిధ క్రీడలకు చెందిన అథ్లెట్లు మిగిలిన 18 కాంస్య పతకాలు అందించారు.

తెలుగు తేజాలు మల్లీశ్వరి, సింధు...

ఒలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి తెలుగు మహిళగా కరణం మల్లీశ్వరి చరిత్ర సృష్టిస్తే...రజతంతో సహా రెండు పతకాలు సాధించిన భారత తొలి మహిళగా పీవీ సింధు రికార్డుల్లో చేరింది.

బాక్సర్ మేరీకోమ్, వస్తాదు సాక్షీ మాలిక్, బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ లు సైతం కాంస్య పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2020 ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో సైతం సింధు కాంస్య పతకం గెలుచుకోగలిగింది.

ఒలింపిక్స్ పతకాల పట్టిక మొదటి 50 స్థానాలలో నిలవటమే భారత్ కు గగనమైపోతోంది.

ఒలింపిక్స్ నజారానా మరింత భారీగా....

టోక్యో వేదికగా ముగిసిన గత ఒలింపిక్స్ లో 126 మంది అథ్లెట్ల బృందంతో 18 క్రీడాంశాలలో మాత్రమే పోటీకి దిగిన భారత్ తరపున ప్రస్తుత ఒలింపిక్స్ లో 123 మంది అథ్లెట్ల బృందంతో బరిలో నిలువబోతోంది.

ఒలింపిక్స్ పతక విజేతలకు గతంలో కంటే మరింత ఎక్కువ నగదు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు భారత ఒలింపిక్స్ సంఘం ప్రకటించింది. బంగారు పతకం నెగ్గిన విజేతలకు కోటి రూపాయలు, రజత పతకం సాధించిన వారికి 50 లక్షల రూపాయలు, కాంస్య విజేతలకు 30 లక్షల రూపాయల చొప్పున అందచేయనున్నారు.

2018 ఆసియాక్రీడల నుంచే భారత ఒలింపిక్స్ సంఘం పతక విజేతలుగా నగదు ప్రోత్సాహక బహుమతులు అందచేస్తూ వస్తోంది.

ఆసియాక్రీడల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించినవారికి 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల రూపాయల చొప్పున ఇస్తూ వస్తున్నారు.

75 లక్షల నుంచి కోటి రూపాయలు...

2021 టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలకు భారత ఒలింపిక్స్ సంఘం 75 లక్షలు, 45 లక్షలు, 25 లక్షల రూపాయల చొప్పున అందచేసింది. ఆ మొత్తాన్ని ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ నాటికి దాదాపుగా రెట్టింపు చేసింది.

2024 ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు తొలిసారిగా రెండంకెల సంఖ్యలో పతకాలు సాధించే అవకాశం ఉందని, పతకవిజేతలకు నజరానాగా 7 కోట్ల రూపాయలు కేటాయించినట్లు..భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష ప్రకటించారు.

హాకీజట్టుకు 2 కోట్ల నజరానా...

టీమ్ విభాగంలో బంగారు పతకం సాధించిన భారత హాకీజట్టు సభ్యులు..స్వర్ణం సాధిస్తే 2 కోట్ల రూపాయలు నగదు బహుమతిగా అందచేయనున్నారు. రజత పతకం సాధిస్తే కోటి రూపాయలు, కాంస్యం నెగ్గితే 75 లక్షల రూపాయలు చెల్లించనున్నారు.

ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అథ్లెట్లకు 42 లక్షల ( 50 వేల డాలర్లు ) రూపాయలు చొప్పున ఇస్తామని ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించింది.

ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లకు రోజుకు 50 డాలర్లు చొప్పున దినసరి భత్యంగా అందచేయాలని భారత ఒలింపిక్స్ సంఘం నిర్ణయించింది. మొత్తం 195 మంది సభ్యుల కోసం అలవెన్సులను సిద్ధం చేసింది.

అథ్లెట్లకు 2 లక్షల రూపాయల నగదు మొత్తాన్ని, కోచింగ్ స్టాఫ్ కు లక్ష రూపాయల చొప్పున గ్రాంట్ ను తొలిసారిగా అందచేసింది. నలుగురు సభ్యుల గోల్ఫ్ బృందానికి అవసరమైన గోల్ఫ్ బ్యాగుల కోసం 4 లక్షల 40వేల రూపాయలు కేటాయించింది. అశ్వక్రీడల కోసం ప్రత్యేకంగా 9 లక్షల రూపాయలు అందుబాటులో ఉంచింది.

స్వర్ణ విజేతలకు 50 వేల డాలర్లు...

ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలోని మొత్తం 45 అంశాలలో బంగారు పతకాలు సాధించిన అథ్లెట్లకు 50వేల డాలర్లు చొప్పున మొత్తం 2.4 మిలియన్ డాలర్లు నజరానాగా ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం సీఈవో సెబాస్టియన్ కో ప్రకటించారు. గత శతాబ్దకాలంలో మూడోసారి ఫ్రెంచ్ గడ్డపైన జరుగబోయే ఈ విశ్వక్రీడాసంరంభం జులై 26న మొదలై ఆగస్టు 11న ముగియనుంది.

టోక్యో ఒలింపిక్స్ ను మించి ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో భారత్ మెరుగైన ఫలితాలు సాధించాలని కోరుకొందాం.

First Published:  26 July 2024 11:30 AM IST
Next Story