Telugu Global
Sports

కార్ల్ సన్ శకానికి తెర, ప్రపంచ చెస్ నయా చాంపియన్ డింగ్!

ప్రపంచ చెస్ లో మాగ్నుస్ కార్ల్ సన్ పదేళ్ల ఆధిపత్యానికి తెరపడింది. చైనా సూపర్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ సరికొత్త చాంపియన్ గా అవతరించాడు...

కార్ల్ సన్ శకానికి తెర, ప్రపంచ చెస్ నయా చాంపియన్ డింగ్!
X

ప్రపంచ చెస్ లో మాగ్నుస్ కార్ల్ సన్ పదేళ్ల ఆధిపత్యానికి తెరపడింది. చైనా సూపర్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ సరికొత్త చాంపియన్ గా అవతరించాడు...

మేధోక్రీడ చదరంగంలో చైనా ఆధిపత్యం మొదలయ్యింది. ప్రపంచ చెస్ పురుషుల, మహిళల విభాగాలలో చైనా గ్రాండ్ మాస్టర్లే విశ్వవిజేతలుగా నిలిచారు.

మహిళల విభాగంలో గ్రాండ్ మాస్టర్ జు వెన్ జు ఇప్పటికే ప్రపంచ చాంపియన్ కాగా..పురుషుల విభాగంలో చైనాకే చెందిన సూపర్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్

సరికొత్త ప్రపంచ చాంపియన్ గా తెరమీదకు వచ్చాడు.

ముగిసిన కార్ల్ సన్ శకం...

ప్రపంచ చెస్ పురుషుల విభాగంలో భారత సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిస్తే...ఆనంద్ ఆధిపత్యానికి నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నుస్ కార్ల్ సన్ గండి కొట్టి ..గత దశాబ్దకాలంగా తిరుగులేని రారాజుగా రాజ్యమేలాడు.

అయితే..2023 ప్రపంచ చెస్ సమరంలో చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ విజేతగా నిలవడం ద్వారా పదేళ్ల కార్ల్ సన్ ఆధిపత్యానికి తెరదించడం ద్వారా సరికొత్త చాంపియన్ గా

అవతరించాడు. 2013 నుంచి 2022 వరకూ ప్రపంచ చెస్ చాంపియన్ గా ఓ వెలుగు వెలిగిన కార్ల్ సన్..2023 టోర్నీలో తన టైటిల్ ను నిలుపుకోడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు.

కజకిస్థాన్ రాజధాని ఆస్తానా వేదికగా జరిగిన 2023 ప్రపంచ చెస్ టైటిల్ పోరులో 30 సంవత్సరాల చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్..రష్యా గ్రాండ్ మాస్టర్

ఇయాన్‌ నిపోమ్నియాషి తో జరిగిన హోరాహోరీ సమరంలో టై బ్రేక్ విజయంతో విజేతగా నిలిచాడు.

14 గేమ్ ల టైటిల్ పోరులో ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు చెరో 7 పాయింట్ల చొప్పున సాధించి సమఉజ్జీలుగా నిలవడంతో ..విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్ పాటించారు.

చాంపియన్‌షిప్‌ పోరులో 14 గేమ్‌ల అనంతరం ఇరువురూ చెరి 7 పాయింట్లతో సమంగా నిలవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. మొదటి 14 గేమ్ ల్లో చెరో మూడు గేమ్ లు గెలుచుకోగా..మిగిలిన 8 గేమ్ లు డ్రాగా ముగియడంతో చెరి 7 పాయింట్లు దక్కించుకోగలిగారు.

టై బ్రేక్ లో 25 నిముషాలలోనే ఒక్కో ఆటగాడు తన ఎత్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు తీవ్రఒత్తిడి నడుమ పొరపాటు ఎత్తులు వేశారు. అయితే..చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ టైబ్రేక్ లో మెరుగైన ఆటతీరు ప్రదర్శించడం ద్వారా ప్రపంచ టైటిల్ ను ఖాయం చేసుకోగలిగాడు.

తొలి చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్..

శతాబ్దకాలానికి పైగా చరిత్ర కలిగిన ప్రపంచ చదరంగ సమరంలో విశ్వవిజేతగా నిలిచిన తొలి చైనా గ్రాండ్ మాస్టర్ గా డింగ్ లిరెన్ రికార్డుల్లో చేరాడు. మొత్తం 22 లక్షల డాలర్ల ప్రైజ్ మనీని విజేత డింగ్, రన్నరప్ ఇయాన్ 55-45 దామాషాన పంచుకొన్నారు.

మొదటి 14 గేమ్ ల్లోనే ఫలితం వచ్చి ఉంటే విజేతకు 60 శాతం, రన్నరప్ కు 40 శాతం ప్రైజ్ మనీ దక్కేది. అయితే ఫలితం టై బ్రేక్ లో తేలడంతో 55 శాతం విన్నర్ కు, 45 శాతం రన్నరప్ కు సొంతమయ్యింది.

1990 దశకంలోనే ప్రపంచ మహిళా చెస్ లో చైనా ఆధిపత్యం ప్రారంభమయ్యింది. ప్రస్తుతం మహిళల విభాగంలో చైనా గ్రాండ్ మాస్టర్ జు వెన్ జున్ ప్రపంచ చాంపియన్ గా కొనసాగుతోంది.

జులై లో జరిగే 2023 ప్రపంచ చెస్ టైటిల్ సమరంలో తన దేశానికే చెందిన గ్రాండ్ మాస్టర్ లీ టింగ్ జీ తో తలపడనుంది.

ఇప్పటి వరకూ టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్ క్రీడల్లో ఆధిపత్యం చెలాయించిన చైనా..చదరంగ క్రీడలోకి సైతం దూసుకొచ్చింది. ప్రస్తుత ప్రపంచ చెస్ మహిళల, పురుషుల విభాగాలలో చైనా గ్రాండ్ మాస్టర్లే విశ్వవిజేతలుగా నిలవడంతో..చైనా ఆధిపత్యం మొదలైనట్లే...

First Published:  1 May 2023 10:50 AM IST
Next Story