Telugu Global
Sports

హమ్మయ్యా.. ఉప్పల్ స్టేడియం జప్తును తాత్కాలికంగా తొలగించిన హైకోర్టు

గతంలో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం రూ.40 కోట్ల విశాఖ ఇండస్ట్రీస్‌కు చెల్లించాల్సి ఉన్నది. కానీ హెచ్‌సీఏ సకాలంలో ఆ డబ్బును చెల్లించకపోవడంతో జి.వివేక్ కోర్టును ఆశ్రయించారు.

హమ్మయ్యా.. ఉప్పల్ స్టేడియం జప్తును తాత్కాలికంగా తొలగించిన హైకోర్టు
X

కీలకమైన ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)కు తాత్కాలిక ఊరట లభించింది. విశాక ఇండస్ట్రీస్ యజమాని, మాజీ హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వివేక్‌కు హెచ్‌సీఏకు మధ్య వివాదం నడుస్తోంది. ఉప్పల్ స్టేడియం అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ వివేక్‌పై హెచ్‌సీఏ పలు ఆరోపణలు చేసింది. తన పరిమితికి మించిన అజమాయిషీ చేస్తున్నారంటూ హెచ్‌సీఏ మండిపడింది. విశాక ఇండస్ట్రీస్ నిర్మించిన ఈ స్టేడియంపై గతంలోనే వాళ్లు హక్కులు కోల్పోయారని.. దీనిపై అప్పట్లో అగ్రిమెంట్ కూడా జరిగినట్లు హెచ్‌సీఏ అధికారులు చెబుతున్నారు.

గతంలో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం రూ.40 కోట్ల విశాఖ ఇండస్ట్రీస్‌కు చెల్లించాల్సి ఉన్నది. కానీ హెచ్‌సీఏ సకాలంలో ఆ డబ్బును చెల్లించకపోవడంతో జి.వివేక్ కోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 22న ట్రయల్ కోర్టు హెచ్‌సీఏ ఆస్తులను జప్తు చేసింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంతో పాటు బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసింది. కాగా, వరల్డ్ కప్ నేపథ్యంలో వార్మప్ మ్యాచ్‌లతో పాటు మూడు అధికారిక మ్యాచ్‌లను ఉప్పల్ స్టేడియంకు కేటాయించారు. కోర్టు ఫ్రీజ్ చేయడంతో మ్యాచ్‌లను నిర్వహించడం కష్టంగా మారింది.

దీంతో సుప్రీంకోర్టు హెచ్‌సీఏ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరావు ఆగమేఘాల మీద తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. వరల్డ్ కప్ నేపథ్యంలో స్టేడియం, బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడం వల్ల కష్టం అవుతోందని.. వెంటనే ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. ట్రయల్ కోర్టులో హెచ్‌సీఏ వాదన వినకుండానే సీజ్ ఉత్తర్వులు జారీ చేశారని కూడా జస్టిస్ లావు నాగేశ్వరావు ధర్మాసనానికి వివరించారు.

దీంతో హెచ్‌సీఏకు చెందిన బ్యాంకు ఖాతాలు, స్టేడియం జప్తును తాత్కాలికంగా తొలగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది. ఆర్బిట్రేషన్‌లో భాగంగా విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ.40 కోట్ల చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాల్లో అమల్లో భాగంగా రూ.17.5 కోట్లను వాణిజ్య వివాదాల కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ మొత్తం చెల్లించడానికి ఆరు వారాల గడువు మంజూరు చేసింది. ప్రపంచకప్ నిర్వహణ నేపథ్యంలో తక్షణమే ఫ్రీజింగ్‌ను తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చింది.

First Published:  30 Sept 2023 8:52 AM IST
Next Story