Telugu Global
Sports

ప్రపంచకప్ లో ఇక నాలుగుస్తంభాలాట!

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న 2023 ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు రంగం సిద్ధమయ్యింది. గత టోర్నీ ఫైనలిస్టులు ఆస్ట్ర్రేలియా, భారత్ తొలిసెమీస్ సమరంలో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి.

ప్రపంచకప్ లో ఇక నాలుగుస్తంభాలాట!
X

ప్రపంచకప్ లో ఇక నాలుగుస్తంభాలాట!

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న 2023 ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు రంగం సిద్ధమయ్యింది. గత టోర్నీ ఫైనలిస్టులు ఆస్ట్ర్రేలియా, భారత్ తొలిసెమీస్ సమరంలో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి...

కేప్ టౌన్ వేదికగా గత రెండువారాలుగా జరుగుతున్న 2023 ఐసీసీ టీ-20 మహిళా ప్రపంచకప్ లో తొలిఅంచె 10 జట్ల గ్రూప్ లీగ్ దశ ముగియటంతో ..నాలుగుజట్ల సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

ఆఖరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను అధిగమించడం ద్వారా ఆతిథ్య దక్షిణాఫ్రికా సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు అర్హత సాధించిన నాలుగవ, ఆఖరి జట్టుగా నిలిచింది.

భారత్ కు ఆస్ట్ర్రేలియా గండం....

గ్రూప్ -1 టాపర్ , డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో గురువారం కేప్ టౌన్ న్యూల్యాండ్స్ స్టేడియం వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్ -2 రన్నరప్ భారత్ ఢీ కోనుంది.

ఆస్ట్ర్రేలియా వేదికగా గతేడాది ముగిసిన టీ-20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడిన ఆస్ట్ర్రేలియా, భారతజట్లు ప్రస్తుత ప్రపంచకప్ సెమీస్ దశలోనే పోటీపడబోతున్నాయి.

ఇంగ్లండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లతో కూడిన గ్రూప్ -2 లీగ్ లో భారత్ 3 విజయాలు, ఓ ఓటమి తో రెండోస్థానంలో నిలవడం ద్వారా సెమీస్ బెర్త్ సంపాదించింది.

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, మాజీ చాంపియన్ వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లను అలవోకగా ఓడించిన భారత్ కు ఇంగ్లండ్ చేతిలో 11 పరుగుల పరాజయం తప్పలేదు.

మరోవైపు..గ్రూప్ -1 లీగ్ లో నాలుగుకు నాలుగుమ్యాచ్ లూ నెగ్గడం ద్వారా 8 పాయింట్లతో పూల్ టాపర్ గా సెమీస్ చేరిన ఆస్ట్ర్రేలియా వరుసగా మూడోసారి ప్రపంచకప్ అందుకోవాలని తహతహలాడుతోంది.

భారత్ పై కంగారూల తిరుగులేని రికార్డు...

ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియాకే భారత్ పైన మెరుగైన రికార్డు ఉంది. ఈ రెండుజట్లు

ప్రస్తుత ప్రపంచకప్ సెమీస్ కు ముందువరకూ 20 సార్లు తలపడితే...కంగారూజట్టు 14, భారత్ 6 విజయాలు సాధించాయి. అయితే...గత ఆరు మ్యాచ్ ల్లో..

ఆస్ట్ర్రేలియాను మూడుసార్లు ఓడించిన రికార్డు భారత్ కు ఉంది. నిలకడలేమికి మరోపేరైన భారత్ స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితేనే పవర్ ఫుల్ ఆస్ట్ర్రేలియాకు గట్టిపోటీ ఇవ్వగలుగుతుంది.

స్టార్ బ్యాటర్లు షెఫాలీవర్మ, స్మృతి మందన, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగేజ్ పూర్తిస్థాయిలో చెలరేగిపోతే కంగారూలకు అసలు సిసలు పరీక్ష తప్పదు.

గత ఎనిమిది ప్రపంచకప్ టోర్నీలలో భారత్ ఐదుసార్లు సెమీఫైనల్స్ ( 2009, 2010, 2016, 2020, 2023 ) చేరటం విశేషం. 2020 ప్రపంచకప్ ఫైనల్స్ కు తొలిసారిగా చేరిన భారతజట్టు రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కేప్ టౌన్ లోని న్యూల్యాండ్స్ స్టేడియం వేదికగా గురువారం భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల తొలిసెమీస్ జరుగనుంది.

రెండో సెమీస్ లో ఇంగ్లండ్ తో సౌతాఫ్రికా పోరు..

కేప్ టౌన్ వేదికగానే 24న జరిగే రెండోసెమీఫైనల్లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ పోటీపడనుంది. గ్రూప్ -1 ఆఖరి రౌండ్ లీగ్ పోటీలో బంగ్లాదేశ్ ను దక్షిణాఫ్రికా, గ్రూప్ -2 లీగ్ పోటీలో పాకిస్థాన్ ను ఇంగ్లండ్ చిత్తు చేయడం ద్వారా సెమీఫైనల్లో అడుగుపెట్టాయి.

గ్రూప్-1 లీగ్ లో పడుతూ లేస్తూ వచ్చిన ఆతిథ్య దక్షిణాఫ్రికా కీలక ఆఖరిరౌండ్ పోరులో 114 పరుగుల లక్ష్యాన్ని అలవోకగ సాధించడం ద్వారా సెమీఫైనల్స్ ఆఖరి బెర్త్ ను ఖాయం చేసుకోగలిగింది.

మరో ఆఖరి రౌండ్ లీగ్ పోరులో పాకిస్థాన్ పై ఇంగ్లండ్ 200కు పైగా రికార్డు స్కోరు సాధించడమే కాదు..114 పరుగుల ప్రపంచ రికార్డు విజయం సైతం నమోదు చేయటం ద్వారా నాకౌట్ రౌండ్లో ప్రవేశించింది.

దక్షిణాఫ్రికాతో జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది.

First Published:  22 Feb 2023 1:56 PM IST
Next Story