Telugu Global
Sports

మూడు రోజుల్లోనే ముగించారు.. ఇండియా స్పిన్ మాయజాలానికి చేతులెత్తేసిన ఆసీస్

భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై భారత జట్టు సాధించిన భారీ ఇన్నింగ్స్ విజయాల్లో ఇది మూడో స్థానంలో ఉన్నది.

మూడు రోజుల్లోనే ముగించారు.. ఇండియా స్పిన్ మాయజాలానికి చేతులెత్తేసిన ఆసీస్
X

ఉపఖండంలోని పిచ్‌లపై ఆడాలంటే ఆస్ట్రేలియా టీమ్‌కు కూడా కష్టమేనని మరోసారి స్పష్టమైంది. స్పిన్ పిచ్‌కు అనుకూలంగా ఉండే నాగ్‌పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత స్పిన్నర్లు మాయజాలం చేశారు. మూడో రోజు ఆస్ట్రేలియా జట్టు కనీసం పోరాడకుండానే ఒకే సెషన్‌లో 91 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ 132 పరుగుల భారీ విజయాన్ని అందుకున్నది. ఈ విజయంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు మొదట్లోనే తడబడింది. మూడు ఓవర్లకే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. లబుషేన్ (49), స్టీవ్ స్మిత్ (37), హ్యాండ్స్‌కాంబ్ (31), అలెక్స్ కేరీ (36) తప్ప మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. రవీంద్ర జడేజా 5, అశ్విన్ 3 వికెట్లు తీసి ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను చిత్తు చేశారు. దీంతో ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది.అదే రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు తొలి రోజు రాహుల్ వికెట్ మాత్రం కోల్పోయింది.

ఇక రెండో రోజు కెప్టెన్ రోహిత్ శర్మ (120) వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు పుజారా, కోహ్లీ, సూర్యకుమార్ తక్కువ స్కోరుకే పెవీలియన్ చేరడంతో భారత జట్టు కూడా 200 లోపే ఆలౌట్ అవుతుందని అనుకున్నారు. కానీ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కలిసి భారత జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. రోహిత్ అవుటైన తర్వాత వచ్చిన శ్రీకర్ భరత్ మెప్పించలేకపోయాడు. అయితే అక్షర్ పటేల్ మాత్రం అతడికి తోడుగా నిలిచాడు. ఇక మూడో రోజు రవీంద్ర జడేజా (84) అవుటైనా అక్షర్ (84) క్రీజులో పాతుకొని పోయాడు. మరోవైపు మహ్మద్ షమి (37) దూకుడుగా ఆడాడు. ఇక లంచ్ టైం సమయానికి భారత జట్టు 400 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియన్ స్పినర్ మర్ఫీ ఏకంగా 7 వికెట్లు తీశాడు. మిగిలిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోయారు.

తిప్పేసిన అశ్విన్..

మూడో రోజు లంచ్ విరామం తర్వాత ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. మరోసారి ఉస్మాన్ ఖవాజా (5) రెండో ఓవర్‌లోనే అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. లబుషేన్ (17) జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ చేరాడు. అశ్విన్ తన స్పిన్ మాయాజాలాన్ని కంటిన్యూ చేశాడు. వరుసగా 14, 16, 18, 20వ ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున తీశాడు. ఇవన్నీ ఎల్బీడబ్యూలే కావడం గమనార్హం. అశ్విన్ స్పిన్ మాయజాలానికి ఆసీస్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేక పోయారు. అశ్విన్‌కి తోడు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లు కూడా కలిశాడు. ఆఖర్లో షమి నాథన్ లయన్, బోలాండ్ వికెట్లను పడగొట్టడంతో ఆస్ట్రేలియా 91 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (25) పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది.

భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై భారత జట్టు సాధించిన అత్యధిక ఇన్నింగ్స్ విజయాల్లో ఇది మూడో స్థానంలో ఉన్నది. అంతకు ముందు 1997/98లో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 219 పరుగుల తేడాతో గెలవగా.. 2012/13లో హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 135 తేడాతో గెలిచింది.

జడేజాకు ఐసీసీ జరిమానా

తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేయడమే కాకుండా 5 వికెట్లు.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. గాయం కారణంగా ఐదు నెలల పాటు జట్టుకు దూరమైన జడేజా.. పునరాగమనం చేసిన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తాను ఇలా కోలుకోవడానికి నేషనల్ క్రికెట్ అకాడమీ సిబ్బంది కారణమని చెప్పుకొచ్చాడు.

కాగా, రవీంద్ర జడేజాకు ఒక డీ మెరిట్ పాయింట్‌తో పాటు 25 శాతం మ్యాచ్ ఫీజును ఐసీసీ విధించినట్లు తెలుస్తున్నది. బౌలింగ్ చేసే సమయంలో వేలికి వాపు తగ్గడానికి ఒక క్రీమ్ రాసుకున్నాడు. అంపైర్లకు తెలియజేయకుండానే ఇలా క్రీమ్ రాసుకోవడాన్ని తప్పుపడుతూ మ్యాచ్ రిఫరీ ఆండా పైక్రాఫ్ట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే క్రీమ్‌ను బంతికి అప్లై చేయలేదని రిఫరీ తెలిపారు.

స్కోర్ బోర్డు :

ఆసీస్ తొలి ఇన్నింగ్స్ : 177 ఆలౌట్

భారత్ తొలి ఇన్నింగ్స్: 400 ఆలౌట్

ఆసీస్ రెండో ఇన్నింగ్స్ : 91 ఆలౌట్




First Published:  11 Feb 2023 3:44 PM IST
Next Story