భారత ఫుట్ బాల్ మేస్త్రీ సునీల్ చెత్రీ!
ఐదుగురు అత్యుత్తమ ప్రపంచ ఫుట్ బాల్ గోల్ స్కోరర్లలో కెప్టెన్ సునీల్ చెత్రీ ఒకడిగా నిలిచాడు.
భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీ 38 సంవత్సరాల వయసులో గోల్ సాధించడం ద్వారా అరుదైన ఘనత సాధించాడు. ఐదుగురు అత్యుత్తమ ప్రపంచ ఫుట్ బాల్ గోల్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు.
ఫుట్ బాల్ ప్రపంచంలో భారత్ కు అంతంత మాత్రమే గుర్తింపు ఉన్నా...భారత కెప్టెన్ సునీల్ చెత్రీ మాత్రం అలుపెరుగని తన పోరాటస్ఫూర్తితో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకొంటున్నాడు. కేవలం తన ఆటతీరుతోనే భారత ఫుట్ బాల్ అస్థిత్వాన్ని కాపాడుతూనే తన ప్రత్యేకతను నిలబెట్టుకొంటూ వస్తున్నాడు.
2005 నుంచి 2023 వరకూ...
ప్రపంచ క్రీడారంగంలో ఎన్ని రకాల ఆటలు ఉన్నా ఫుట్ బాల్ తర్వాతే ఏక్రీడైనా. విశ్వవ్యాప్తంగా 204 దేశాలకు చెందిన కోట్లాదిమంది ఆడే ఈ జనసంమోహక క్రీడలో
భారత్ ఇంకా శైశవదశలోనే కొట్టిమిట్టాడుతోంది. పట్టుమని పన్నెండు దేశాలు గట్టిగా ఆడని క్రికెట్లో మనం ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో నిలిచినా...200కు పైగా దేశాలు ఆడే ఫుట్ బాల్ లో మన ర్యాంకు 104 మాత్రమే.
మనదేశంలో క్రికెట్ మర్రినీడలో ఎదుగూబొదుగూలేని క్రీడల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న ఫుట్ బాల్ అభివృద్ధి కోసం భారత ఫుట్ బాల్ సమాఖ్య పలురకాల చర్యలు తీసుకొంటూ నానాపాట్లు పడుతూ వస్తోంది. ఎంత చేసినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నతీరుగా పరిస్థితి తయారయ్యింది. క్రికెటర్లకు ఉన్న ఆదరణ, ప్రోత్సాహం ఫుట్ బాల్ క్రీడాకారులకు లేకపోడం కూడా ఎదుగూబొదుగూ లేకపోడానికి ఓ ప్రధానకారణంగా ఉంటూ వస్తోంది. దేశంలోని గోవా, మహారాష్ట్ర, బెంగాల్, ఈశాన్య భారత రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన భారత ఫుట్ బాల్ ఇంకా బుడిబుడి అడుగుల దశలోనే ఉంది.
కేవలం బెంగాల్, గోవా, కేరళ రాష్ట్ర్రాలకో , ఈశాన్య భారత రాష్ట్ర్రాలకో పరిమితమైన భారత్ ఫుట్ చరిత్రను ఓసారి తిరగేస్తే...వంద అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లు ఇద్దరంటే ఇద్దరు మాత్రమే కనిపిస్తారు.
దశాబ్దానికి ఒక్కడు.....
జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారత్ లో వందలాదిమంది క్రికెటర్లు పుట్టుకు వస్తున్నా...ఫుట్ బాల్ లో మాత్రం...దశాబ్దానికో అంతర్జాతీయస్థాయి ఆటగాడిని మాత్రమే తయారు చేసే పరిస్థితి నెలకొని ఉంది.
సిక్కిం నుంచి భారత్ ఫుట్ బాల్ లోకి దూసుకొచ్చిన బైచుంగ్ భూటియా దశాబ్దకాలం పాటు జాతీయ ఫుట్ బాల్ కు అసమాన సేవలు అందించి రిటైర్మెంట్ ప్రకటిస్తే..
ఆ స్థానాన్ని ప్రస్తుత కెప్టెన్ సునీల్ చెత్రీ గత కొద్ది సంవత్సరాలుగా భర్తీ చేస్తూ వస్తున్నాడు.
గతంలో కేరళ స్ట్రయికర్ విజయన్, ఆ తర్వాత బైచుంగ్ భూటియా...ఈ ఇద్దరి వారసుడుగా సునీల్ చెత్రీ మాత్రమే అంతర్జాతీయస్థాయి ఫుట్ బాలర్లు గా గుర్తింపు సంపాదించుకొన్నారు. భారత కెప్టెన్ గా అసాధారణ సేవలు అందించిన బైచుంగ్ భూటియా తాను ఆడిన 100 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో 42 గోల్స్ సాధించాడు.
బైచుంగ్ బాటలో సునీల్ చెత్రీ...
బైచుంగ్ భూటియా రిటైర్మెంట్ తర్వాత...భారత ఫుట్ బాల్ జట్టు పగ్గాలను చేపట్టిన సునీల్ చెత్రీ...ఈ మధ్యకాలంలోనే వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వస్తున్నాడు.
భారత్ వేదికగా ముగిసిన 2023 మూడుదేశాల అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నీ ఫైనల్లో..కిర్గిజిస్థాన్ పై ఓ గోల్ చేయటం ద్వారా... ప్రపంచ సాకర్ సూపర్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లయనల్ మెస్సీ లాంటి దిగ్గజాల జాబితాలో చోటు సంపాదించాడు.
మియన్మార్, కిర్గిజిస్థాన్ జట్లు ప్రత్యర్థులుగా జరిగిన మూడుదేశాల అంతర్జాతీయ సాకర్ టోర్నీలో సునీల్ చెత్రీ నాయకత్వంలోని భారతజట్టుకు రెండుకు రెండు విజయాలు సాధించడం ద్వారా విజేతగా నిలిచింది.
తొలిమ్యాచ్ లో తనకంటే మెరుగైన ర్యాంక్ లో ఉన్న మియన్మార్ ను 1-0తో ఓడించిన భారత్...రెండోమ్యాచ్ లో పవర్ ఫుల్ కిర్గిజిస్థాన్ ను 2-0 గోల్స్ తో చిత్తు చేసింది.
కిర్గిజిస్థాన్ తో ముగిసిన పోరు ఆట రెండో భాగంలో లభించిన పెనాల్టీని గోలుగా మలచడం ద్వారా..సునీల్ చెత్రీ భారత్ తరపున 85వ గోల్ సాధించగలిగాడు.
ప్రపంచ మేటి సాకర్ స్టార్ల జాబితాలో...
అంతర్జాతీయ సాకర్ లో తమ జట్ల తరపున అత్యధిక గోల్స్ సాధించిన ఆల్ టైమ్ గ్రేట్ సాకర్ స్టార్ల వరుస 5వ స్థానంలో సునీల్ చెత్రీ నిలిచాడు. 38 సంవత్సరాల వయసులో తన 132వ అంతర్జాతీయమ్యాచ్ లో సునీల్ ఈ ఘనతను సొంతం చేసుకోగలిగాడు.
తమతమ జాతీయజట్ల తరపున అత్యధిక గోల్స్ సాధించిన మొనగాళ్లలో క్రిస్టియానో రొనాల్డో 120 గోల్స్ తో అగ్రస్థానంలో నిలిస్తే..ఇరాన్ ఆటగాడు అలీ దాయ్ 109 గోల్స్ తో రెండు, లయనల్ మెస్సీ 100 గోల్స్ తో మూడు, ముక్తార్ దహారీ 89 గోల్స్ తో నాలుగు, సునీల్ చెత్రీ 85 గోల్స్ తో ఐదు, ఫెరెన్స్ పుస్కాస్ 84 గోల్స్ తో ఆరు స్థానాలలో కొనసాగుతున్నారు.
క్వెట్టా నుంచి ఇంఫాల్ వరకూ...
2005లో క్వెట్టా వేదికగా పాకిస్థాన్ తో జరిగిన పోటీ ద్వారా....అంతర్జాతీయ ఫుట్ బాల్ అరంగేట్రం చేసిన సునీల్ చెత్రీ...తన కెరియర్ లో 132 మ్యాచ్ లు ఆడి 85 గోల్స్ సాధించిన భారత తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బైచుంగ్ భూటియా 104 మ్యాచ్ ల్లో 42 గోల్స్ మాత్రమే సాధిస్తే..సునీల్ చెత్రీ... ఆ రికార్డును అధిగమించాడు.
సునీల్ చెత్రీ 18 ఏళ్ల ఫుట్ బాల్ ప్రస్థానంలో..భారత్ ఐదుగురు రాష్ట్రపతులను, ఇద్దరు ప్రధానులను, ఎనిమిదిమంది క్రికెట్ కెప్టెన్లను, ఎనిమిదిమంది ఫుట్ బాల్ శిక్షకులను చూసింది. అంతేకాదు భారత జనాభా 19.00 శాతానికి పెరిగిపోయింది. భారత ఫుట్ బాల్ ర్యాంక్ 127 నుంచి 104కు మెరుగు పడింది.
2005 జూన్ 12న క్వెట్టా వేదికగా పాకిస్థాన్ పై తన తొలి అంతర్జాతీయ గోల్ సాధించిన సునీల్ చెత్రీ...2023 మార్చిలో ఇంఫాల్ వేదికగా కిర్గిజిస్థాన్ తో ముగిసిన మ్యాచ్ లో 85వ అంతర్జాతీయ గోల్ సాధించడం విశేషం.
38 ఏళ్ల వయసులోనూ అసాధారణంగా రాణిస్తున్న సునీల్ చెత్రీ....భారత ఫుట్ బాల్ ఒకే ఒక్కడుగా నిలిచిపోతాడు. కేవలం ఫుట్ బాల్ ఆట కోసమే పుట్టిన ఆటగాడు సునీల్ చెత్రీ.
....aaaaand that's #85 for Sunil Chhetri.pic.twitter.com/eUu6QHeUdE
— Shyam Vasudevan (@JesuisShyam) March 28, 2023
Most International Goals:
— IFTWC - Indian Football (@IFTWC) March 28, 2023
Cristiano Ronaldo
Ali Daei
Lionel Messi
Mokhtar Dahari
Sunil Chhetri
Ferenc Puskás
Sunil Chhetri becomes 5th all-time International Goalscorer. #IndianFootall #SC11 #BlueTigers pic.twitter.com/O1rU0ulunz