వన్డే సిరీస్ కూడా టీమ్ ఇండియాదే.. సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్
భారత జట్టుకు ఈ ఏడాది వన్డేల్లో 38వ విజయం ఇది. ఆస్ట్రేలియా, ఇండియా విజయాలతో సమానంగా ఉన్నాయి.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకున్నది. ఇప్పటికే టీ20 సిరీస్ తమ ఖాతాలో వేసుకున్న టీమ్ ఇండియా.. మంగళవారం ఢిల్లీలో జరిగిన నిర్ణయాత్మక చివరి వన్డేలో ఘన విజయం సాధించి వన్డే సిరీస్ కూడా తమ ఖాతాలో వేసుకున్నది. మొదటి వన్డేలో భారత జట్టు ఓటమి పాలైనా.. పుంజుకొని తర్వాతి రెండు వన్డేల్లో అన్ని విభాగాల్లో అద్భుత ప్రతిభ కనపరిచి దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. సీనియర్ ప్లేయర్లు అందుబాటులోని సమయంలో, తాము కూడా సీనియర్లకు ఏం తీసిపోమంటూ జూనియర్లు అద్బుతంగా రాణించారు. టీమ్ ఇండియా బెంచ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో మరోసారి నిరూపించారు.
సిరీస్‌లో 1-1 విజయాలతో సమయంగా నిలవడంతో ఢిల్లీ నేడు జరిగిన వన్డే కీలకంగా మారింది. తొలి రెండు వన్డేల్లో దక్షిణాఫ్రికా ప్లేయర్లు బ్యాటుతో చక్కగా రాణించారు. కానీ మూడో వన్డేలో మాత్రం ఘోరంగా విఫలం అయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 27.1 ఓవర్లలో కేవలం 99 పరుగులకే ఆలౌట్అయ్యింది. భారత బౌలర్లు ఏ సమయంలో కూడా సఫారీలను కోలుకోనివ్వలేదు. ఈ సిరీస్‌లో తొలి సారిగా స్పిన్నర్లు తమ సత్తా చాటారు. ఓపెనర్ మలన్ (15), మిడిలార్డర్‌లో క్లాసెన్(34), మార్కో జన్‌సెన్ (14) తప్ప ఎవరూ రెండంకెల స్కోర్ దాటలేదు. సిరాజ్ కీలకమైన రెండు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో రాణించాడు. వాషింగ్టన్ సుందర్, షహబాజ్ కూడా చెరి రెండు వికెట్లు తీశారు. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో సౌత్ఆఫ్రికా 99 పరుగులకే చాపచుట్టేసింది.
100 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (49) తృటిలో హాఫ్ సెంచరీని కోల్పోయాడు. ఇషాన్ కిషన్ (10), శిఖర్ ధావన్ (8) విఫలమైనా.. శ్రేయస్ అయ్యర్ (22), గిల్‌తో కలసి టార్గెట్ సునాయాసంగా పూర్తి చేశారు. భారత జట్టుకు ఈ ఏడాది వన్డేల్లో 38వ విజయం ఇది. ఆస్ట్రేలియా, ఇండియా విజయాలతో సమానంగా ఉన్నాయి.
మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు వన్డేల్లో చెత్త రికార్డు నెలకొల్పింది. వన్డేల్లో ఇది సఫారీలకు నాలుగో అత్యల్ప స్కోరు. 1993లో ఆసీస్‌పై 63 పరుగులు, 2008లో ఇంగ్లాండ్‌పై 83 పరుగులు అత్యల్ప స్కోర్లు కాగా.. తాజాగా ఇండియాపై 99 పరుగులకు ఆలౌట్ కావడం నాలుగో అత్యల్ప స్కోరుగా నిలిచింది.
నాలుగు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కుప్పకూల్చిన కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో నిలకడగా బౌలింగ్ చేసి, వికెట్లు సాధించిన మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
స్కోర్ బోర్డు:
దక్షిణాఫ్రికా 99 ఆలౌట్ (27.1 ఓవర్లు)
ఇండియా 105/3 (19.1 ఓవర్లు)
Winners Are Grinners! ☺️
— BCCI (@BCCI) October 11, 2022
Captain @SDhawan25 lifts the trophy as #TeamIndia win the ODI series 2️⃣-1️⃣ against South Africa #INDvSA | @mastercardindia pic.twitter.com/igNogsVvqd