Telugu Global
Sports

ఇంగ్లాండ్ గడ్డపై టీమ్ ఇండియా గర్జన.. వన్డే సిరీస్ కైవసం

పంత్ మెరుపు సెంచరీకి తోడు.. హార్దిక్ పాండ్యా అర్ద సెంచరీ తోడవడంతో.. ఆఖరి వన్డేలో ఘన విజయాన్ని సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నది.

ఇంగ్లాండ్ గడ్డపై టీమ్ ఇండియా గర్జన.. వన్డే సిరీస్ కైవసం
X

Team India won the ODI series on England soil వన్డే సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్నది. లక్ష్య ఛేదనలో 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టుకు పంత్ మెరుపు సెంచరీకి తోడు.. హార్దిక్ పాండ్యా అర్ద సెంచరీ తోడవడంతో.. ఆఖరి వన్డేలో ఘన విజయాన్ని సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నది.

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో భారత జట్టు టాస్ ఓడి ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత బౌలర్లు రెండో వన్డేలో విఫలమైనా.. మూడో వన్డేలో మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు 14 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కేవలం 74 పరుగులు మాత్రమే చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే బెయిర్‌స్టో (0), జో రూట్ (0) లు పెవీలియన్ చేరారు. అయితే కాసేపు జేసన్ రాయ్, స్టోక్స్ క్రీజులో ఉండి భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. బెన్ స్టోక్స్ (27), జేసన్ రాయ్ (41) లను హార్దిక్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన జాస్ బట్లర్ (60) సమయోచితంగా ఆడి ఇంగ్లాండ్‌ను ఆదుకున్నాడు.

మొయిన్ అలీ (34), బట్లర్ కలిసి ఇంగ్లాండ్‌కు విలువైన 75 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ అవుటయ్యాక.. లివింగ్ స్టోన్ (27), ఒవర్టన్ (32) కాసిన్ని పరుగులు రాబట్టారు. అయితే భారత బౌలర్లు డెత్ ఓవర్లలో చెలరేగడంతో కేవలం 61 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు కేవలం 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభంలో తడబడింది. మొదట్లో ఇంగ్లాండ్ బౌలర్ టాప్లే నిప్పులు చెరిగే బంతులు విసిరాడు. కీలకమైన ధావన్ (1), రోహిత్ శర్మ (17), విరాట్ కోహ్లీ (17) వికెట్లను తీశాడు. సూర్యకుమార్ యాదవ్ (16)ను ఒవర్టన్ పెవీలియన్ చేర్చాడు. దీంతో భారత జట్టు 72 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా తమ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. పంత్ క్రీజులో పాతుకొని పోయి.. మొదట్లో ఆచితూచి ఆడాడు. కానీ ఇంకో ఎండ్‌లో ఉన్న హార్దిక్ మాత్రం తన సహజశైలిలో దూకుడుగా ఆడుతూ రన్‌రేట్ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. వీరిద్దరూ క్రమంగా పరుగులు రాబడుతూ.. భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ పోయారు.

పంత్, పాండ్యాల జోడిని విడదీయడానికి ఇంగ్లాండ్ బౌలర్లు చాలా కష్టపడ్డా.. ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోనే వీరు అర్ద సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత పంత్ దూకుడు పెంచాడు. బౌండరీలు బాదుతూ భారత జట్టును లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్లారు. ఐదో వికెట్‌కు కీలకమైన 133 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. స్కోర్ బోర్డు 200 దాటి ముందుకు వెళ్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా బౌన్సర్‌ను ఆడబోగా.. స్టోక్స్ అద్భుతమైన క్యాచ్‌తో పెవీలియన్ చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టులో ఉత్సాహం వచ్చింది. కానీ, పంత్ మాత్రం వాళ్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. బౌండరీలు, సిక్సులు బాదుతూ తన కెరీర్‌లో తొలి వన్డే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత విల్లీ వేసిన ఓవర్‌లో ఏకంగా ఐదు బౌండరీలు బాదాడు. ఇక ఆ తర్వాత జోరూట్ వేసిన తొలి బంతినే బౌండరీ దాటించి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. రిషబ్ పంత్ (125 నాటౌట్), జడేజా (7 నాటౌట్) చివర్లో వికెట్ పడనీయలేదు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 2-1తో విజయం సాధించింది. రిషబ్ పంత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. మొత్తానికి ఈ టూర్‌లో భారత జట్టు వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకొని, పర్యటనను విజయవంతంగా ముగించింది.

2015 తర్వాత ఇంగ్లాండ్ జట్టు సొంత గడ్డపై ఓడిన మూడో సిరీస్ ఇది.

2015 - ఆస్ట్రేలియా (3-2)

2020 - ఆస్ట్రేలియా (2-1)

2022 - ఇండియా (2-1)

2015 వరల్డ్ కప్ తర్వాత ఇండియా - ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ ఫలితాలు

2017 (ఇండియాలో): - ఇండియా 2-1 విజయం

2018 (ఇంగ్లాండ్‌లో): ఇంగ్లాండ్ 2-1 విజయం

2021 (ఇండియాలో ): ఇండియా 2-1 విజయం

2022 (ఇంగ్లాండ్‌లో): ఇండియా 2-1 విజయం

First Published:  18 July 2022 8:15 AM IST
Next Story