Telugu Global
Sports

దిగివచ్చిన హెచ్ సీఏ.. నేడే టీ-20 టికెట్ల సేల్!

మూడేళ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా జరుగనున్న టీ-20 మ్యాచ్ టికెట్ల విక్రయంపై గందరగోళానికి తెరపడింది.

దిగివచ్చిన హెచ్ సీఏ.. నేడే టీ-20 టికెట్ల సేల్!
X

మూడేళ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా జరుగనున్న టీ-20 మ్యాచ్ టికెట్ల విక్రయంపై గందరగోళానికి తెరపడింది. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లోని హెచ్ సీఏ కౌంటర్ల ద్వారా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ టికెట్లు విక్రయించనున్నారు.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈనెల 25న జరుగనున్న ఆఖరి టీ-20 మ్యాచ్ టికెట్ల విక్రయం పై గత కొద్దిరోజులుగా నెలకొన్న గందరగోళానికి ఆతిథ్య హైదరాబాద్ క్రికెట్ సంఘం తెరదించింది.

ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియా, టాప్ ర్యాంకర్ భారతజట్ల మధ్య జరుగుతున్న తీన్మార్ టీ-20 సిరీస్ లో భాగంగా జరుగనున్న ఆఖరి, మూడవ టీ-20కి హైదరాబాద్ వేదికగా నిలిచింది.

మూడేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ గడ్డపై జరుగనున్న ఈ అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ సంఘం విస్త్త్రుత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాజీవ్ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 30వేలు కాగా కనీసటికెట్ ధరను 300 రూపాయలుగా నిర్ణయించారు. అత్యధిక టికెట్ ధర 10వేల రూపాయలుగా ఉంది. మరోవైపు టికెట్ల కోసం అభిమానులు తండోపతండాలుగా జింఖానా గ్రౌండ్స్ కు తరలి వచ్చారు.

విక్రయం పై గందరగోళం...

టీ-20 మ్యాచ్ టికెట్ల విక్రయాన్ని ఆన్ లైన్ ద్వారా కొద్దిరోజుల క్రితమే ఆతిథ్య హైదరాబాద్ క్రికెట్ సంఘం మొదలు పెట్టింది. అయితే సాధారణ క్రికెట్ అభిమానులకు విక్రయించే

300 రూపాయల టికెట్ల విక్రయం ఎప్పుడనేది స్పష్టంగా ప్రకటించకపోడంతో..బ్లాక్ లో అమ్ముకొంటున్నారంటూ ఆందోళన మొదలయ్యింది. దీంతో దిగివచ్చిన హెచ్ సీఏ

జింఖానా గ్రౌండ్స్ లోని తమ క్రికెట్ సంఘం కౌంటర్ల ద్వారా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆఫ్ లైన్ లో టికెట్లు విక్రయించనున్నట్లు ప్రకటించింది.

హెచ్ఆర్సీలో ఫిర్యాదు...

టిక్కెట్ల విక్రయం విషయంలో హెచ్‌సీఏ కి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.చివరకు..మానవహక్కుల సంఘంలో సైతం మంగళవారం ఫిర్యాదు నమోదైంది. అభిమానులను మోసం చేస్తూ టిక్కెట్లను అక్రమంగా బ్లాక్‌లో విక్రయిస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరుపాలంటూ న్యాయవాది సలీం హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు.

మ్యాచ్‌కు సమయం(ఈనెల 25న) దగ్గర పడుతున్నా...ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ అంటూ సాగదీస్తూ వచ్చిన హెచ్‌సీఏ ఎట్టకేలకు దిగివచ్చింది. గురువారం నుంచి జింఖానా మైదానంలో ఉదయం 10 గంటల నుంచి టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని అధ్యక్షుడు అజారుద్దీన్‌ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ఓవైపు మ్యాచ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో విసిగిపోయిన అభిమానులు బుధవారం జింఖానా మైదానంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేలాది మంది యువకులు హెచ్‌సీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బ్లాక్‌ లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు...

హైదరాబాద్ టీ-20 మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని తెలంగాణా క్రీడామంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం సబ్సిడీ ధరకు అందించిన స్థలంలో రాజీవ్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోందని, నిబంధనల ప్రకారం హెచ్‌సీఏ అభిమానులకు టిక్కెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.

టికెట్ల విక్ర‌యాలు పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాల‌న్నారు. ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీతో క‌లిసి రాజీవ్ ల్ స్టేడియాన్ని ప‌రిశీలిస్తామ‌న్నారు. స్టేడియం సామ‌ర్థ్యం ఎంత‌? ఎన్ని టికెట్లు విక్ర‌యించార‌నే దానిపై తేల్చుతామ‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.

First Published:  22 Sept 2022 9:33 AM IST
Next Story