Telugu Global
Sports

వన్డే వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా న్యూ జెర్సీ విడుదల.. జెర్సీలో మార్పులు ఇవే

భారత క్రికెట్ జట్టు ఇటీవల అన్ని ఫార్మాట్లలో జెర్సీలను మార్చేసింది. కొత్త కిట్ స్పాన్సర్‌గా ఆడిడాస్ వచ్చిన తర్వాత పురుషుల, మహిళల జట్లకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు జెర్సీలను రూపొందించింది.

వన్డే వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా న్యూ జెర్సీ విడుదల.. జెర్సీలో మార్పులు ఇవే
X

ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఇండియా వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మెగా టోర్నీకి భారత జట్టు సిద్ధమవుతోంది. సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా పట్టుదలగా ఉన్నది. వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడి పూర్తిగా సన్నద్దం కావాలని భావిస్తోంది. ఇక వరల్డ్ కప్ కోసం భారత జట్టు కొత్త జెర్సీని ధరించనున్నది. కొత్త జెర్సీ ఎలా ఉండబోతోందనే విషయంపై ఇప్పటికే మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. తాజాగా బుధవారం భారత జట్టు కిట్ స్పాన్సర్ ఆడిడాస్ కొత్త జెర్సీతో కూడిన వీడియోను రిలీజ్ చేసింది.

భారత క్రికెట్ జట్టు ఇటీవల అన్ని ఫార్మాట్లలో జెర్సీలను మార్చేసింది. కొత్త కిట్ స్పాన్సర్‌గా ఆడిడాస్ వచ్చిన తర్వాత పురుషుల, మహిళల జట్లకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు జెర్సీలను రూపొందించింది. టీ20ల్లో కాలర్ లేని డార్క్ బ్లూ కలర్ జెర్సీలు, వన్డేల్లో కాలర్‌తో లైట్ బ్లూ కలర్ జెర్సీలు, టెస్టులకు సాంప్రదాయ వైట్ కలర్ జెర్సీలను అందజేస్తోంది. ఇక ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ కోసం గతంలో రూపొందించిన లైట్ బ్లూ కలర్ జెర్సీలోనే కొన్ని మార్పులతో విడుదల చేసింది.

భుజాలపై ఉండే మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో త్రివర్ణ పతాకంలోని మూడు రంగులను ఉంచింది. బీసీసీఐ లోగోపై ఉండే మూడు నక్షత్రాల స్థానంలో రెండు నక్షత్రాలనే ఉంచింది. 1983, 2011లో భారత జట్టు గెలిచిన రెండు వన్డే వరల్డ్ కప్‌లకు ప్రతీకగా వీటిని ఏర్పాటు చేసింది. ఇక ఎప్పటిలాగానే జెర్సీ కుడి వైపు ఆడిడాస్ లోగో, ఎడమ వైపు బీసీసీఐ టీమ్ లోగో ఉన్నది. ముందు వైపు టీమ్ స్పాన్సర్ డ్రీమ్ 11, దాని కింద ఆరెంజ్ కలర్ ఫాంట్, వైట్ ఎడ్జెస్‌తో ఇండియా అని రాసింది.

ఆడిడాస్ కంపెనీకొత్త జెర్సీ విడుదల కోసం రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియోను విడుదల చేసింది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్‌, శుభ్‌మన్ గిల్‌తో పాటు ఇతర ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


First Published:  20 Sept 2023 2:09 PM GMT
Next Story