Telugu Global
Sports

టెస్టు లీగ్ ఫైనల్ బెర్త్ కు భారత్ కు గురి!

బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ లో క్లీన్ స్వీప్ విజయంతో భారత్ ఐసీసీ టెస్టు లీగ్ పాయింట్ల పట్టిక రెండోస్థానాన్ని మరింత పటిష్టం చేసుకొంది

టెస్టు లీగ్ ఫైనల్ బెర్త్ కు భారత్ కు గురి!
X

బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ లో క్లీన్ స్వీప్ విజయంతో భారత్ ఐసీసీ టెస్టు లీగ్ పాయింట్ల పట్టిక రెండోస్థానాన్ని మరింత పటిష్టం చేసుకొంది. వరుసగా రెండోసారి

టెస్టు లీగ్ ఫైనల్స్ చేరాలన్న పట్టుదలతో ఉంది....

ఐసీసీ ప్రారంభ టెస్టు లీగ్ ఫైనలిస్ట్, రన్నరప్ భారత్ వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరాలన్న పట్టుదలతో ఉంది. బంగ్లాదేశ్ తో ముగిసిన రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా..లీగ్ టేబుల్ లో ప్రస్థుత రెండోస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలిగింది.

99 పాయింట్లతో రెండోస్థానంలో భారత్..

ఇప్పటి వరకూ టెస్టు లీగ్ రెండోస్థానంలో కొనసాగుతూ వచ్చిన దక్షిణాఫ్రికాజట్టు..ఆస్ట్ర్రేలియా టూర్ లోని తొలిటెస్టులో ఘోరపరాజయం పొందటం, ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ 0-3తో చిత్తు కావడం భారత్ కలసి వచ్చింది.

ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత సిరీస్ లోని చివరి రెండుటెస్టుల్లో ఒక‌వేళ ద‌క్షిణాఫ్రికా నెగ్గితే పాయింట్ల ప‌ట్టిక‌లో భారత్ ను వెనక్కునెట్టే అవ‌కాశం ఉంది. అలాంటి ప‌రిస్థితి వ‌స్తే.. భార‌త్ వ‌చ్చే ఏడాది వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ ఆడాలంటే స్వ‌దేశంలో జరిగే బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను ఓడించితీరాలి. ఇంగ్లండ్‌లో వ‌చ్చే ఏడాది జూన్‌లో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది.

గ‌త ఏడాది వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ విరాట్ కోహ్లీ సార‌థ్యంలో టైటిల్ చేజార్చుకొంది. దాంతో, ఈసారి ఎలాగైనా టెస్టు ఛాంపియ‌న్‌షిప్‌ ట్రోఫీ గెల‌వాల‌నే క‌సితో ఉంది. మిర్‌పూర్‌లో జ‌రిగిన‌రెండో టెస్టులో భార‌త్ 3 వికెట్ల తేడాతో బంగ్లాపై సంచలన విజయం నమోదు చేసింది. ఓటమి అంచుల నుంచి బయటపడి విజేతగా సిరీస్ స్వీప్ సాధించింది. టాపార్డ‌ర్ వైఫల్యంతో ఒక‌ద‌శ‌లో భార‌త్ కు ఓటమి తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే 8వ వికెట్ కు 71 పరుగుల అజేయ భాగస్వామ్యంతో అశ్విన్ 42, శ్రేయాస్ అయ్య‌ర్ 29 కీలక విజయం అందించారు.

భారత్ మొత్తం 58.93 విజయ శాతంతో 99 పాయింట్ల‌తో పాయింట్ల పట్టిక రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్ర్రేలియాజట్టు 76.92 శాతం విజ‌యాలు, 120 పాయింట్ల‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ద‌క్షిణాఫ్రికా (54.55 శాతం) 72 పాయింట్ల‌తో మూడోస్థానానికి ప‌డిపోయింది. భారత ఉపఖండ జ‌ట్ల‌లో శ్రీ‌లంక నాలుగో స్థానంలో, పాకిస్థాన్ 7, బంగ్లాదేశ్ 9వ స్థానంలో నిలిచాయి.

5వ స్థానంలో ఇంగ్లండ్...

పాకిస్థాన్ తో ముగిసిన తీన్మార్ టెస్టు సిరీస్ లో వైట్ వాష్ సాధించడం ద్వారా ఇంగ్లండ్ 5 వ స్థానంలో నిలిచింది. రావల్పిండి, ముల్తాన్, లాహోర్ వేదికలుగా జరిగిన మూడుటెస్టుల్లో ఘోరపరరాజయాలు చవిచూసిన పాక్ జట్టు 42.22 విజయశాతంతో 6వ ర్యాంక్ కు దిగజారిపోయింది. పాక్ పై మూడు టెస్టుల్లో నెగ్గినా ఇంగ్లండ్ మాత్రం 44.44 విజయశాతంతోనే ఉంది.

ఆఖరి మూడుస్థానాలలో కివీస్, విండీస్..

ఐసీసీ ప్రారంభ టెస్టు లీగ్ విజేత, టేబుల్ టాపర్ న్యూజిలాండ్ మాత్రం..ప్రస్తుత లీగ్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యింది. 25.93 శాతం విజయాలతో 8వ స్థానంలో నిలిచింది.

వెస్టిండీస్ జట్టు 40.91 విజయశాతంతో 7వ స్థానంలో కొనసాగుతుంటే..బంగ్లాదేశ్ 12.12 విజయాలశాతంతో లీగ్ టేబుల్ అట్టడుగున నిలిచింది.

భారతజట్టు ప్రస్తుత సీజన్ టెస్టు లీగ్ ఫైనల్స్ చేరాలంటే.....ఆస్ట్ర్రేలియాతో జరిగే స్వదేశీ టెస్టు సిరీస్ లో ఒక్క ఓటమికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంది. అప్పుడే లీగ్ టేబుల్ మొదటి రెండుస్థానాలలో నిలవడం ద్వారా టైటిల్ సమరానికి అర్హత సాధించగలుగుతుంది.

First Published:  26 Dec 2022 10:07 AM IST
Next Story