Telugu Global
Sports

రోహిత్ శర్మకు అదో పెద్దబలహీనత!

భారత కెప్టెన్ రోహిత్ శర్మకు మతిమరుపు ఉందని రాయ్ పూర్ వన్డే టాస్ సమయంలో అందరికీ తెలిసింది. అయితే రోహిత్ కు ఈ మతిమరుపు ఎప్పటినుంచే ఉందని విరాట్ కొహ్లీ చెప్పాడు.

రోహిత్ శర్మకు అదో పెద్దబలహీనత!
X

రోహిత్ శర్మకు అదో పెద్దబలహీనత!

భారత కెప్టెన్ రోహిత్ శర్మకు మతిమరుపు ఉందని రాయ్ పూర్ వన్డే టాస్ సమయంలో అందరికీ తెలిసింది. అయితే రోహిత్ కు ఈ మతిమరుపు ఎప్పటినుంచే ఉందని విరాట్ కొహ్లీ చెప్పాడు...

రోహిత్ శర్మ...అంత్జాతీయ క్రికెట్ అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడు. వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్. క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ శతకాలు సాధించిన అతికొద్దిమంది ఆటగాళ్లలో ఒకడు. అంతేనా మొన్నటి వరకూ క్రికెట్ మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ కు మెమరీలాస్ ..అదే..మతిమరుపు ఉందంటే ఆశ్చర్యపోడం మనవంతే అవుతుంది.

మెరుపువేగంతో సాగిపోయే టీ-20 ఫార్మాట్ తో పాటు..50 ఓవర్ల వన్డే క్రికెట్లో మ్యాచ్ కు సారథ్యం వహించే సమయంలో ఎంతో చురుకుగా, తెలివిగా, సమయస్ఫూర్తితో ఉండాలి. ఏ ఫీల్డర్ ని ఎక్కడ మొహరించిందీ, ఏ బౌలర్ తో ఎన్ని ఓవర్లు వేయించిందీ, క్రీజులో ఉన్న బ్యాటర్ బలాబలాలు లాంటి పలు రకాల అంశాలను కెప్టెన్ గుర్తుంచుకొంటూ ఉండాలి.

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్..

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు విజేతగా నిలిపిన ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే. అత్యంత విజయవంతమైన నాయకుడిగా రోహిత్ రికార్డు తిరుగులేనిది. అలాంటి రోహిత్ కు మతిమరుపు ఉందంటే ఒకపట్టాన్ని నమ్మబుద్దికాదు.

36 సంవత్సరాల వయసులో ఈ మతిమరుపు ఏంటా అని ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

రోహిత్ జీవితంలో అదో భాగం..

గత 16 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెటర్ గా వివిధ దేశాలు, భారత్ లోని వివిధ నగరాలలో వందలాదిమ్యాచ్ లు ఆడిన రోహిత్ జీవితం నిరంతర పర్యటనలతో ఎక్కే విమానం..దిగే విమానం అన్నట్లుగా సాగుతూ వస్తోంది. ఓ నగరం నుంచి మరో నగరానికి లేదా ఒక్కో దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళేసమయంలో తాను బస చేసిన హోటెల్ గది..లేదా ప్రయాణం చేసిన బస్సుల్లో రోహిత్ ఖరీదైన వస్తువులు మరిచిపోతూ ఉంటాడని, విదేశీపర్యటనలకు వెళ్లిన సమయంలో అత్యంత కీలకమైన పాస్ పోర్టు సైతం మరచిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయని భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ బయటపెట్టాడు.

ముంబై నగరంలో పుట్టి పెరిగిన కుర్రాళ్లు, యువకుల ప్రవర్తన, మాటతీరు, హిందీ మాండలికంలో అక్కడి ట్రాఫిక్ జామ్ ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందంటూ విరాట్ చమత్కరించాడు. ఆగి ఆగి మాట్లాడటం మామూలేనని..అదీ రోహిత్ శర్మలో కాస్త ఎక్కువని గుర్తు చేశాడు. ఐపాడ్ లు, వాలెట్లు, సెల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను రోహిత్ తరచూ మరచిపోతుంటాడని, తమజట్టు లాజిస్టిక్స్ మేనేజర్ సైతం రోహిత్ వస్తువుల గురించి తరచూ ఆరాతీస్తూ ఉంటారని, రోహిత్ భార్య రితిక సైతం మరచిపోయిన వస్తువులను గుర్తు చేస్తూ, జాగ్రత్త చేస్తూ ఉంటుందని వివరించాడు.

తాము విదేశీపర్యటనలకు వెళ్లిన సమయంలో రోహిత్ వస్తువులు సరిచూసుకొన్న తర్వాతే తమ టీమ్ బస్సు ప్రయాణం మొదలవుతుందని విరాట్ గుర్తు చేసుకొన్నాడు.

రాయ్ పూర్ వన్డే టాస్ లో మతిమరుపు..

న్యూజిలాండ్ తో తీన్మార్ సిరీస్ లో భాగంగా రాయ్ పూర్ వేదికగా జరిగిన రెండోవన్డేలో టాస్ వేసిన సమయంలో..టాస్ నెగ్గినజట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ తన నిర్ణయం (బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్) గురించి చెప్పడంలో కొన్ని సెకన్లపాటు మిన్నకుండిపోయాడు. మెదడుకు రక్తం సరఫరా ఆగిపోయినట్లు 10 సెకన్లపాటు ప్రవర్తించాడు. మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్, ప్రత్యర్థిజట్టు కెప్టెన్ టామ్ లాథమ్ సైతం..రోహిత్ మతిమరుపును చూసి ముసిముసినవ్వులు నవ్వుకొన్నారు.

తమకు ఫీల్డింగ్ కావాలో..బ్యాటింగ్ కావాలో..తన నిర్ణయం చెప్పటానికి కొద్దినిముషాలపాటు తటపటాయించడం మీడియా దృష్టిలో పడింది. సోషల్ మీడియాలో రోహిత్ మెమరీలాస్ వార్త వైరల్ అయ్యింది.

మరోవైపు..తనలో ఏదైనా లోపం ఉందంటే విలువైన వస్తువులు మరచిపోయే మతిమరుపేనంటూ రోహిత్ చమత్కరించడం మరో విశేషం.

First Published:  23 Jan 2023 12:40 PM IST
Next Story