తెలంగాణ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. ఇండియన్ రేసింగ్ లీగ్ షెడ్యూల్‌లో మార్పులు
లీగ్ కోసం టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు పూర్తి మొత్తం తిరిగి చెల్లిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఇండియన్ రేసింగ్ లీగ్ హైదరాబాద్ వేదికగా జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతేడాది నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ఇందుకోసం ప్రత్యేకంగా సర్క్యూట్‌ను ఏర్పాటు చేసింది. హెచ్ఎండీఏ, ఫార్ములా-ఈ కలిసి నిర్వహించిన ఈ లీగ్ ఎంతో ప్రజాదరణ పొందింది. గత లీగ్ విజయవంతం కావడంతో వచ్చే ఏడాది కూడా ఇదే సమయానికి నిర్వహిస్తామని చెప్పారు.
షెడ్యూల్ ప్రకారం నవంబర్ 4, 5న హైదరాబాద్‌లో లీగ్ నిర్వహించాల్సి ఉన్నది. అయితే తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉండటం, భద్రతను కల్పించడానికి ఇబ్బందులు ఏర్పడటంతో లీగ్ వేదికను మార్చినట్లు అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 4, 5వ తేదీల్లోనే లీగ్ నిర్వహిస్తామని.. కాకపోతే వేదికను హైదరాబాద్ నుంచి చెన్నైకి మారుస్తున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
'ఇండియన్ రేసింగ్ లీగ్' వేదికను హైదరాబాద్ నుంచి చెన్నైకి మారుస్తున్నాము. తెలంగాణలో ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇప్పటికే ఈ లీగ్ కోసం టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు పూర్తి మొత్తం తిరిగి చెల్లిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఇలా జరిగినందుకు అభిమానులు క్షమించాలని నిర్వాహకులు కోరారు.