Telugu Global
Sports

భారత్ రికార్డుల హోరు...శ్రీలంక టైటిల్ జోరు!

దుబాయ్ వేదికగా జరిగిన 15వ ఆసియా కప్ టోర్నీ పలు సంచలనాలతో ముగిసింది. ఏడు సార్లు విజేత భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో రికార్డుల మోత మోగిస్తే..మాజీ చాంపియన్ శ్రీలంక ఆరోసారి టైటిల్ నెగ్గి భారత్ తర్వాతి స్థానంలో నిలిచింది.

భారత్ రికార్డుల హోరు...శ్రీలంక టైటిల్ జోరు!
X

ఆస్ట్రేలియా వేదికగా మరికొద్ది వారాలలో జరుగునున్న 2022 టీ-20 ప్రపంచకప్‌కు సన్నాహాలలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగిన 15వ ఆసియా కప్ టీ-20 టోర్నీ అనూహ్యమైన ఫలితాలు, పలు అరుదైన రికార్డులతో ముగిసింది.

శ్రీలంకకు బదులుగా....

శ్రీలంక వేదికగా జరగాల్సిన 2022 ఆసియాకప్ టోర్నీని అక్కడి ఆర్థిక పరిస్థితులు సజావుగా లేకపోడంతో...ఎమిరేట్స్ వేదికగా మూడు వారాలపాటు నిర్వహించారు. ప్రపంచ టాప్ ర్యాంకర్ భారత్, రెండో ర్యాంకర్ పాకిస్థాన్ జట్లలో ఏదో ఒకజట్టు విజేతగా నిలవడం ఖాయమని అందరూ భావించారు. చివరకు టైటిల్ సమరం సైతం భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్యనే జరగడం తథ్యమని క్రికెట్ పండితులు జోస్యం చెప్పారు. అయితే..అంచనాలకు అందని ఫలితాలకు మరోపేరే క్రికెట్. గ్రూప్ లీగ్ దశలో టాపర్లుగా నిలిచిన భారత్, అఫ్ఘనిస్థాన్ జట్లు సూపర్ - 4 రౌండ్లో విఫలమై టోర్నీ నుంచి వైదొల‌గ‌డంతో .. మాజీ చాంపియన్లు శ్రీలంక, పాకిస్థాన్ జట్లు ఫైనల్స్ కు అర్హత సంపాదించాయి.

పాక్‌కు దెబ్బ మీద దెబ్బ..

టీ-20 ఫార్మాట్లో ప్రపంచ 8వ ర్యాంకర్ శ్రీలంక..గ్రూప్ -బీ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో అప్ఘనిస్థాన్ చేతిలో పరాజయం చవిచూసినా...ఆ తర్వాత ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ నెగ్గుతూ..ఆసియాకప్‌ను ఆరోసారి గెలుచుకోడం ద్వారా అందరి అంచనాలు తలకిందులు చేసింది. సూపర్ - 4 ఆఖరి రౌండ్ పోరులో పాకిస్థాన్‌ను 5 వికెట్లతో కంగుతినిపించిన శ్రీలంక...టైటిల్ పోరులో సైతం పూర్తిస్థాయి పాక్ జట్టును 23 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది.

ఫైనల్స్ లో పాక్‌పై 3-1 రికార్డు...

ఆసియా కప్ గత 15 టోర్నీల చరిత్రలో పాకిస్థాన్ ప్రత్యర్థిగా నాలుగుసార్లు ఫైనల్లో తలపడిన శ్రీలంక మూడుసార్లు విజేతగా నిలిచింది. పాకిస్థాన్‌పై 3-1 విజయాల రికార్డు నమోదు చేసింది. పవర్ ఫుల్ బ్యాటింగ్, పదునైన బౌలింగ్‌తో కూడిన పాక్ జట్టును మాత్రమే కాదు...రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో కూడిన భారత జట్టును సైతం శ్రీలంక చిత్తు చేసిన తీరు క్రికెట్ పండితులను ఆశ్చర్యానికి గురి చేసింది. శ్రీలంక లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ వనిందు హసరంగ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గౌరవాన్ని దక్కించుకొన్నాడు. అంతేకాదు..దుబాయ్ స్టేడియం వేదికగా ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జట్లు ఓడిపోతాయన్న నమ్మకాన్ని ఫైనల్లో నెగ్గడం ద్వారా శ్రీలంక వమ్ముచేసి చూపింది. సత్తా ఉంటే..టాస్ ఓడినా దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ నెగ్గ వచ్చునని నిరూపించింది.

దుబాయ్ వేదికగా ఫైనల్లో టాస్ ఓడినా మ్యాచ్ నెగ్గినజట్టుగా శ్రీలంక రికార్డు నెలకొల్పింది. 1986, 1997, 2004, 2008, 2014 సంవత్సరాలలో ఆసియా కప్ విజేతగా నిలిచిన శ్రీలంక ఎనిమిదేళ్ల విరామం తర్వాత తిరిగి షనక నాయకత్వంలో మరోసారి ట్రోఫీని అందుకోగలిగింది. ఆసియా కప్ చరిత్రలో భారత్ అత్యధికంగా ఏడుసార్లు విజేతగా నిలిస్తే...ఆరు టైటిల్స్ తో శ్రీలంక ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ జట్టు ఇప్పటి వరకూ రెండుసార్లు మాత్రమే ట్రోఫీ అందుకోగలిగింది.


భారత్ రికార్డుల మోత....

ఆసియా కప్ ఫైనల్స్ కు చేరుకోడంలో టాప్ ర్యాంకర్ భారత్ విఫలమైనా...బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో తిరుగులేని రికార్డులు నెలకొల్పింది. 15వ ఆసియా కప్ టోర్నీలో 200కు పైగా స్కోరు సాధించిన ఏకైక జట్టు భారత్ మాత్రమే. అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సూపర్ - 4 ఆఖరి రౌండ్ పోరులో భారత్ 20 ఓవర్లలో 212 పరుగులు సాధించింది. వ్యక్తిగతంగా శతకం బాదిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అప్ఘనిస్థాన్‌పై విరాట్ 122 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు. స్టాండిన్ కెప్టెన్ రాహుల్‌తో కలసి విరాట్ మొదటి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. మొదటి వికెట్‌కు భారీ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన ఏకైక జట్టు భారత్ మాత్రమే. ఇక బౌలింగ్ లో భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ కేవలం 4 పరుగులకే 5 వికెట్లు పడగొట్టడం ద్వారా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేయగలిగాడు. అఫ్ఘనిస్థాన్‌పై భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. పవర్ ప్లేలో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జట్టు ఘనత సైతం భారత్ కే దక్కింది.


ఆసియా కప్ టైటిల్ మినహా మిగిలిన అన్ని విభాగాలలోనూ రికార్డుల మోత మోగించిన హాట్ ఫేవరెట్ కమ్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత జట్టు చివరకు ఉత్తచేతులతో స్వదేశానికి తిరిగిరావాల్సి వచ్చింది. సంక్షుభిత శ్రీలంకకు ఆ దేశ క్రికెట్ జట్టు ఆసియాకప్‌ను సాధించి పెట్టడం ద్వారా ఊరట కలిగించింది. తమ దేశంలోనే ఆసియాకప్‌కు ఆతిథ్యమివ్వాల్సిన శ్రీలంక అశక్తతను వ్యక్తం చేయడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈటోర్నీని నిర్వహించినా...శ్రీలంక జట్టే విజేతగా నిలవడం 15వ ఆసియా కప్ టోర్నీకే కొసమెరుపుగా మిగిలిపోతుంది.

First Published:  12 Sept 2022 11:34 AM IST
Next Story