Telugu Global
Sports

మెకోయ్ స్వింగ్‌లో భారత్ గల్లంతు!.. రెండో టీ-20లో తప్పని ఓటమి

మెకోయ్ స్వింగ్, పేస్ కు పవర్ ఫుల్ భారత బ్యాటింగ్ ఆర్డర్ కకావికల‌మైపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కాగా మరో ఓపెనర్ సూర్యకుమార్ 11, వన్ డౌన్ శ్రేయస్ అయ్యర్ 10 పరుగుల స్కోర్లకే వెనుదిరిగారు.

మెకోయ్ స్వింగ్‌లో భారత్ గల్లంతు!.. రెండో టీ-20లో తప్పని ఓటమి
X

భారత్- వెస్టిండీస్‌ జట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ నీకొకటి నాకొకటి అన్నట్లుగా సాగుతోంది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలిమ్యాచ్ లో భారత్ నెగ్గితే.. సెయింట్‌ కిట్స్ వేదికగా ముగిసిన రెండోమ్యాచ్ లో కరీబియన్ జట్టు విజేతగా నిలవడం ద్వారా 1-1తో సమఉజ్జీగా నిలిచింది.



మెకోయ్ స్వింగ్.. భారత్ కంగు..

సెయింట్ కిట్స్ ద్వీపంలోని వార్నర్ పార్క్ వేదికగా జరిగిన ఈ పోరులో ఆతిథ్య విండీస్ జట్టు ముందుగా కీలకటాస్ నెగ్గి ఫీల్గింగ్ ఎంచుకుంది. పేస్ బౌలర్ల స్వర్గంగా పేరుపొందిన వార్నర్ పార్క్ వికెట్ పై ఆతిథ్య ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఒబెడ్ మెకోయ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మెకోయ్ స్వింగ్, పేస్ కు పవర్ ఫుల్ భారత బ్యాటింగ్ ఆర్డర్ కకావికల‌మైపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కాగా మరో ఓపెనర్ సూర్యకుమార్ 11, వన్ డౌన్ శ్రేయస్ అయ్యర్ 10 పరుగుల స్కోర్లకే వెనుదిరిగారు. మిడిలార్డర్ ఆటగాళ్లు రిషబ్‌ పంత్ 24, హార్ధిక్ పాండ్యా 31, జడేజా 27, అశ్విన్ 10 పరుగులు చేయడంతో భారత్ 19.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. కరీబియన్ బౌలర్లలో మెకోయ్ ఒక్కడే తన కోటా 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. భారత్ ప్రత్యర్థిగా టీ-20ల్లో 6 వికెట్లు పడగొట్టిన తొలి విండీస్ బౌలర్ గా మెకోయ్ రికార్డుల్లో చేరాడు.



కింగ్ హోరుతో విండీస్ జోరు..

భారత్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన విండీస్ జట్టు 139 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగింది. ఓపెనర్ బ్రెండన్ కింగ్ 52 బాల్స్ లో 8 బౌండ్రీలు, 2 సిక్సర్లతో మెరుపు అర్ధ‌శతకం సాధించాడు. ఒక దశలో అలవోక విజయం సాధించగలదనుకున్న కరీబియన్ జట్టు వెంట వెంటనే 5 వికెట్లు నష్టపోవడం ద్వారా ఒత్తిడిలో పడిపోయింది. అయితే.. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ డేవన్ థామస్ 31 పరుగులతో అజేయంగా నిలవడంతో 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి విండీస్ జట్టు విజయం సొంతం చేసుకోగలిగింది. ఆఖరి ఓవర్లో డేవన్ ఓ సిక్సర్, ఓ బౌండ్రీ బాదడం ద్వారా తనజట్టుకు విజయం ఖాయం చేశాడు. భారత బౌలర్లలో స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ మినహా మిగిలిన వారంతా తలో వికెట్ పడగొట్టారు. 2019 తర్వాత సొంతగడ్డపై భారత్ ప్రత్యర్థిగా విండీస్ జట్టుకు టీ-20ల్లో ఇదే తొలిగెలుపు కావడం విశేషం.

First Published:  2 Aug 2022 9:29 AM IST
Next Story