Telugu Global
Sports

చెత్తఫీల్డింగ్ తో వన్డే సిరీస్ ల్లో తేలిపోతున్న భారత మహిళాజట్టు!

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో సంచలన విజయాలు సాధిస్తున్న భారత మహిళాజట్టు వన్డే సిరీస్ ల్లో మాత్రం తేలిపోతోంది. వరుసగా రెండో సిరీస్ లో విఫలమయ్యింది.

చెత్తఫీల్డింగ్ తో వన్డే సిరీస్ ల్లో తేలిపోతున్న భారత మహిళాజట్టు!
X

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో సంచలన విజయాలు సాధిస్తున్న భారత మహిళాజట్టు వన్డే సిరీస్ ల్లో మాత్రం తేలిపోతోంది. వరుసగా రెండో సిరీస్ లో విఫలమయ్యింది.

భారత మహిళా క్రికెట్ ను మిశ్రమ ఫలితాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాంప్రదాయ టెస్టు మ్యాచ్ ల్లో ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా లాంటి మేటిజట్లపై సంచలన విజయాలతో చెలరేగిన భారతజట్టు..వన్డే సిరీస్ ల్లో మాత్రం తేలిపోయింది.

గత మూడువారాలలో వరుసగా రెండోసిరీస్ ఓటమిని చవిచూసింది. ఇంగ్లండ్ పై టెస్టు మ్యాచ్ నెగ్గి మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను 1-2తో చేజార్చుకొన్న భారతజట్టు..ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియా పైనా అదే ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది.

3 పరుగులతో జారిన విజయం...

ఆస్ట్ర్రేలియాపై టెస్ట్ మ్యాచ్ నెగ్గిన హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు..మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ మొదటి రెండుమ్యాచ్ ల్లో పరాజయాలు పొందడం ద్వారా సిరీస్ చేజార్చుకొంది.

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ లోని రెండోవన్డేలో నెగ్గితీరాల్సిన భారత్ చెత్త ఫీల్డింగ్ తో 3 పరుగుల పరాజయం పాలయ్యింది.

తొలివన్డేలో 6 వికెట్లతో ఓడిన భారత్ ..నెగ్గితీరాల్సిన రెండోవన్డేలో 258 పరుగుల స్కోరుకు కట్టడి చేయగలిగింది.

చెత్త ఫీల్డింగ్ తో కోరి కష్టాలు...

భారత ఫీల్డర్లు మొత్తం 7 క్యాచ్ లు విడిచి పెట్టడంతో అందివచ్చిన అవకాశాలను కంగారూ బ్యాటర్లు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలిగారు. వైస్ కెప్టెన్ స్మృతి మందన, ఆల్ రౌండర్ దీప్తి శర్మ లాంటి సీనియర్లు సైతం క్యాచ్ లు జారవిడిచారు.

ఆస్ట్ర్రేలియా ఓపెనర్ లిచ్ ఫీల్డ్ 63,వన్ డౌన్ ఎల్పీ పెర్రీ 50, తాహిలా మెక్ గ్రాత్ 24, సదర్లాండ్ 22, వార్హామ్ 28 పరుగులు సాధించారు. భారత బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ 10 ఓవర్లలో 38 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఆస్ట్ర్రేలియాపై వన్డే క్రికెట్లో 5 వికెట్టు పడగొట్టిన భారత తొలి మహిళా బౌలర్ గా రికార్డుల్లో చేరింది. పూజా వస్త్రకర్, శ్రేయాంక పాటిల్, స్నేహ రాణా తలో వికెట్ పడగొట్టారు.

రిచా ఘోశ్ పోరాడినా....

మ్యాచ్ నెగ్గడం ద్వారా 1-1తో సిరీస్ ను సమం చేయాలంటే నెగ్గితీరాల్సిన ఈమ్యాచ్ లో 259 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ ఒకదశలో 4 వికెట్లకు 218 పరుగుల స్కోరుతో పటిష్టమైన స్థితిలో నిలిచింది.

ఓపెనర్ స్మృతి మందన 34, రెండోడౌన్ జెమీమా రోడ్రిగేజ్ 44 , కెప్టెన్ హర్మన్ ప్రీత్ 5 పరుగుల స్కోర్లకే అవుటైనా..వన్ డౌన్లో బ్యాటింగ్ కు దిగిన రిచా ఘోశ్ ఒంటరిపోరాటమే చేసింది. 117 బంతుల్లోనే 13 బౌండ్రీలతో 96 పరుగుల స్కోరు సాధించి..సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో అవుట్ కావడంతో భారత్ పతనం ప్రారంభమయ్యింది. ఆట 44వ ఓవర్ ముగిసే సమయానికే 8 టాపార్డర్ వికెట్లు నష్టపోయింది. దీనికితోడు..ఆల్ రౌండర్ దీప్తి శర్మ 36 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క బౌండ్రీతో 24 పరుగుల స్కోరు మాత్రమే సాధించడం భారత్ ను దెబ్బతీసింది. వేగంగా పరుగులు సాధించడంలో దీప్తి విఫలమయ్యింది.

చివరకు భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 255 పరుగులు మాత్రమే చేయగలిగింది.కంగారూ బౌలర్లలో జార్జియా వెర్హామ్ 2 వికెట్లు, సూదర్లాండ్ 3 వికెట్లు పడగొట్టారు.

96 పరుగుల స్కోరుతో ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా ఐదవ అత్యుత్తమ స్కోరు సాధించిన మహిళా బ్యాటర్ గా రిచా రికార్డుల్లో చేరింది.

3 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా ఆస్ట్ర్రేలియా సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికే 2-0తో సిరీస్ ను సొంతం చేసుకోగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్ అన్నాబెల్ సూదర్లాండ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

First Published:  31 Dec 2023 10:00 AM GMT
Next Story